పార్లమెంట్​ ఎన్నికలు .. గొడం నగేశ్​కు అగ్నిపరీక్ష

 పార్లమెంట్​ ఎన్నికలు ..  గొడం నగేశ్​కు అగ్నిపరీక్ష
  • సొంత పార్టీ నేతల నుంచి అసంతృప్తి సెగలు
  •     బీజేపీ టికెట్ దక్కించుకున్నా.. ఇంకా దక్కని నేతల మద్దతు
  •     అసంతృప్తులను బుజ్జగించే పనిలో హైకమాండ్​

ఆదిలాబాద్, వెలుగు:   ఆదిలాబాద్ బీజేపీ అభ్యర్థి గొడం నగేశ్ కు పార్లమెంట్​ ఎన్నికలు అగ్ని పరీక్షలా మారాయి.  సిట్టింగ్ ఎంపీగా ఉన్న సోయం బాపురావును కాదని, ఇటీవల బీఆర్ఎస్ నుంచి బీజేపీలో చేరిన గొడం నగేశ్ కు ఆ పార్టీ ఎంపీ టికెట్ ఇచ్చిన విషయం తెలిసిందే. బీజేపీలో ఎన్నో ఏళ్లుగా పనిచేస్తున్న సీనియర్లను, సిట్టింగ్ ఎంపీని కాదని టికెట్ దక్కించుకున్న నగేశ్​కు ఇప్పుడు అసంతృప్త నేతల నుంచి అసలు సవాల్​ ఎదురవుతోంది. ఇన్నాళ్లూ పార్టీని నమ్ముకున్నవాళ్లను పక్కనపెట్టి 2019లో బీజేపీ చేతిలో ఓడిపోయిన అభ్యర్థికి ఎట్లా ఇస్తారని కమలం నేతలు ఓపెన్​గా విమర్శిస్తున్నారు. ఈ ప్రభావం కాస్తా నగేశ్ ఎన్నికల ప్రచారం పై ఎక్కడ పడ్తుందోనని హైకమాండ్​లో టెన్షన్​ మొదలైంది. 

బుజ్జగింపులు ఫలించేనా..

ఎన్నికల ప్రచారానికి సిద్ధమవుతున్న నగేశ్​కు స్థానిక నేతలు సహకరించడం లేదని తెలిసిన పార్టీ పెద్దలు రంగంలోకి దిగారు. ఆదివాసీల్లో బలమైన నాయకుడిగా పేరున్న సోయం మద్దతు లేకుంటే నగేశ్​ గెలుపు అంత ఈజీ కాదు.  ఈ విషయం తెలిసే  పార్టీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి సోయంకు నామినేటెడ్ పదవి ఆఫర్ చేసినట్లు తెలిసింది. పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో పాటు సీనియర్ లీడర్ బీఎల్ సంతోష్ తో కల్పించి నామినేటెడ్ పదవిపై  హామీ ఇచ్చినట్లు ప్రచారం జరుగుతోంది.  కేంద్రంలో అధికారంలోకి వచ్చిన వెంటనే పదవి ఇస్తామని, ఎంపీ అభ్యర్థి నగేశ్ కు సహకరించాలని కోరినట్లు తెలిసింది. సోయంతో పాటు టికెట్ ఆశించిన  మాజీ ఎంపీ రాథోడ్ రమేశ్, బోథ్ మాజీ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు, జాదవ్ రాజేశ్ బాబు ఇంకా అసంతృప్తిలోనే ఉన్నారు. వీరికి ఇంత వరకు పార్టీ నుంచి ఎలాంటి హామీ రాలేదు. ఈక్రమంలో ఇటీవల కేంద్ర మంత్రి అర్జున్ ముండా తలమడుగు పర్యటనకు ఈ నేతలంతా గైర్హాజరయ్యారు.  దీంతో వచ్చే ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థికి వీరి మద్దతు అనుమానమే అని భావిస్తున్నారు.

ఆ మూడు సెగ్మెంట్లలో కనిపించని సందడి..

ఆదిలాబాద్​ పార్లమెంట్ స్థానం​పరిధిలో బీజేపీకి నలుగురు ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం వహిస్తున్నప్పటికీ ఇప్పటి వరకు ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ మినహా నిర్మల్, ముథోల్, సిర్పూర్ కాగజ్ నగర్ ఎమ్మెల్యేలెవరూ నగేశ్​తో టచ్​లోకి వెళ్లకపోవడం చర్చనీయాంశంగా మారింది.  ఎమ్మెల్యే పాయల్ శంకర్ ప్రస్తుతం పార్లమెంట్ ఇన్​చార్జిగా ఉన్నారు. ఆయన ఆధ్వర్యంలో కేవలం ఆదిలాబాద్​ సెగ్మెంట్​ పరిధిలో మాత్రమే నగేశ్​ ప్రచారం కొనసాగుతోంది.  మిగతా మూడు అసెంబ్లీ సెగ్మెంట్లలో మాత్రం ఎన్నికల సందడి కనిపించడం లేదు. ఇతర పార్టీలకంటే ముందుగానే బీజేపీ తన అభ్యర్థిని ప్రకటించినప్పటికీ ఇప్పటి వరకు పూర్తి స్థాయిలో  ప్రచారం ప్రారంభం కాకపోవడానికి పార్టీలో విభేదాలే కారణమని తెలుస్తోంది.  ఈ క్రమంలో నేతలందరినీ సమన్వయం చేయడం కొత్తగా వచ్చిన నగేశ్​కు సాధ్యమయ్యే పరిస్థితి లేకపోవడంతో హైకమాండ్​ఎలాంటి చర్యలు తీసుకుంటుందనేది ఆసక్తిగా మారింది.