న్యూఢిల్లీ: గోల్డ్ ధరలు గురువారం ఆల్ టైమ్ గరిష్టాలను టచ్ చేశాయి. దేశ రాజధానిలో 10 గ్రాముల బంగారం రేటు రూ. 1,130 పెరిగి రూ.67,450 కి చేరుకుంది. గ్లోబల్‌గా రేట్లు పెరగడంతోనే మన దగ్గర కూడా పెరుగుతున్నాయని హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్ ఓ స్టేట్‌మెంట్‌లో పేర్కొంది. పది గ్రాముల గోల్డ్ ధర బుధవారం సెషన్‌లో రూ.66,320 దగ్గర ముగిసింది. కేజీ సిల్వర్ రేటు రూ.1,100 పెరిగి రూ.77,750 కి చేరుకుంది.
హైదరాబాద్‌లో 10 గ్రాముల గోల్డ్ (24 క్యారెట్లు) ధర గురువారం రూ.1,090 పెరిగి రూ.67,420 టచ్ చేసింది. 22 క్యారెట్ల గోల్డ్ రేటు రూ.1,000 పెరిగి రూ.61,800 కి చేరుకుంది. మరోవైపు కేజీ సిల్వర్ హైదరాబాద్‌లో రూ. 81,500 పలుకుతోంది. బుధవారంతో పోలిస్తే సిల్వర్ ధర రూ. 1,500 పెరిగింది. యూఎస్ ఫెడ్ వడ్డీ రేట్లను మార్చకపోవడంతో డాలర్ వాల్యూ తగ్గిందని, దీంతో గ్లోబల్‌గా గోల్డ్ ర్యాలీ చేసిందని ఎనలిస్టులు చెబుతున్నారు. కాగా, గ్లోబల్‌గా ఔన్సు (28 గ్రాములు) గోల్డ్ రేటు 2,202 డాలర్ల దగ్గర ట్రేడవుతోంది. కిందటి సెషన్‌తో పోలిస్తే 48 డాలర్లు పెరిగింది. ఔన్సు సిల్వర్ 25 డాలర్ల దగ్గర ఉంది.
