బంగారం షాపులు బిజీబిజీ

బంగారం షాపులు బిజీబిజీ

ముంబై: అక్షయ తృతీయ సందర్భంగా శనివారం బంగారం కొనుగోళ్లు భారీగా జరిగాయి.  ఉదయం నుండి కస్టమర్ల రాక బాగానే ఉందని, 22 క్యారెట్ల బంగారం ధర దాదాపు రూ. 56,500 స్థాయిలకు దిగజారడం  తమకు కలిసి వచ్చిందని ఆల్ ఇండియా జెమ్ అండ్ జువెలరీ డొమెస్టిక్ కౌన్సిల్ (జీజేసీ) చైర్మన్ సాయమ్​ మెహ్రా  తెలిపారు. కస్టమర్లు కొత్త నగలను కొనుగోలు చేస్తున్నారని,  తక్కువ బరువుతో ఉండేవాటికి ఇంపార్టెన్స్​ ఇస్తున్నారని అన్నారు. ఈ ఏడాది 5-–33 గ్రాముల నగలకు, 1–-2 గ్రాముల నాణేలకు ఆదరణ ఎక్కువగా ఉందని వివరించారు. "ఈ సంవత్సరం అక్షయ తృతీయ రోజున 17-–18 టన్నుల వ్యాపారం జరుగుతుందని అనుకుంటున్నాం. కిందటి సంవత్సరం, అక్షయ తృతీయ తర్వాత వెంటనే పెళ్లిళ్ల సీజన్ కావడంతో జనం విపరీతంగా నగలు కొన్నారు.

ఈ ఏడాది పెళ్లిళ్ల నగల కొనుగోళ్లు మే నుంచి మొదలవుతాయి" అని మెహ్రా చెప్పారు. పీఎన్​జీ జ్యువెలర్స్ ఛైర్మన్ మేనేజింగ్ డైరెక్టర్ సౌరభ్ గాడ్గిల్ మాట్లాడుతూ, వారాంతం కావడంతో ఈ అక్షయ తృతీయ నాడు  వ్యాపారులకు భారీ గిరాకీ వచ్చే అవకాశం ఉందని అన్నారు. బంగారం ధరలు కొద్దిగా తగ్గుముఖం పట్టడం వల్ల కొనుగోళ్లు పెరగొచ్చని, అక్షయ తృతీయ నాడు  బంగారం కొంటే మంచిదని చాలా మంది నమ్ముతారని పేర్కొన్నారు. జీజేసీ మాజీ ఛైర్మన్ అనంత పద్మనాభన్ మాట్లాడుతూ, ఉదయం 11 గంటల తరువాత కస్టమర్ల రాక పెరిగిందని, ఎక్కువ మంది 20 గ్రాముల వరకు ఉన్న నగలను ఇష్టపడుతున్నారని వివరించారు. ఆదివారం వరకు కస్టమర్ల  రద్దీ కొనసాగవచ్చన్నారు. ఉత్తరప్రదేశ్‌‌‌‌కు చెందిన ఐష్‌‌‌‌ప్రా జెమ్స్ అండ్ జ్యువెల్స్​కు చెందిన వైభవ్ సరాఫ్ మాట్లాడుతూ తమ ప్రాంతంలో  ఈసారి 9–-10 గ్రాముల లైట్ వెయిట్ నగలను చాలా మంది కొన్నారని తెలిపారు.