గోదావరి వరద భయం తగ్గినా వెంటాడుతున్న విష పురుగులు

గోదావరి వరద భయం తగ్గినా వెంటాడుతున్న విష పురుగులు

భద్రాచలం, వెలుగు : భారీ వర్షాలతో గోదావరి వరద ఉధృతి పెరిగి భద్రాచలం మన్యాన్ని ఆగమాగం చేసింది. రెండు రోజులుగా వానలు తగ్గుముఖం పట్టి వరద భయం వీడినా ఇండ్లల్లో, వాడల్లో పాములు, తేళ్లు, మొసళ్లు చేరి గజగజ వణికిస్తున్నాయి. కాటేస్తూ ప్రాణాలు తీస్తున్నాయి. వరదలకు అడవుల్లోని విషపురుగులు ఊర్లలోకి రావడంతో ఎప్పుడు ఏ ప్రమాదం బారిన పడవలసి వస్తుందోనని జనాలు ఆందోళన చెందుతున్నారు. మూడు రోజుల కింద కరకగూడెం మండలం రఘునాథపాలెంలో పోలెబోయిన నాగలక్ష్మిని తేలు కాటు వేయడంతో చనిపోయింది. మణుగూరు మండలం పగిడేరు వరదలకు మునగడంతో రెండు రోజుల కింద ఓ తాచుపాము గ్రామానికే చెందిన తెల్లం బుచ్చిరాములు టూవీలర్​సీటు కింది భాగంలో దూరింది. డ్రైవింగ్ చేస్తున్న టైంలో బయటకు వచ్చి కాలుపై కాటేసింది. వెంటనే ఆయనను మణుగూరు ఏరియా దవాఖానాకు తరలించారు. మంగళవారం ఉదయం అశ్వాపురం మండలం నెల్లిపాక వద్ద గోదావరి వరదలకు ఓ మొసలి కొట్టుకువచ్చింది. పంట పొలాల్లో ఉండడంతో స్థానికులు గుర్తించి యానిమల్​రెస్క్యూ టీంకు సమాచారమిచ్చారు. వారు దాన్ని పట్టుకుని తీసుకువెళ్లారు. భద్రాచలంలోని శ్రీరామసదనం వంద గదుల సత్రంలోకి తాచుపాము వచ్చింది. గుర్తించిన సిబ్బంది దాన్ని చంపేశారు. ఇలా భద్రాచలం టౌన్​తో పాటు మన్యంలో ఏదోచోటా విష పురుగుల భయం వెంటాడుతూనే ఉంది.  

పునరావాస కేంద్రాల నుంచి రావొద్దు 
గోదావరి తగ్గుతున్నా ప్రమాద హెచ్చరికలను కొనసాగించాలని కలెక్టర్​ అనుదీప్​ దురిశెట్టి నిర్ణయించారు. మంగళవారం సాయంత్రం 5 గంటలకు 50.9 అడుగులకు గోదావరి నీటిమట్టం తగ్గినా మూడో ప్రమాద హెచ్చరికను కొనసాగిస్తూనే ఉన్నారు. ప్రస్తుతం 13,06,618 క్యూసెక్కుల వరద ప్రవహిస్తోంది. పునరావాస కేంద్రాల్లో ఉండే వారెవరూ బయటకు రావొద్దని, ఇండ్లకు వెళ్లి శుభ్రం చేసుకుని తిరిగి కేంద్రాలకు వచ్చేయాలని కలెక్టర్​విజ్ఞప్తి చేస్తున్నారు. కేంద్రాల్లో భోజనం ఆలస్యమవుతున్న నేపథ్యంలో భద్రాచలం టౌన్​లో మూడు చోట్ల ఆఫీసర్లు భోజన తయారీ కేంద్రాలను ఏర్పాటు చేసి సరఫరా చేస్తున్నారు. 5వేల మందికి సకాలంలో భోజనం, టిఫిన్​ అందించేందుకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు కలెక్టర్​ ప్రకటించారు. 

త్వరలోనే అకౌంట్లలో రూ. 10 వేలు
ప్రభుత్వం నుంచి వచ్చే 25 కిలోల ఉచిత బియ్యంతో పాటు కందిపప్పును బాధిత కుటుంబాలకు పంపిణీ చేస్తున్నారు. బాధితుల లెక్క పూర్తయ్యాక రూ.10వేలు డైరెక్ట్​గా వారి ఖాతాల్లో జమ చేస్తామని కలెక్టర్​ చెప్పారు. 

16 మోటార్లతో పంపింగ్​
భద్రాచలం రామాలయ పరిసరాలను ముంచిన డ్రైన్​బ్యాక్​వాటర్​ను సింగరేణి నుంచి తెప్పించిన భారీ మోటార్ల సాయంతో యుద్ధప్రాతిపదికన తోడేస్తున్నారు. 16 మోటార్లతో మురుగునీటిని పంపింగ్​చేస్తున్నారు. దీంతో మంగళవారం ఉదయం 3 అడుగుల మేర వరదను తగ్గించగలిగారు. 

నల్లాలు శుభ్రం చేసుకోండి
వరద తగ్గడంతో మిషన్​భగీరథ ఆఫీసర్లు ఇప్పుడిప్పుడే నీటి సరఫరా మొదలుపెట్టారు. అయితే నల్లాలు వరద నీటి నుంచి బయటపడగా వాటిని శుభ్రం చేయకుండా వాడితే కలుషిత నీళ్లు వచ్చే ప్రమాదం ఉందని చెబుతున్నారు. అంతా నల్లాలను శుభ్రం చేసుకున్న తర్వాతే వాడుకోవాలని కోరుతున్నారు. దీని కోసం దండోరా వేయించడంతో పాటు ఆటోలో ప్రచారం చేస్తున్నారు. క్లోరినేషన్​ చేసి సరఫరా చేస్తున్నా నీళ్లను వేడి చేసి చల్లార్చిన తర్వాతే తాగాలని విజ్ఞప్తి చేస్తున్నారు. వైద్యారోగ్య శాఖాధికారులు ఆశా కార్యకర్తలు, ఏఎన్ఎంల ద్వారా క్లోరిన్​ట్యాబ్లెట్లు పంపిణీ చేస్తున్నారు. మరోవైపు వరద నుంచి బయటపడ్డ ఇండ్లను శుభ్రం చేసుకోవాలంటే నీటి కొరత వేధిస్తోంది. ట్యాంకర్ల ద్వారా పంచాయతీలు సరఫరా చేస్తున్నా సరిపోవడం లేదు. భద్రాచలం టౌన్​లోని సుభాష్​నగర్​ కాలనీలో ఇండ్లను కడుక్కునేందుకు డ్రైన్​బ్యాక్​వాటర్​నే వినియోగిస్తున్నారు.