జాతీయ జెండాలతో కాంగ్రెస్ నిరసన.. తప్పుబట్టిన సీఎం

జాతీయ జెండాలతో కాంగ్రెస్ నిరసన.. తప్పుబట్టిన సీఎం

కర్ణాటక అసెంబ్లీ సమావేశాల్లో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేల నిరసనలతో సభ అట్టుడికింది. పంచాయతీ రాజ్ శాఖ మంత్రి కేఎస్ ఈశ్వరప్ప రాజీనామా చేయాలన్న డిమాండ్ తో సభ కార్యకలాపాలను కాంగ్రెస్ అడ్డుకుంది. జాతీయ జెండాలను పట్టుకుని అసెంబ్లీలో నిరసన ప్రదర్శన చేశారు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు. అయితే కాంగ్రెస్ ఎమ్మెల్యేల తీరును సీఎం బసవరాజ్ బొమ్మై తప్పుబట్టారు. జాతీయ జెండాను కాంగ్రెస్ అవమానించిందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. అసెంబ్లీలో ప్రొటెస్ట్ సింబల్ గా జాతీయ జెండాను ఉపయోగించడం ఫ్లాగ్ కోడ్ ఉల్లంఘనే అవుతుందని అన్నారు. 

కేబినెట్ నుంచి తొలగించాల్సిందే: సిద్దరామయ్య

పంచాయతీ రాజ్ శాఖ మంత్రి కేఎస్ ఈశ్వరప్పను కేబినెట్ నుంచి తప్పనిసరిగా తొలగించాల్సిందేనని కాంగ్రెస్ ఎమ్మెల్యే, ప్రతిపక్ష నేత సిద్దరామయ్య డిమాండ్ చేశారు. ఈశ్వరప్ప ఇటీవల మీడియాతో మాట్లాడుతూ ఎర్రకోటపై కాషాయ జెండా ఎగరేస్తామని అన్నారని, ఇలాంటి వ్యాఖ్యలు చేసిన ఆయనకు మంత్రిగా కొనసాగే హక్కులేదని సిద్దరామయ్య అన్నారు. రైతు నిరసనల సందర్భంగా వాళ్లు ఎర్రకోటపై తమ జెండా ఎరుగవేసే ప్రయత్నం చేస్తే.. దేశ ద్రోహం కేసు పెట్టారని, ఇప్పుడు మంత్రి ఈశ్వరప్పపై కూడా దేశ ద్రోహం కేసు పెట్టాలని ఆయన డిమాండ్ చేశారు.

మంత్రి వ్యాఖ్యలపై వివరణ

అయితే సిద్దరామయ్య డిమాండ్ పై కర్ణాటక లా మినిస్టర్ జేసీ మధు స్వామి స్పందించారు. మంత్రి ఈశ్వరప్ప తప్పుగా మాట్లాడలేదని, ఎర్రకోటపై కాషాయ జెండా ఎరగేస్తామని ఆయన చెప్పలేదని అన్నారు. ఎర్రకోటపై కాషాయ జెండాను ఎగురవేయబోతున్నారా అని ఈశ్వరప్పను మీడియా ప్రతినిధులు ప్రశ్నించారని, దానికి బదులిస్తూ ఆయన భవిష్యత్తులో ఒక రోజు జరగొచ్చేమో అని అన్నారని మధు స్వామి వివరించారు. జాతీయ జెండానే మన జెండా అన్నదే తమ పార్టీ నినాదమని చెప్పారు.

మరిన్ని వార్తల కోసం..

ఆకాశం నుంచి కింద పడిన పక్షిరాజు

మేడారంలో దర్శనానికి రెండు గంటలు

ప్రెగ్నెన్సీ టైమ్లో కరోనా టీకా.. పుట్టబోయే బిడ్డకు మేలు