
- 300 మందికి పైగా కస్టమర్ల బంగారం కనిపించకుండా పోయినట్లు సమాచారం
- ఢిల్లీ నుంచి చెన్నూరుకు ఎస్‌బీఐ స్పెషల్ టీమ్
- బ్యాంక్ ఎదుట ఆందోళనకు దిగిన కస్టమర్లు
చెన్నూరు, వెలుగు : మంచిర్యాల జిల్లా చెన్నూరు ఎస్‌బీఐలో రూ. 12 కోట్లకు పైగా గోల్డ్ ఫ్రాడ్ జరిగినట్లు తెలుస్తోంది. బ్యాంక్‌లో క్యాషియర్‌గా పనిచేస్తున్న నరిగె రవీందర్ కస్టమర్లకు చెందిన కిలోల కొద్దీ బంగారాన్ని మాయం చేసినట్టు సమాచారం. బ్యాంక్‌లో రెండు రోజులుగా ఉన్నతాధికారులు ఆడిటింగ్ నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో లాకర్లలోని బంగారం కనిపించకపోవడంతో కంగుతున్నారు. మొదట రూ.3 నుంచి రూ.4 కోట్ల వరకు ఫ్రాడ్ జరిగి ఉంటుందని భావించినప్పటికీ దానికి మూడు రెట్లు ఉంటుందని అంచనాకు వచ్చినట్టు తెలిసింది. బ్యాంకులో సుమారు 450 మంది కస్టమర్లు బంగారం తాకట్టు పెట్టి గోల్డ్ లోన్లు తీసుకోగా.. అందులో 300 మందికిపైగా గోల్డ్ మాయమైనట్లు సమాచారం. శుక్రవారం అర్ధరాత్రి వరకు ఆఫీసర్లు బ్యాంక్‌లో ఆడిటింగ్ నిర్వహించారు. ఎస్‌బీఐకి చెందిన స్పెషల్ టీం ఢిల్లీ నుంచి చెన్నూరుకు వస్తున్నట్లు తెలిసింది. బ్యాంక్‌లో బంగారం మాయంపై ఇప్పటివరకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని పోలీసులు
తెలిపారు.
సార్.. మా బంగారం ఉందా ? పోయిందా ?
చెన్నూర్ ఎస్‌బీఐలో బంగారం మాయమైన విషయం తెలుసుకున్న కస్టమర్లు శుక్రవారం ఉదయమే భారీ సంఖ్యలో బ్యాంక్ వద్దకు తరలివచ్చారు. తాము తాకట్టు పెట్టిన, లాకర్లలో దాచుకున్న బంగారం ఉందో, పోయిందో చెప్పాలంటూ మహిళలు కన్నీరు పెట్టుకున్నారు. తమ బంగారం చూపించాలంటూ ఆఫీసర్లను నిలదీశారు. కస్టమర్ల నుంచి వివరాలు తీసుకున్న ఆఫీసర్లు.. ఆడిటింగ్ పూర్తి కాగానే అన్ని వివరాలు వెల్లడిస్తామని నచ్చజెప్పి వారిని పంపించారు.
కస్టమర్లకు న్యాయం చేయాలి : మంత్రి వివేక్ వెంకటస్వామి
చెన్నూర్ ఎస్‌బీఐలో బంగారం మాయమైన ఘటనపై మంత్రి వివేక్ వెంకటస్వామి ఆరా తీశారు. శుక్రవారం చెన్నూర్‌కు వచ్చిన మంత్రి స్థానిక క్యాంస్ ఆఫీస్ వద్ద ఏసీపీ వెంకటేశ్వర్లును కలిగి వివరాలు అడిగి తెలుసుకున్నారు. కస్టమర్లకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని పోలీసులను ఆదేశించారు.