
హైదరాబాద్, వెలుగు: తెలంగాణ గోల్కొండ మాస్టర్స్ 11వ ఎడిషన్ టోర్నమెంట్ హైదరాబాద్ గోల్ఫ్ కోర్సులో మంగళవారం మొదలవనుంది. ఈ నెల 26 వరకు జరిగే ఈ టోర్నమెంట్ కోసం కోటి రూపాయల భారీ ప్రైజ్ మనీ ప్రకటించారు. మొత్తం 123 మంది నేషనల్, ఇంటర్నేషనల్ గోల్ఫర్లు టైటిల్ కోసం పోటీ పడనున్నారు. ఇండియా టాప్ గోల్ఫర్లు అర్జున్ ప్రసాద్, ఉదయన్ మానే, శౌర్య భట్టాచార్యలతో పాటు శ్రీలంక, బంగ్లాదేశ్, యూరప్ దేశాలకు చెందిన ఇంటర్నేషనల్ స్టార్లు కూడా బరిలోకి దిగుతున్నారు.
ఈ టోర్నీకి అఫీషియల్ వరల్డ్ గోల్ఫ్ ర్యాంకింగ్ పాయింట్లు కూడా ఉండటంతో గోల్ఫర్ల మధ్య హోరాహోరీ పోరు జరగడం ఖాయంగా కనిపిస్తోంది. సోమవారం జరిగిన మీడియా సమావేశంలో ఈ టోర్నీ ట్రోఫీని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో గోల్ఫర్లు అర్జున్ ప్రసాద్ , స్టెపాన్ డానెక్ , పీజీటీఐ డైరెక్టర్ వికాస్ సింగ్, హెచ్‌జీఏ కెప్టెన్ జస్వీందర్ సింగ్ బిర్గి తదితరలు పాల్గొన్నారు.