- ఈ ఏడాదిలో ఇప్పటికే 30 శాతం కిందకు
- సోమవారం ఒక్కరోజే రూ.9 వేలు తగ్గిన బంగారం
- రూ.10 వేలు పడ్డ వెండి
బంగారం రేటు రోజురోజుకు పడిపోతున్నది. యుద్ధం మొదలైన తర్వాత నుంచి ఇప్పటివరకు 10 గ్రాముల గోల్డ్ రేటు 18 శాతం పడిపోయింది. ఈ ఏడాది జనవరి రేటుతో పోలిస్తే ఇది 30 శాతం తక్కువ.
న్యూఢిల్లీ: సురక్షిత ఆస్తిగా భావించే బంగారం కూడా ఇరాన్–అమెరికా యుద్ధం దెబ్బకు ఇన్వెస్టర్లకు నష్టాలను మిగులుస్తోంది. యుద్ధం మొదలైనప్పటి నుంచి ఇప్పటివరకు 10 గ్రాముల గోల్డ్ రేటు 18 శాతం ..అంటే రూ.29 వేలు తగ్గింది. సాధారణంగా యుద్ధం, క్రూడ్ ధరలు భారీగా పెరగడం, రూపాయి క్షీణత వంటి అంశాల వలన బంగారం ధరల పెరగాలి. కానీ, ఈసారి తగ్గాయి. దీనికి కారణం డాలర్ బలపడడం. ఒకవైపు డాలర్ బలపడడం మరోవైపు రూపాయి పడడంతో బంగారం రేటు ఎక్కువగా ఉంది. ఫలితంగా కొనుగోళ్లు తగ్గిపోయాయి.
2025లో బంగారం ధర 70 శాతం పెరగగా, చాలా మంది ఇన్వెస్టర్లు ప్రాఫిట్ బుకింగ్‌కు మొగ్గు చూపుతున్నారు. యూఎస్ ఫెడ్ రిజర్వ్ వడ్డీ రేట్లను 3.5–3.75శాతం వద్ద ఉంచడంతో బాండ్ యీల్డ్స్ పెరుగుతున్నాయి. బాండ్లకు డిమాండ్ పెరగడంతో కూడా గోల్డ్ వంటి అసెట్స్‌కు పెట్టుబడులు తగ్గుతున్నాయి.
- రూ.184 లక్షల కోట్లు తగ్గిన వాల్యుయేషన్
గోల్డ్ మార్కెట్ వాల్యూ సోమవారం సెషన్‌లో ఏకంగా 2 ట్రిలియన్ డాలర్లు (దాదాపు రూ.184 లక్షల కోట్లు) తగ్గింది. ఎంసీఎక్స్‌లో ఉదయం బంగారం రేటు 6.5 శాతం తగ్గి 10 గ్రాములకు రూ.1.35 లక్షలకు దిగివచ్చింది. వెండి ధర కేజీకి 9 శాతం పడి రూ.2,06,441కి తగ్గింది. బంగారం ధరలు ఈ ఏడాది జనవరిలో నమోదు చేసిన పీక్ లెవెల్ రూ.1.93 లక్షల నుంచి ప్రస్తుతం 30 శాతం తక్కువకు ట్రేడవుతున్నాయి. వెండి ధర కూడా రూ.4.39 లక్షల నుంచి 50 శాతం క్రాష్ అయ్యింది.
- స్పాట్ మార్కెట్లో ధరలు ఇలా..
బంగారం, వెండి ధరలు స్పాట్ మార్కెట్లో భారీగా తగ్గాయి. సోమవారం ఢిల్లీ మార్కెట్లో 10 గ్రాముల బంగారం ధర రూ.9,050 తగ్గి రూ.1.43 లక్షలకు చేరుకుంది. వెండి ధర కూడా భారీగా పతనమైంది. కిలో వెండి రూ.10,500 తగ్గి రూ.2.30 లక్షల వద్ద స్థిరపడింది. అంతర్జాతీయంగా బలహీనమైన పరిస్థితులు, స్థానికంగా డిమాండ్ తగ్గడం ఈ తగ్గుదలకు ప్రధాన కారణమని ఆల్ ఇండియా సరాఫా అసోసియేషన్ తెలిపింది.
అంతర్జాతీయ మార్కెట్లో స్పాట్ గోల్డ్ 5 శాతం పడిపోయి 4,263 డాలర్లకు చేరింది. గత నాలుగు దశాబ్దాలలో ఎన్నడూ లేని విధంగా బంగారం ధరలు వారంలోనే 10 శాతం మేర పడిపోయాయి. సెంట్రల్ బ్యాంకులు నిల్వల సేకరణ వేగం తగ్గించడం కూడా ధరల తగ్గుదలకు దారితీసింది. హైదరాబాద్ మార్కెట్లోనూ వీటి ధరలు గణనీయంగా తగ్గాయి. గుడ్ రిటర్న్స్ వెబ్సైట్ ప్రకారం.. బంగారం ధర రూ.10,300 తగ్గి రూ.1,35,600లకు చేరింది. కిలో వెండి రేటు రూ.20 వేలు తగ్గి రూ.2.30 లక్షలు అయింది.
