Medaram Jatara 2024: కోళ్లు, యాటల కోసం కష్టాలు..

Medaram Jatara 2024: కోళ్లు, యాటల కోసం కష్టాలు..

మేడారం నెట్​వర్క్​, వెలుగు:  గద్దెలపై కొలువుదీరిన సమ్మక్కసారక్కలను దర్శించుకునేందుకు మూడోరోజు మేడారానికి భక్తులు భారీగా తరలివచ్చారు. కిక్కిరిసిన క్యూలైన్లలో  గంటల తరబడి వేచిచూసి మరీ అమ్మలకు మొక్కులు అప్పజెప్పారు. జంపన్నవాగులో స్నానాలు ఆచరించి, నేరుగా దర్శనానికి వచ్చారు. ఎత్తు బెల్లం, ఒడిబియ్యం, సారె, చీరెలు సమర్పించి, పిల్లాజెల్లా, గొడ్డుగోదను చల్లంగ చూడాలని వేడుకున్నారు. శుక్రవారం ఏకంగా 50 లక్షల మంది భక్తులు రావడంతో గద్దెల వద్ద తీవ్ర రద్దీ నెలకొన్నది.

ఇదిలా ఉంటే.. మేడారం జాతరకు కోటి దాకా భక్తులు రావడంతో మేకలు, కోళ్లు ఖాళీ అయిపోయాయి. ఎక్కడ చూసినా ఖాళీ షాపులే కనిపి స్తున్నాయి. మేడారంలో ప్రైవేటువి కాకుండా ప్రభుత్వం తరఫున 100 షాపులు వెలిసినా ఎక్కడా కోళ్లు కనిపించట్లేదు. ఒక్కో కోడికి రూ.500 పెట్టాల్సి వస్తున్నది. మేకల పరిస్థితీ ఇట్లనే ఉంది. యాటకు రూ.10 వేల నుంచి 12 వేలు పలుకుతోంది. పరిసర గ్రామాలైన నార్లాపూర్​, వెంగళాపూర్​, ఊరట్టం, రెడ్డిగూడెం, తాడ్వాయి, కొత్తూరు గ్రామాలకు వెళ్లినా దొరకట్లేదు. ఈ వార్త పాకడంతో సమీప గ్రామాల్లో రేట్లు పెంచారు.