గద్దె పైకి చేరిన సారలమ్మ

గద్దె పైకి చేరిన సారలమ్మ

మేడారం జన జాతరలో తొలిఘట్టం ఆవిష్కృతమైంది. వన  దేవత సారలమ్మ గద్దెల పైకి చేరుకుంది. కన్నెపల్లిలోని సారలమ్మ గుడి నుంచి అమ్మ ప్రతిరూపమైన పసుపు, కుంకుమ భరిణెలు మేడారానికి తీసుకొచ్చి.. గద్దెమీద ప్రతిష్టించారు. అంతకు ముందు కన్నెపల్లి ఆడపడచులు సారలమ్మకు ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం గద్దెలపైకి వెళ్లి అక్కడ శుద్ధి కార్యక్రమం చేపట్టారు. శుద్ధి తర్వాత కన్నెపల్లి నుంచి సారలమ్మను గద్దెలపైకి తరలించారు.

రేపు సమ్మక్కను తీసుకొస్తారు. మేడారంలోని సమ్మక్క గుడి దగ్గర పగిడిద్దరాజు, సమ్మక్క పెళ్లి జరుగుతుంది. పూనుగొండ్లలో పగిడిద్దరాజు, కొండాయిలో గోవిందరాజులు కొలువై ఉన్నారు. వీరిద్ధరు కూడా ఇవాళ రాత్రే గద్దెపైకి చేరుకున్నారు. మహబూబాబాద్ జిల్లా గంగారం మండలం పొనుగండ్ల గ్రామం నుంచి  మేడారం బయుల్దేరాడు పగిడిద్దరాజు. పెనుక వంశీయులు పసుపు, కుంకుమలతో ప్రత్యేక పూజలు చేసి పగిడిద్దరాజును తీసుకుని ఊరేగింపుగా తీసుకొచ్చారు. 80 కిలోమీటర్ల దూరం అడవిలో నడుస్తూ పగిడిద్దరాజుతో మేడారానికి చేరుకున్నారు ఆదివాసీలు.

గాల్లోకి మూడు రౌండ్లు కాల్పులు జరిపి.. అమ్మకు స్వాగతం

జాతరలో రెండో రోజు (రేపు) చిలుకుల గుట్టలో కుంకుమ భరిణె రూపంలో ఉన్న సమ్మక్క తల్లిని తీసుకొచ్చి మేడారంలోని గద్దె మీద ప్రతిష్టిస్తారు. ములుగు జిల్లా ఎస్పీ గాల్లోకి 3 రౌండ్లు కాల్పులు జరిపి గౌరవ వందనంతో అమ్మకు స్వాగతం పలుకుతారు. అమ్మవారిని తీసుకొచ్చే దారి పొడవునా భక్తులు ముగ్గులు వేస్తారు. ఆ సమయంలో భక్తులు డప్పు చప్పుళ్లతో పూనకాలతో ఊగిపోతారు. మేడారం మహా జాతరలో ఇదే ప్రధాన ఘట్టం. సమ్మక్కను తీసుకొస్తున్న పూజారులను తాకేందుకు.. అమ్మకు స్వాగతం పలికేందుకు దారిపొడవునా.. ఇసుకేస్తే రాలనంతగా భక్తులుంటారు. మూడో రోజు అమ్మవార్లు ఇద్దరు గద్దెలపై కొలువుదీరి భక్తులను దర్శనమిస్తారు. అమ్మవార్లకు పసుపు, కుంకుమలు , చీర , సారె, నూనె కలిపిన ఒడిబియ్యం, బంగారంగా పిలుచుకొనే బెల్లాన్ని సమర్పిస్తారు. నాలుగోరోజు సాయంత్రం ఆవాహన పలికి దేవతలందరినీ తిరిగి అడవికి తీసుకెళ్తారు పూజారులు. వేడుక మొత్తం వంశపారంపర్యంగా వస్తున్న గిరిజన పూజారులే చేయడం ఆనవాయితీ.

మరిన్ని వార్తల కోసం..

కరోనా ఆంక్షలపై రాష్ట్రాలకు కేంద్రం లేఖ

ప్రేమ పెళ్లి: అమ్మాయి మేయర్.. అబ్బాయి ఎమ్మెల్యే

జాతీయ జెండాలతో కాంగ్రెస్ నిరసన.. తప్పుబట్టిన సీఎం