వరదొస్తే రోడ్డునపడాల్సిందే.. ఏటా ఇంతే

వరదొస్తే రోడ్డునపడాల్సిందే.. ఏటా ఇంతే

ఖమ్మం జిల్లా: ఒక్కసారి వరదొస్తేనే సర్వం కోల్పోయి రోడ్డున పడతాం. అలాంటిది  ప్రతి ఏటా  వస్తే  పరిస్థితి  ఎలా ఉంటుందో ఊహించుకోండి. వరదలు వచ్చిన  ప్రతిసారి అంతా  కోల్పోవుడే..తిరిగి మళ్లీ  కోలుకునే టైంలో...ఉగ్రరూపం  దాల్చుతున్న గోదారి, కిన్నెరసాని నదులు..బూర్గంపాడు జనాన్ని కోలుకోలేని దెబ్బతీస్తున్నాయి.. ఇది చాలదన్నట్టూ  కొత్తగా నిర్మిస్తున్న పోలవరం  ప్రాజెక్టు మరింత ముంపునకు గురిచేస్తోంది. 

గోదావరి, కిన్నెరసాని ఈ నదుల పేర్లు చెబితే ఖమ్మం జిల్లా బూర్గంపాడు వాసులకు వణుకు పుడుతోంది. ఏటా వచ్చే వరదలతో సర్వస్వం కోల్పోతుండటంతో... కన్నీటి పర్యంతం అవుతున్నారు. వరదలు వచ్చిన ప్రతీసారి దు:ఖమే మిగులుతోందంటున్నారు బూర్గంపాడులోని ఎస్సీ కాలనీకి చెందిన వరద బాధితులు. కష్టపడి పండించుకున్న దంతా గోదావరిలో కొట్టుకుపోతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వరదలు వచ్చినప్పుడల్లా కట్టు బట్టలతో బయటకు రావాల్సిన పరిస్థితి వస్తుందని వాపోతున్నారు. గోదావరి ఉగ్రరూపంతో మండల ప్రజలు ప్రాణాలను అర చేతిలో పెట్టుకని పిల్లా, పాపలతో రాత్రికి రాత్రే పునారావాస కేంద్రాలకు తరలిపోయామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఏటా గోదావరి వరదల్లో తాము నష్టపోతున్నా ప్రజా ప్రతినిధులు, అధికారులు పట్టించుకోవడం లేదంటున్నారు వరద బాధితులు. ముంపు లేని ప్రాంతాల్లో తమకు నివాసం కల్పిస్తే అక్కడికి వెళ్తామంటున్నారు. మండల పరిధిలోని సురక్షిత ప్రాంతాల్లో ఉన్న ప్రభుత్వ భూముల్లో తమకు ఇంటి స్థలాలు కేటాయించాలని డిమాండ్ చేస్తున్నారు.
ఇప్పటికే వరదలతో ఇబ్బందులు పడుతున్నామని, పోలవరం ప్రాజెక్టు పూర్తయితే బూర్గంపాడులోని చాలా ప్రాంతాలు ముంపుకు గురైతాయని ఆందోళన చెందుతున్నారు స్థానికులు. ఏటా గోదావరి వరద 53 అడుగులకు చేరగానే తమ ప్రాంతాల్లోకి గోదావరి వరద నీరొచ్చి చేరుతుందంటున్నారు. పోలవరం బ్యాక్ వాటర్ తో బూర్గంపాడుకు ముంపు తప్పదని సాగునీటి రంగ నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇంత ప్రమాదం పొంచి ఉన్నా స్థానిక ప్రజా ప్రతినిధులు నోరు మెదపకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు స్థానికులు.ఇప్పటికైనా ఏపీ, తెలంగాణ రాష్ట్రాలు పోలవరం ప్రాజెక్టు బ్యాక్ వాటర్ పై అధ్యయనం చేయాలంటున్నారు. ముంపు ప్రాంతాల రక్షణ కోసం చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.