25 ఏళ్లకే ఎంపీ- వైసీపీ నేత మాధవి సరికొత్త రికార్డు

25 ఏళ్లకే ఎంపీ- వైసీపీ నేత మాధవి సరికొత్త రికార్డు

ఈ సారి లోక్‌సభకు ఎన్నికైన అత్యంత పిన్న వయస్కురాలిగా వైసీపీ అభ్యర్థి మాధవి  సరికొత్త రికార్డు సృష్టించారు. అరకు లోక్‌సభ నియోజకవర్గం నుంచి తన సమీప ప్రత్యర్థి,  కేంద్ర మాజీ మంత్రి కిశోర్ చంద్రదేవ్‌పై ఆమె 2,21,058 ఓట్ల మెజార్టీతో గెలిచారు. మాధవి.. చింతపల్లి మాజీ ఎమ్మెల్యే, సీపీఐ సీనియర్ నాయకులు గొడ్డేటి దేముడు కుమార్తె.

మాధవి ప్రస్తుత వయస్సు 25 ఏళ్ల 3 నెలలు. ఇంత చిన్న వయసులో ఎంపీగా గెలుపొంది ఆమె రికార్డు సృష్టించారు. గతంలో ఈ రికార్డు 26 ఏళ్ల 13 రోజుల దుష్యంత్ చౌతాలాపై ఉండేది.

తండ్రి దేముడు వారసత్వంగా తొలిసారిగా మాధవి రాజకీయాల్లోకి వచ్చారు.  విశాఖ జిల్లా కొయ్యూరు మండలం శరభన్నపాలెం వారి స్వగ్రామం. బీఎస్సీ, బీపీఎడ్ చదివిన మాధవి కొయ్యూరులోని గిరిజన సంక్షేమ పాఠశాలలో పీఈటీగా పని చేశారు. 2018, ఆగస్టు నెలలో ఆమె వైసీపీలో చేరి లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేశారు. 1992లో జన్మించిన మాధవి అవివాహితురాలు. ఈమె సోదరి చెల్లయమ్మ ఎస్జీటీగా పని చేస్తున్నారు. ఆమె తండ్రి గొడ్డేటి దేముడు అనారోగ్యంతో 2015లో తుదిశ్వాస విడిచారు.