వెహికల్స్ పేరిట కరోనా ఫండ్స్​ గోల్​మాల్​..  

వెహికల్స్ పేరిట కరోనా ఫండ్స్​ గోల్​మాల్​..  
  • అన్నీ బయట కంటే ఎక్కువ రేట్లకు కొన్నరు
  • కరీంనగర్‌లో ఆఫీసర్ల చేతివాటం
  • వెహికల్స్ పేరిట రూ.19.8 లక్షల బిల్లులు

కరీంనగర్, వెలుగు: కరోనా టైమ్​లో ప్రభుత్వం జిల్లాలకు ఎమర్జెన్సీ పేరుతో కోట్ల రూపాయల నిధులను అందించింది. వీటితో అత్యవసరమైన మెడికల్ వస్తువులు, సామగ్రి కొనుగోలు చేయాలని చెప్పింది. ఆఫీసర్లు ఇదే అవకాశంగా ఫండ్స్​ను పక్కదారి పట్టించారు. థర్మల్ స్కానర్లు, పీపీఈ కిట్లు, మాస్కులు.. అన్నీ ఎక్కువ రేట్లు పెట్టి కొనుగోలు చేసినట్లు బిల్లులు చూపిస్తున్నారు. బయట రేట్లకు.. వీళ్లు కొనుగోలు చేసిన రేట్లకు మధ్య తేడా భారీగా ఉండడంతో ఆఫీసర్ల తీరుపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కరీంనగర్ జిల్లా మెడికల్ డిపార్ట్ మెంట్ లో ఇలా భారీగా నిధులు పక్కదారి పట్టించారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. సాధారణంగా ఎక్కువ మొత్తంలో కొనుగోలు చేస్తున్నపుడు రేట్లు తక్కువ పడాలి.. కానీ ఆఫీసర్లు మాత్రం బయట దొరుకుతున్న దానికంటే ఎక్కువ రేటుకు కొనడం గమనార్హం.

థర్మల్ స్కానర్.. ఒక్కోటి రూ. 7,500
గత ఏడాది కరీంనగర్ లోనే మొదటగా కరోనా కేసులు బయటపడ్డాయి. ఇండోనేషియా వాళ్లు రావడంతో ఎక్కువ కేసులు నమోదయ్యాయి. దీంతో ఇంటింటి సర్వే చేయాలని సర్కారు నిర్ణయించింది. జిల్లాలో ఉన్న ఏఎన్ ఎంలు, ఆశాలు, సూపర్ వైజర్లను రంగంలోకి దింపి సర్వే చేయించారు. జ్వరం సర్వే చేయడానికి వీరికి థర్మల్ స్కానర్లు కూడా అందించారు. డీఎంహెచ్ వో ఆఫీస్​నుంచే వీటిని కొనుగోలు చేశారు. సాధారణంగా థర్మల్ స్కానర్ రూ. వెయ్యి మించి లేదు. బ్రాండెడ్​థర్మల్​స్కానర్​సైతం రూ. 2 వేలకే దొరుకుతోంది. కానీ కరీంనగర్  జిల్లా డీఎంహెచ్ వో ఆఫీసర్లు మాత్రం ఒక్కో థర్మల్ స్కానర్ రూ. 7,500 చొప్పున 100 కొన్నారు. దీనికి జీఎస్టీ 12 శాతం అదనం.  మొత్తం కలిపి రూ. 8.4 లక్షల బిల్లు అయింది. కానీ సదరు ఆలీవ్ సంస్థకు చెల్లించింది మాత్రం రూ. 8.85 లక్షలు. ఇందులో గమ్మత్తైన విషయం ఏమిటంటే వీళ్లు ఆర్డర్ పెట్టి కొనుగోలు చేసిన కంపెనీ నుంచి ఒక్కోదానికి రూ. 7,500 .. ఇందులోనే 18 శాతం జీఎస్టీ అని  ఇచ్చారు. కానీ ఇక్కడికి వచ్చాక మాత్రం దాన్ని మార్చేశారు. ఇందులో ఒక్కోదానికి రూ. 7,500 తోపాటు అదనంగా జీఎస్టీ 12 శాతం చేశారు. అంటే రూ. 90 వేలు అదనంగా రాసుకున్నారు. అసలే థర్మల్ స్కానర్లు ఎక్కువలో ఎక్కువగా వెయ్యి రూపాయలు. అంటే ఇందులోనే రూ. 6.5లక్షలు, జీఎస్టీ పేరుతో రూ. 90 వేలు.. ఇలా ఏడున్నర లక్షలు పక్కదారి పట్టించారు.

రెండు వేలకు ఒక ఆక్సీమీటర్
కరోనా వచ్చిన వారికి గతంలో ఐసోలేషన్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఇందులో ఉన్నవారికి ఆక్సిజన్ లెవల్స్ చూడడానికి పల్స్ ఆక్సీ మీటర్లు కొన్నారు. ఇవి సాధారణంగా బయట రూ. 500కు దొరుకుతుంటే ఆఫీసర్లు మాత్రం ఒక్కోటి రూ. 2 వేలు చొప్పున 30 కొన్నారు. ఒక్కోదాని మీద రూ. 1,500 ఎక్కువ పెట్టి కొనాల్సిన అవసరం ఎందుకొచ్చిందో అర్థం కావడం లేదు. ఇలా సుమారు రూ. 45 వేలు పక్కదారి పట్టించారు.

లక్షల్లో వెహికల్స్​బిల్లు
కరోనా టైమ్ లో మూడు నెలల పాటు అన్ని పీహెచ్ సీలకు మెడికల్ ఆఫీసర్ల మొబిలిటీ కోసం వెహికల్స్​సమకూర్చి నట్లు రాశారు. జిల్లాలో ఉన్న 20 పీహెచ్‌‌‌‌‌‌‌‌ సీల్లో(నాలుగు అర్బన్ హెల్త్ సెంటర్లు కలిపి) ఒక్కో నెల రూ. 33 వేల చొప్పున మూడు నెలల పాటు తిప్పినట్లుగా సుమారు రూ. 19.8 లక్షల వరకు బిల్లులు రాసుకున్నారు.  అసలు పీహెచ్ సీల్లో వెహికల్స్​పెట్టిన దాఖలాలే లేవు. కరోనా ఉన్న టైమ్ లో(జులై నుంచి సెప్టెంబర్ వరకు) అసలు క్షేత్ర స్థాయిలో వెహికల్స్ తిరిగాయా లేదా అన్న క్లారిటీ లేదు. రెంట్ కు ఎంగేజ్ చేసిన వెహికల్స్ నంబర్ల సమాచారం ఇవ్వలేదు.  అసలు ఈ వెహికల్స్ ఎటు వెళ్లాయి, ఎన్ని రోజులు తిరిగాయి, ఎందుకు తిరిగాయనే వివరాలు ఎక్కడా లేవు.

ఎన్ 95 ఒక్కోటి రూ.400
కరోనా టైమ్ లో ఎన్ 95 మాస్కులు 250 కొన్నారు. వీటి ధర ఒక్కోటి రూ. 400 వేశారు.  పోయిన ఏడాది కూడా ఇంత రేట్లు లేవు. గరిష్ఠంగా రూ. 250 నుంచి 300 వరకు మాస్కుల ధరలు ఉన్నాయి. అయినా కావాలనే ఎక్కువ పెట్టి కొనుగోలు చేశారు. ఇక శానిటైజర్ డబ్బాలు కొన్నామని చెప్పినా.. బల్క్ గా లూజ్ లిక్విడ్ తీసుకుని బాటిళ్లలో నింపారనే ఆరోపణలు ఉన్నాయి. పాంప్లేట్ల మీద రూ. 80 వేలు ఖర్చు చేశారు. ఒక్కో దానికి రూ. 40 చొప్పున 2 వేలు ముద్రించినట్లు రాసుకున్నారు. ఇలా ప్రతిదాంట్లోనూ ఆఫీసర్లు చేతివాటాన్ని ప్రదర్శించారు. 

విచారణ చేపట్టాలి
కరోనా టైమ్ లో వచ్చిన ఫండ్స్ ను అధికారు లు  ఇష్టారీతిగా ఖర్చు చేశారు. థర్మల్ స్కానర్లకు ఒక్కోదానికి రూ. 7,500, మళ్లీ దీనిపై అదనంగా జీఎస్టీ చూపించారు. వెయ్యి ఉన్నదాన్ని ఇంత ఎక్కువ పెట్టి ఎందుకు కొన్నారు. బిల్లుల ప్రోసీడింగ్స్ నే మార్చారు. పల్స్ ఆక్సీమీటర్ సైతం ఎక్కువ పెట్టి కొన్నారు. ఇదంతా అధికారులు కుమ్మక్కై చేసిందే. దీని మీద ఉన్నతాధి కారులు విచారణ చేపట్టాలి. బాధ్యులైన అధికారులపై చర్యలు తీసుకోవాలి.  
- మహ్మద్ ఆమీర్, సామాజిక కార్యకర్త, కరీంనగర్​