వ్యాక్సిన్ వేయించుకుంటే బంగారు ముక్కుపుడక గిఫ్ట్

వ్యాక్సిన్ వేయించుకుంటే బంగారు ముక్కుపుడక గిఫ్ట్
  • పురుషులకు హ్యాండ్ బ్లెండర్లు గిఫ్ట్ గా ఇస్తున్న స్వర్ణకార సంఘం

రాజ్‌కోట్: కరోనా సెకండ్ వేవ్ ప్రపంచ వ్యాప్తంగా కలకలం రేపుతున్న నేపధ్యంలో అందరి దృష్టి వ్యాక్సినేషన్ పై ఉంది. దేశ విదేశాలకు కరోనా వ్యాక్సిన్ ఎగుమతి చేస్తున్న భారతదేశంలో కూడా కరోనా ప్రమాదకర స్థాయిలో విజృంభిస్తోంది. మహారాష్ట్రతోపాటు మరికొన్ని రాష్ట్రాల్లో సెకండ్ వేవ్ దెబ్బకు పలుచోట్ల లాక్ డౌన్ ను మరిపించే రీతిలో కఠిన చర్యలు తీసుకుంటున్న విషయం తెలిసిందే. ప్రధాని మోడీ సొంత రాష్ట్రమైన గుజరాత్ లో కూడా కరోనా కేసులు తీవ్ర స్థాయిలోనే పెరుగుతున్నాయి. దేశంలో తొలి విడుత కరోనా మృతుల్లో అత్యధిక మరణాలు జరిగిన గుజరాత్ లో సెకండ్ వేవ్ కూడా అదే తరహాలో విజృంభిస్తున్న ఛాయలు కనిపిస్తున్నాయి. ఈ నేపధ్యంలో రాజ్ కోట్ స్వర్ణకార సంఘం కరోనా వ్యాక్సిన్ వేయించుకునే వారికి పలు ప్రోత్సాహకాలు ప్రకటించింది. కరోనా నివారణ చర్యలు అందరూ పాటించేలా అవగాహన కార్యక్రమాలు నిర్వహించిన ఈ సంఘం ఈసారి సెకండ్ వేవ్ నేపధ్యంలో ఒకడుగు ముందుకేసింది. 45 ఏళ్లు పైబడిన వారందరూ తప్పనిసరిగా వ్యాక్సిన్ వేయించుకోమని ప్రచారం చేస్తోంది. ఉత్త ప్రచారం చేసి చేతులు దులిపేసుకోకుండా..  ప్రపంచంలో ఎక్కడా లేనిరీతిలో వినూత్న తరహాలో కరోనా వ్యాక్సిన్ వేయించుకున్న మహిళలకు బంగారు ముక్కుపుడక కానుకలిస్తామని ప్రకటించింది. అలాగే పురుషులకు హ్యాండ్ బ్లెండర్లు ఇస్తామని ప్రచారం చేసింది. చెప్పినట్లే వ్యాక్సినేషన్ సెంటర్లో వ్యాక్సిన్ వేయించుకున్న మహిళలకు బంగారు ముక్కుపుడక.. పురుషులకు హ్యాండ్ బ్లెండర్లు పంపిణీ చేసింది.