అలంపూర్ జోగులాంబ నిజరూప దర్శనం..పులకించిన భక్తజనం

అలంపూర్ జోగులాంబ నిజరూప దర్శనం..పులకించిన భక్తజనం

అలంపూర్, వెలుగు: అలంపూర్  జోగులాంబ అమ్మవారు శుక్రవారం వసంత పంచమిని పురస్కరించుకొని నిజరూపంలో దర్శనమిచ్చారు. వార్షిక బ్రహ్మోత్సవాల చివరి రోజు అర్చకులు వేద మంత్రోచ్ఛరణల నడుమ పంచామృతాలు, సుగంధద్రవ్యాలు, పసుపు, కుంకుమ జలాలతో అమ్మవారిని అభిషేకించారు. ఈ సుందర దృశ్యాన్ని తిలకించేందుకు భక్తులు పోటెత్తారు. 

జోగులాంబ సేవాసమితి అధ్యక్షుడు బండి శ్రీనివాస్  హరిచంద్ర ఘాట్ లో అష్టబుజ్జి జోగులాంబ గంటలేశ్వర ఆలయం నుంచి శోభయాత్ర  ప్రారంభించారు. గ్రామదేవతల వేషధారణతో 40 మంది కళాకారుల నృత్యాల మధ్య జోగులాంబదేవి శకటం ముందుకు కదిలింది. భక్తులు కళశాలతో ఊరేగింపుగా తరలిరావడంతో అలంపూర్  పట్టణంలో ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. భక్తులకు పుష్కర ఘాట్ లో  అన్నదానాన్ని ఏర్పాటు చేశారు.

సహస్ర కలశాలకు ప్రత్యేక పూజలు

అమ్మవారి ఆలయ ప్రాంగణంలో ప్రతిష్ఠించిన 1,008 కలశాలకు ప్రత్యేక పూజలు చేశారు. సప్త నది జలాలను ఆయా కలశాలలో వేసి వేద మంత్రోచ్ఛరణల మధ్య అభిమంత్రించారు. అమ్మవారి గర్భాలయంలో ఏర్పాటుచేసిన శ్రీ చక్రరాజం, అమ్మవారి ఉత్సవమూర్తులు, మూలమూర్తులను కలశాలతో అభిషేకించారు.

కమనీయంగా ఆది దంపతుల కల్యాణం

అమ్మవారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా జోగులాంబ బాల బ్రహ్మేశ్వరస్వామి శాంతి కల్యాణోత్సవాన్ని కమనీయంగా నిర్వహించారు. అమ్మవారి ధ్వజస్తంభ మండపం వద్ద ఏర్పాటు చేసిన ప్రత్యేక వేదికలో వేదమంత్రోచ్ఛరణలు, మంగళ వాయిద్యాల మధ్య స్వామి అమ్మవారి కల్యాణం కమనీయంగా సాగింది. కల్యాణోత్సవాన్ని తిలకించి భక్తులు జయజయధ్వానాలు చేశారు. 

అనంతరం అమ్మవారి యాగశాలలో ఐదు రోజులుగా నిర్వహిస్తున్న చండీ హోమాలు, అవాహిక దేవత హోమాలకు చివరి రోజు మహా పూర్ణహుతి సమర్పించి బ్రహ్మోత్సవాలకు పరిసమాప్తి పలికారు. శుక్రవారం జోగులాంబ అమ్మవారిని సీఎం సోదరుడు తిరుపతిరెడ్డి, ఎమ్మెల్యే విజయుడు, నాగర్ కర్నూల్​ ఎంపీ మల్లు రవి, ఏఐసీసీ కార్యదర్శి సంపత్ కుమార్, మాజీ జడ్పీ చైర్ పర్సన్  సరిత తదితరులు దర్శించుకున్నారు.