విహార యాత్రకు వెళ్లి.. మడుగులో పడి నలుగురి మృతి

విహార యాత్రకు వెళ్లి.. మడుగులో పడి నలుగురి మృతి

కడప: సరదాగా విహార యాత్రకు వెళ్లి.. మడుగులో నీటిని చూసి సరదాగా స్నానం కోసం దిగిన నలుగురు ప్రమాదవశాత్తు నీట మునిగి దుర్మరణం పాలయ్యారు. కడప జిల్లా గాలివీడు మండలం వెలిగల్లు ప్రాజెక్టు వద్ద గండి మడుగులో జరిగిందీ ఘటన. విహార యాత్ర కోసం బెంగళూరు నుండి చిత్తూరు జిల్లాలోని వాల్మీకుపురంలో ఉంటున్న బంధువుల ఇంటికి వచ్చారు 10 మంది కుటుంబ సభ్యులు. రెండు కుటుంబాలకు చెందిన బంధువులందరూ కలసి మొత్తం 20 మంది  శనివారం  వెలిగల్లు ప్రాజెక్టు వద్దకు వచ్చారు. బెంగళూరు నుండి వచ్చిన 10 మంది.. చిత్తూరు జిల్లాలోని బంధువులందరూ మొత్తం 20 మంది కలసి వెలిగల్లు ప్రాజెక్టు వద్ద సరదాగా గడుపుతుండగా కొందరు మడుగును చూసి ముచ్చట పడ్డారు. 
మడుగు నీరు లోతు తక్కువగా ఉండడంతో కొందరు ఈతకు దిగారు. వీరిలో నలుగురు ప్రమాద వశాత్తు గల్లంతైన మునిగిపోవడంతో సరదాగా ఉన్న బంధుమిత్రులు ఒక్కసారిగా షాక్ కు గురయ్యారు. వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. కొంత మంది మడుగు ఒడ్డున సంచరిస్తూ.. గల్లంతైన వారి కోసం గాలిస్తుండగా లక్కిరెడ్డిపల్లె పోలీసులు ఘటనా  స్థలానికి తరలివచ్చారు. అప్పటికే చాలా సేపు కావడంతో గల్లంతైన నలుగురు చనిపోయి ఉంటారని తెలుస్తోంది. 
గల్లంతైన వారు తాజ్ మహమ్మద్ (40), ముహమ్మద్ హాంజ (13), ఉస్మాన్ ఖానమ్(11), మహమ్మద్ హాఫిజ్ (10) ల కోసం గాలింపు కొనసాగుతోంది. వీరు గల్లంతైన వెంటనే బంధువుల పెద్ద ఎత్తున కేకలు వేస్తూ.. పోలీసులకు సమాచారం ఇచ్చి నాటు పడవలో గాలింపు చేపట్టారు. ఓ వైపు గాలింపు కొనసాగుతుండగా.. ఒడ్డున ఉన్న బంధువుల రోదనలు మిన్నంటాయి. గల్లంతైన వారి ఆచూకీ కోసం లక్కిరెడ్డిపల్లె పోలీసులు తీవ్రంగా శ్రమిస్తున్నారు.