సాయం కోసం ‘గోదావరి’ బాధిత రైతుల ఎదురుచూపులు

సాయం కోసం ‘గోదావరి’ బాధిత రైతుల ఎదురుచూపులు

భద్రాచలం, వెలుగు: గోదావరి వరదలతో 10,831 ఎకరాల్లో పంట నష్టం జరిగింది. సర్వేలు చేసి చేతులు దులుపుకున్న సర్కారు పరిహారం విషయంలో ఎలాంటి ప్రకటన చేయకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. సర్కారు ప్రకటన కోసం ఎదురుచూస్తున్నారు. 7417 ఎకరాల్లో వరి, 3305 ఎకరాల్లో పత్తి, 7 ఎకరాల్లో పెసర, 102 ఎకరాల్లో పచ్చిరొట్ట, 25 ఎకరాల్లో కూరగాయలు, 8 ఎకరాల్లో పసుపు, 2 ఎకరాల్లో డ్రాగన్ ఫ్రూట్స్  తోటలు గోదావరి వరదల్లో మునిగిపోయాయి. 99 గ్రామాల్లో 5047 మంది రైతులు రూ.6.25 కోట్లు నష్టపోయారని, ఒక్కో ఎకరానికి రూ.5400 వరకు నష్టం వాటిల్లినట్లు నివేదిక పంపించారు. అయితే నివేదిక ప్రభుత్వానికి చేరినా పరిహారం ఇచ్చే విషయంలో ఎలాంటి ప్రకటన చేయకపోవడంతో అసలు పరిహారం ఇస్తారా.. లేదా అని బాధిత రైతులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. భద్రాచలం టౌన్  శివారులోని అశోక్  అరటితోటను సాగు చేశాడు. ఆయన ఒకసారి మాత్రమే అరటి గెలలు కోశాడు. రెండో సారి పంట వచ్చే దశలో వరదలు తోటకు నష్టం చేశాయి. రూ.6లక్షల వరకు నష్టం వచ్చింది. నాలుగేళ్ల క్రితం ఇదే రైతు సాగు చేసిన అరటి తోట అకాల వర్షంతో నేలకొరిగింది. రూ.14 లక్షల వరకు నష్టం వాటిల్లింది. దెబ్బ మీద దెబ్బ పడి కోలుకోలేక పోతున్న ఈ రైతు సాయం కోసం ఎదురు చూస్తున్నాడు. బూర్గంపాడు మండలం సంజీవరెడ్డిపాలెం గ్రామానికి చెందిన భాస్కర్​రెడ్డి 15 ఎకరాల్లో పత్తి పంటను సాగు చేస్తే వరదలు ముంచెత్తాయి. ఆయన పెట్టిన పెట్టుబడి నష్టపోయాడు. ఇప్పుడు మళ్లీ పంట వేయాలంటే పెట్టుబడి కోసం దిక్కులు చూడాల్సిన దుస్థితి. ఇదే మండలంలో మజీద్  రెండెకరాల్లో సాగు చేసిన డ్రాగన్ ఫ్రూట్స్ గోదావరి వరదలతో కుళ్లిపోయింది. రూ.20 లక్షలకు పైగా నష్టం వచ్చింది. 

ఆఫీసర్లు పట్టించుకుంటలే..

అప్పులు చేసి అరటితోట సాగు చేసిన. పంట చేతికొచ్చే సందర్భంలో గోదావరి వరదలతో నష్టం జరిగింది. నాలుగేళ్లుగా ఇదే పరిస్థితి ఉంది. ప్రభుత్వం నుంచి సాయం  వస్తుందో లేదో ఆఫీసర్లు చెప్తలే..

- అశోక్, అరటి రైతు, భద్రాచలం

కొత్త రుణాలు ఇవ్వాలి

పాత రుణాలు రద్దు చేసి కొత్త రుణాలు ఇవ్వాలి. ఇప్పటికే అన్ని రకాల సబ్సిడీలు రద్దయ్యాయి. రైతుబంధు ఇచ్చినా కౌలు రైతులకు రావడం లేదు. గోదావరి వరదలతో నష్టపోయిన రైతులకు పరిహారంతో పాటు రుణాలు మంజూరు చేసి ఆదుకోవాలి.

- అబ్బినేని శ్రీనివాసరావు, 
పీఏసీఎస్ చైర్మన్,భద్రాచలం

పరిహారం వెంటనే ఇవ్వాలి

పంట నష్టపోయిన రైతులకు ఎకరానికి రూ.25 వేల పరిహారం ఇవ్వాలి. సర్వేలతో కాలయాపన చేయడం సరైంది కాదు. ఇప్పటి వరకు సాయంపై ప్రకటన చేయకపోవడం శోచనీయం.
- మచ్చా వెంకటేశ్వర్లు, వ్యవసాయ కార్మిక సంఘం, జిల్లా కార్యదర్శి