ఖమ్మంలో పామాయిల్​ ప్లాంట్ నిర్మించనున్న గోద్రెజ్ ఆగ్రోవెట్

ఖమ్మంలో పామాయిల్​ ప్లాంట్ నిర్మించనున్న గోద్రెజ్ ఆగ్రోవెట్
  • రూ.300  కోట్ల పెట్టుబడి

ముంబై: రూ. 300 కోట్ల పెట్టుబడితో  తెలంగాణలో ఇంటిగ్రేటెడ్ పామాయిల్ కాంప్లెక్స్‌‌‌‌‌‌‌‌ను ఏర్పాటు చేయనున్నట్లు గోద్రెజ్ ఆగ్రోవెట్ లిమిటెడ్ (జీఏవీఎల్) శనివారం తెలిపింది. రాబోయే 3–-4 సంవత్సరాలలో నిర్మాణం పూర్తవుతుందని ప్రకటించింది. తెలంగాణలోని ఖమ్మం జిల్లాలో ఏర్పాటు చేయనున్న పామాయిల్ కాంప్లెక్స్ 125 ఎకరాల్లో విస్తరించి ఉంటుంది. రానున్న కాలంలో శుద్ధి కర్మాగారాన్ని,  క్రూడ్ పామాయిల్ మిల్లునూ ఏర్పాటు చేస్తామని జీఏవీఎల్ ఒక ప్రకటనలో తెలిపింది.  విత్తనోత్పత్తి,  పరిశోధన యూనిట్‌‌‌‌‌‌‌‌తో పాటు సంవత్సరానికి 7 లక్షల మొక్కల సామర్థ్యం గల నర్సరీని కూడా ఏర్పాటు చేస్తుంది. "తెలంగాణ ప్రభుత్వం వంటనూనెల ఉత్పత్తి పెంపుకోసం ఆయిల్ పామ్ మిషన్​ను చేపట్టింది. రాష్ట్రవ్యాప్తంగా 20 లక్షల ఎకరాలను సాగులోకి తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. ఈ మిషన్ వేలాది వ్యవసాయ కుటుంబాల ఆదాయాన్ని  పెంచుతుంది. అదే సమయంలో దేశంలో వంటనూనెల లోటు తగ్గింపునకు దోహదం చేస్తుంది.  భారతదేశంలోనే అతిపెద్ద వంటనూనెల ఉత్పత్తిదారుగా తెలంగాణ అవతరించనుంది”అని తెలంగాణ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్‌‌‌‌‌‌‌‌మెంట్, పరిశ్రమలు  వాణిజ్యం,  సమాచార సాంకేతిక శాఖల మంత్రి కేటీఆర్​ అన్నారు.  

ఇదిలా ఉంటే జీఏవీఎల్ సాగులో​ ఉత్తమ పద్ధతులు / ఆధునిక సాంకేతికతలు, వ్యవసాయ ఇన్‌‌‌‌‌‌‌‌పుట్‌‌‌‌‌‌‌‌లు (ఎరువులు, బిందు సేద్యం, పురుగుమందులు, విత్తనాలు  హార్వెస్టింగ్ టూల్స్ వంటివి)  సేవలను ఒకే దగ్గర క్రింద కూడా అందిస్తుంది.  ప్రస్తుతం దేశవ్యాప్తంగా 65వేల హెక్టార్లలో పామాయిల్ సాగులో ఉండగా, 2027 నాటికి సాగును 1.2 లక్షల హెక్టార్లకు పెంచాలని భావిస్తున్నారు. " ఆయిల్ పామ్ రైతులకు నాణ్యమైన మొక్కలను అందుబాటులోకి తీసుకురావాలని మేం భావిస్తున్నాం. రాబోయే సంవత్సరాల్లో క్రూడ్ పామ్ ఆయిల్ మిల్లును ప్రారంభిస్తాం. దేశంలో మొట్టమొదటి ఇంటిగ్రేటెడ్ పామాయిల్ కాంప్లెక్స్‌‌‌‌‌‌‌‌ను తెలంగాణలో ఏర్పాటు చేయడాన్ని గౌరవంగా భావిస్తున్నాం” అని జీఏవీఎల్​ మేనేజింగ్ డైరెక్టర్ బలరామ్ సింగ్ యాదవ్ అన్నారు.