ముంబై: ఈ ఏడాది అక్షయ తృతీయ గోల్డ్ సేల్స్ 98 శాతం పడిపోయాయి. గతేడాదితో పోలిస్తే అమ్మకాలు పూర్తిగా తగ్గుముఖం పట్టాయని ఆల్ ఇండియా జెమ్స్, జ్యువలరీ డొమెస్టిక్ కౌన్సిల్ చైర్మన్ అనంత పద్మనాభన్ చెప్పారు. రిటైలర్లు ఇన్నొవేటివ్‌గా కొత్త ఆఫర్లను ప్రకటిస్తున్నప్పటికి గతేడాదితో పోలిస్తే బంగారం అమ్మకాలు భారీగా తగ్గాయని పేర్కొన్నారు. కరోనా దెబ్బతో షాపులన్ని క్లోజయి ఉన్నాయి. లాక్‌డౌన్ టైమ్‌లో ఈ ఏడాది అక్షయ తృతీయ వచ్చిందని పద్మనాభన్ అన్నారు. ఫిజికల్‌గా గోల్డ్ సేల్స్ జరగడం లేదని, కేవలం డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లోనే అమ్మకాలు కొనసాగుతున్నాయని పేర్కొన్నారు. ‘గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది అక్షయ తృతీయ నాడు గోల్డ్ సేల్స్ 97–98 శాతం పడిపోయాయి’ అని చెప్పారు. గోల్డ్ ఓనర్‌షిప్ సర్టిఫికేట్లను ఇష్యూ చేయడం వంటి ఇన్నొవేటివ్ ఆఫర్లను ప్రకటిస్తూ జ్యువలర్లు కస్టమర్లను ఆకర్షిస్తున్నారని పేర్కొన్నారు. లాక్‌డౌన్ తర్వాతనే ఫిజికల్ డెలివరీ లేదా కొనుగోళ్లు తిరిగి కొనసాగుతాయని, వచ్చే రెండు నెలల్లో తిరిగి సాధారణ స్థాయికి చేరుకుంటామని పద్మనాభన్ అభిప్రాయపడ్డారు. దీపావళి నాటికి గోల్డ్ డిమాండ్ తిరిగి పుంజుకుంటుందని అంచనావేశారు. బంగారం ధరలు రూ. 48,000 (పది గ్రాములు) స్థాయిలో ఉండడంతో కస్టమర్లను ఆకర్షించడానికి జ్యువలర్లు మినిమమ్ రేటును ఆఫర్ చేస్తున్నారు. బంగారం దిగుమతులు నిలిచి పోవడంతో ఈ ధర మరింత పెరిగే అవకాశం కూడా ఉంది.
రూ. 80,000 లకు బంగారం ధర..
వచ్చే 18 నెలల్లో ఇంటర్నేషనల్ మార్కెట్లో ఔన్సు(28.34 గ్రాములు) గోల్డ్ 3,000 డాలర్లకు(రూ. 2.28 లక్షలు) చేరుకుంటుందని బ్యాంక్ ఆఫ్ అమెరికా(బీఓఎఫ్‌ఏ) అంచనా వేస్తోంది. అంటే పది గ్రాముల బంగారం ధర రూ. 80,451 కి చేరుకుంటుందన్న మాట. ఇప్పటి రేటుతో చూస్తే సుమారుగా ఇది రెట్టింపు. గతంలో 2,000 డాలర్ల మార్కును అందుకుంటుందని ఈ బ్యాంక్ అంచనా వేసింది. కానీ కరోనా దెబ్బతో గ్లోబల్‌గా వివిధ దేశాలు వడ్డీ రేట్లను తగ్గిస్తుండడంతో గోల్డ్ డిమాండ్ మరింత పెరుగుతుందని పేర్కొంది. ఈ ఏడాది చివరినాటికి బంగారం ధర యావరేజిగా 1,695 డాలర్లకు చేరుకుంటుందని తాజాగా అంచనా వేస్తోంది. ఈ ధర 2021 లో 2,063 డాలర్లుగాఉంటుందని పేర్కొంది
