సంక్రాంతి పండక్కి.. రూ. వెయ్యి తగ్గిన బంగారం ధర

సంక్రాంతి పండక్కి.. రూ. వెయ్యి తగ్గిన బంగారం ధర

సంక్రాంతి పండగ.. పెద్ద పండుగ.. బంగారం కొనుగోలు అనేది సెంటిమెంట్.. అలాంటి పండుగ సీజన్ లో బంగారం ధర పెరిగిందా.. తగ్గిందా అంటే.. మార్కెట్ వర్గాలు మాత్రం గుడ్ న్యూస్ చెప్పాయి.. వారం రోజుల్లోనే బంగారం ధర వెయ్యి రూపాయలు తగ్గింది.. జనవరి 11వ తేదీ ధరలను పరిశీలిస్తే.. 22 క్యారెట్ల ఆభరణాల బంగారం ధర.. 10 గ్రాములు 57 వేల 600 రూపాయలుగా ఉంది. అదే బిస్కెట్.. 22 క్యారెట్ల .. 10 గ్రాముల ధర 62 వేల 830 రూపాయలుగా ఉంది. 

2024, జనవరి 2వ తేదీ ఉన్న బంగారం ధరలతో పోల్చితే.. వెయ్యి రూపాయలు తగ్గటం.. అది కూడా పండుగ సీజన్ కావటంతో కొనుగోలుదారులకు ఊరటే అని చెప్పాలి. 

బంగారం ధర తగ్గటానికి కారణాలు లేకపోలేదు. అంతర్జాతీయంగా బంగారం స్టాక్ మార్కెట్లలో పెట్టుబడులు భారీగా ఉన్నాయి. ఇతర దేశాల స్టాక్ మార్కెట్లలో లాభాలు వస్తుండటంతో.. పెట్టుబడిదారులు అందరూ అటువైపు వెళుతున్నారు. ఇదే సమయంలో పశ్చిమ ఆసియా దేశాల్లో బంగారం కొనుగోళ్లు తగ్గాయి. ఈ ప్రభావంతోనే అంతర్జాతీయంగా బంగారం ధరలు వారం రోజులుగా తగ్గుతూ వస్తున్నాయి. జనవరి 2వ తేదీతో పోల్చితే.. జనవరి 11వ తేదీ నాటికి 1.90 శాతం ధర తగ్గింది. 

కొనుగోళ్లు కూడా ఆశించిన స్థాయిలో లేకపోవటం కూడా బంగారం ధరలు తగ్గటానికి కారణం. పెళ్లిళ్లు సీజన్ ముగియటం ఒకటి అయితే.. ఇటీవల కాలంలో తుఫాన్ ప్రభావంతో పంట నష్టం బాగా ఉంది. దీంతో రైతుల దగ్గర డబ్బులు లేవు. ఈ క్రమంలోనూ పెద్ద పండుగ సంక్రాంతికి.. పెరగాల్సిన బంగారం ధరలు.. వెయ్యి రూపాయలు తగ్గాయి...

మరో వైపు వెండి ధరలు కూడా స్వల్పంగా తగ్గాయి. జనవరి 2వ తేదీ కిలో వెండి 80 వేల రూపాయలుగా ఉంటే.. జనవరి 11వ తేదీ నాటికి కిలో వెండి 77 వేల 500 రూపాయలుగా ఉంది. వారం రోజుల్లో 2 వేల 500 రూపాయల వరకు ధర తగ్గింది.