డబుల్ బెడ్రూం ఇండ్లలో గోల్ మాల్.. లబ్ధిదారుల జాబితాలో అనర్హులు

డబుల్  బెడ్రూం ఇండ్లలో గోల్ మాల్.. లబ్ధిదారుల జాబితాలో అనర్హులు
  • జగిత్యాల జిల్లా నూకపెల్లిలో 3,722 ఇండ్ల పట్టాల పంపిణీ
  • ఒక్కో అనర్హుడి వద్ద రూ.50 వేలకు పైగా వసూలు 
  • 57 మంది అక్రమంగా లబ్ధి పొందినట్లు గుర్తించిన పోలీసులు
  • ఔట్ సోర్సింగ్  ఆపరేటర్, మీ సేవా నిర్వాహకుడి అరెస్ట్, రిమాండ్

జగిత్యాల, వెలుగు : రాష్ట్రంలో అత్యధిక డబుల్  బెడ్రూం ఇండ్లు మంజూరైన జగిత్యాలలో లబ్ధిదారుల ఎంపిక వివాదస్పదంగా మారింది. ఇటీవల 3,722 ఇండ్లు పూర్తికావడంతో ఆఫీసర్లు లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ పూర్తి చేశారు. డబుల్  బెడ్రూం ఇండ్ల లబ్ధిదారుల ఎంపికలో అనర్హులు ఉండడంతో తీవ్ర విమర్శలు, ఫిర్యాదులు వెల్లువెత్తాయి. దీంతో ఎంక్వయిరీ చేపట్టిన ఆఫీసర్లు.. ఔట్ సోర్సింగ్  కంప్యూటర్  ఆపరేటర్, మీ సేవా నిర్వాహకుడు అక్రమాలకు పాల్పడినట్లు ప్రాథమికంగా గుర్తించారు. 

దాదాపు ఒక్కో అనర్హుడి వద్ద రూ.50 వేలకు పైగా వసూలుచేసి అర్హులుగా చేర్చినట్లు విచారణలో తేలింది. అయితే, సంబంధిత డిపార్ట్ మెంట్  ఆఫీసర్లను తప్పించేందుకే అవుట్ సోర్సింగ్ సిబ్బంది, మీ సేవ నిర్వహుకుడిపై చర్యలు తీసుకున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. జిల్లా ఆఫీసర్లతో ఎంక్వయిరీ కమిటీ ఏర్పాటుచేసి అక్రమార్కులను గుర్తించాలని లబ్ధిదారులు డిమాండ్ చేస్తున్నారు.     

రాష్ట్రంలోనే తొలి మున్సిపాలిటీ

జగిత్యాల మున్సిపాలిటీకి రాష్ట్ర సర్కారు అత్యధికంగా 4500 డబుల్  బెడ్రూం ఇండ్లు మంజూరు చేసింది. అందులో దాదాపు 3,722 ఇండ్లు పూర్తికావడంతో జిల్లా యంత్రాంగం లబ్ధిదారుల ఎంపిక కోసం తహసీల్దార్ స్థాయి ఆఫీసర్లతో సర్వే చేయించి స్థానికుల ఆర్థిక స్థితిగతులతో పాటు ఓ అప్లికేషన్  ఆధారంగా లబ్ధిదారులను ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. అప్లికేషన్ లో రెండేళ్ల క్రితం చేసిన సర్వే డేటా ఉండడంతో లబ్ధిదారుల ఆర్థిక పరిస్థితిపై అనుమానాలు వ్యక్తం అయ్యాయి. 

ఈ క్రమంలో ఎంపిక చేసిన లబ్ధిదారుల జాబితా ప్రకటించడంతో అనర్హులను అర్హులుగా గుర్తించారని ఫిర్యాదులు వెల్లువెత్తాయి. దీంతో హౌంజింగ్  డీఈ రాజేశ్వర్  ఫిర్యాదు మేరకు విచారణ చేపట్టిన పోలీసులు అక్రమాలు జరిగినట్లు గుర్తించారు. విచారణలో భాగంగా నూకపెల్లి  డబుల్  బెడ్రూం లబ్ధిదారుల ఎంపికలో జగిత్యాల బల్దియాలో నివాసం ఉంటున్న నిరుపేదలను రేషన్  కార్డు ఆధారంగా గుర్తించాలనే నిబంధన ఉంది. కానీ, బెనిఫిషరీల జాబితాలో బీర్పూర్, జగిత్యాల రూరల్  మండలం తిప్పన్నపేట, గోపాల్ రావుపేట, మేడిపల్లి మండలం మన్నేగూడెం గ్రామస్తులను చేర్చడంతో అక్రమాలు జరిగినట్లు అధికారులు గుర్తించారు.  

మరోసారి ఎంక్వయిరీ చేయాలి

3,722 మంది లబ్ధిదారుల అర్హుల ఎంపికలో జరిగిన అక్రమాల్లో ఇప్పటి వరకు అవుట్ సోర్సింగ్  ఆపరేటర్, మీ సేవ నిర్వాహకుడిపై కేసులు నమోదు చేసి చేతులు దులుపుకున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. రేషన్ కార్డు ఆధారంగా జరిగిన అక్రమాలను మాత్రమే గుర్తించడం, ఇండ్లు, స్థలాలు, కార్లు ఉన్న అనర్హులను లబ్ధిదారుల జాబితాలో చేర్చడంపై ఎంక్వయిరీ చేపట్టలేదని తెలుస్తోంది. లబ్ధిదారుల్లో దాదాపు వంద మందికి పైగా అనర్హులు లంచాలు ఇచ్చి పేర్లు నమోదు చేసుకున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. మరోసారి శాఖాపరమైన విచారణ చేపట్టి లబ్ధిదారులకు పట్టాలు అందజేయాలని పబ్లిక్ డిమాండ్ చేస్తున్నారు. 

57 మంది అనర్హుల గుర్తింపు

కలెక్టరేట్ లో డీఏఓగా పనిచేస్తున్న అవుట్​సోర్సింగ్  కంప్యూటర్  ఆపరేటర్ రాకేశ్.. బీర్పూర్ లో మీ సేవా కేంద్రం నిర్వహిస్తున్న చంద్రశేఖర్ తో కలిసి అక్రమాలకు తెరలేపినట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. దాదాపు 57 మంది అనర్హులను అర్హులుగా గుర్తించేందుకు ఒక్కొక్కరి వద్ద రూ.5 వేల నుంచి రూ.50 వేలకు పైగా వసూలుచేశారని పోలీసులు వెల్లడించారు. ఇందుకోసం కొందరి వద్ద ఫోన్ పే, గూగుల్ పేతో పాటు అర్హుల జాబితాలో పేర్లు వచ్చాక ఇస్తామని హామీ తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ దిశగా కేసు నమోదు చేసిన పోలీసులు.. నిందితులను మంగళవారం రిమాండ్ కు తరలించారు. 

ఈ అక్రమాల్లో జగిత్యాలలోని కొందరు కౌన్సిలర్లు కూడా సంబంధిత అవుట్​సోర్సింగ్ ఆపరేటర్ తో చేతులు కలిపి వసూళ్లకు తెరతీసినట్లు ఆరోపణలు ఉన్నాయి. మరికొందరు కౌన్సిలర్లు డబుల్ బెడ్రూం లబ్ధిదారులను డబ్బుల కోసం వేధిస్తున్నారని సమాచారం.