
- తెలంగాణ అంశాలకు అనుమతి లేదంటూ వ్యాఖ్య
- అళగేశన్ మీద వచ్చిన ఆరోపణలపై విచారణ కమిటీ ఏర్పాటుకు నిరాకరణ
- ఏపీ అధికారులకు పట్టం.. అర్హత లేకపోయినా ఈఈ, ఎస్ఈలుగా ప్రమోషన్లు
- మన అధికారుల డిప్యూటేషన్‌కు మాత్రం నో చెబుతూ కొర్రీలు
హైదరాబాద్, వెలుగు: తెలంగాణ అభ్యంతరాలను గోదావరి రివర్‌మేనేజ్‌మెంట్ బోర్డు (జీఆర్ఎంబీ) పట్టించుకోలేదు. బోర్డు మెంబర్‌సెక్రటరీ అళగేశన్పై వచ్చిన ఆరోపణల మీద విచారణ చేయించేందుకు ఓ కమిటీని ఏర్పాటు చేయాల్సిందిగా తెలంగాణ కోరినా వినిపించుకోలేదు. ఈ అంశపై తెలంగాణ తరఫున మెంబర్‌గా ఉన్న ఈఎన్సీ జనరల్అనిల్కుమార్ ప్రతిపాదనలను కొట్టిపారేసింది. గోదావరి బోర్డుకు సంబంధించిన అంశాల్లో కృష్ణా బోర్డు సభ్యులు, చైర్మన్‌గా కమిటీని వేయలేమంటూ తేల్చిచెప్పింది.
ఈ మేరకు ఏప్రిల్7న నిర్వహించిన 17వ బోర్డు మీటింగ్‌కు సంబంధించిన మినిట్స్తుది నివేదికను తాజాగా విడుదల చేసింది. దాని ప్రకారం.. మన అధికారులు పేర్కొన్న అంశాలను చర్చించేందుకు గోదావరి బోర్డు నిరాకరించింది. అనుమతి లేని అంశాలను చర్చించేందుకు తెలంగాణ ప్రయత్నించిందని రివర్స్‌లో ఆరోపించింది. అవసరమైతేనే కమిటీని వేస్తామని చెప్పినట్టు మినిట్స్‌లో వెల్లడించింది. ఏకపక్ష ఎజెండాతో మీటింగ్‌కు సంబంధించిన మినిట్స్‌ను రిలీజ్ చేసింది.
కేంద్రం రూల్సే ఫాలో అవుతారట..
బోర్డులో ఔట్సోర్సింగ్ఉద్యోగుల నియామకానికి కేంద్ర ప్రభుత్వ నిబంధనలే ఫాలో అవుతామని మినిట్స్‌లో బోర్డు చైర్మన్ వెల్లడించారు. కనీస వేతనాలకు అనుగుణంగా ఉద్యోగులను నియమిస్తామని ఏకపక్షంగా స్పష్టం చేశారు. అంతేగాకుండా.. సెక్యూరిటీ, క్లీనింగ్ సిబ్బంది సేవలను ఉపసంహరించుకుంటున్నట్టు తెలిపారు. ఈ విషయంలో ఇంక చర్చకు తావులేదని పేర్కొన్నారు. మరోవైపు గోదావరిపై ఉమ్మడి ప్రాజెక్టు పెద్దవాగు ఒక్కటేనని, దానిని ఇచ్చేందుకు అభ్యంతరం లేదని తెలంగాణ పేర్కొన్నట్టు మినిట్స్ లో వెల్లడించారు. మిగతా ప్రాజెక్టులను ఇచ్చేది లేదని తెలంగాణ స్పష్టం చేసినట్టు వివరించారు. ఏపీ మాత్రం ప్రాజెక్టులను అప్పగించేందుకు ఓకే చెప్పిందన్నారు.
ఏపీ అధికారులకు పెద్దపీట..
తెలంగాణ అధికారులపై వివక్ష చూపిస్తూ వారికి ఎక్స్టెన్షన్ఇవ్వకుండా ఇబ్బందులకు గురి చేస్తున్న గోదావరి బోర్డు.. ఏపీ ఉద్యోగులకు మాత్రం పెద్దపీట వేసింది. అర్హత లేకున్నా ప్రమోషన్లను కల్పించింది. ప్రస్తుతం బోర్డులో ఇన్చార్జి ఎస్ఈగా పనిచేస్తున్న ఏపీ అధికారికి పూర్తి స్థాయి ఎస్ఈగా బాధ్యతలు అప్పగించింది. అర్హతల విషయంలో సడలింపులు ఇస్తున్నట్టు తెలిపింది. అదేవిధంగా ఏపీ కేడర్ డీఈఈకి ఈఈగా అవకాశం కల్పించింది. ఇద్దరికీ అర్హత లేకపోయినా సడలింపులు ఇచ్చి ప్రమోషన్లు కల్పించిన బోర్డు.. మన అధికారుల విషయానికి వచ్చే సరికి మాత్రం కొర్రీలు పెడుతున్నది. సిబ్బంది కొరత దృష్ట్యా పలువురు అధికారుల డిప్యూటేషన్‌ను పెంచాలని ఈఎన్సీ లేఖ రాసినా బోర్డు కొట్టిపారేస్తూ నిబంధనలకు విరుద్ధమంటూ పేర్కొనడం గమనార్హం.