
రాజసం, దర్జా, లగ్జరీ.. ఒక్కటేమిటి అన్నింటికీ కార్లలో కేరాఫ్ రోల్స్‌రాయ్స్. కుబేరులకు తప్ప మామూలు మనిషికి అందుబాటులో ఉండని అత్యంత లగ్జరీ కారది. అలాంటి కారు ‘ట్యాక్సీ’ అంటే ఊహించుకోగలరా? అసలు అది ట్యాక్సీ అవుతుందంటే నమ్మగలరా? కానీ, కేరళలో రోల్స్‌రాయ్స్ గోల్డెన్ ట్యాక్సీని చూసేయొచ్చు. అవును, కేరళలోని ఆక్సిజన్ రిసార్ట్స్ ఓనర్ బాబీ చెమ్మనూర్ అనే వ్యక్తి రోల్స్‌రాయ్స్ ఫాంటమ్ కారును ట్యాక్సీలా మార్చేశారు. అందులో ఒక్కసారైనా ఎక్కాలనుకునే ఓ మామూలు మనిషి కలను తీర్చడానికే ఈ ఏర్పాటంట. రెండు రోజుల పాటు తన రిసార్ట్‌లో ఉండేవాళ్ల కోసం ఈ సర్వీస్‌ను ప్రారంభించాడట. రిసార్ట్‌కు వచ్చేటప్పుడు పికప్ చేసుకోవడంతో పాటు, ఇంటి దగ్గర దిగబెట్టడానికి ఈ కార్నే వాడతారట. అయితే, అది కూడా బాగా కాస్లీనే అనుకోండి. అందులో ట్రిప్‌ను ఎంజాయ్ చేయాలంటే రూ.25 వేలు కార్డులో నుంచి గీకాల్సిందే. అవును మరి, అంత లగ్జరీ కార్లో ట్రిప్ అంటే మామూలు మాటలు కాదు కదా. ఇండియాలో రోల్స్ రాయ్స్ ఫాంటమ్ ఎక్స్ షో రూం ధర దాదాపు రూ.9.5 కోట్లు. ఇప్పుడు అసలు విషయమేంటంటే, ఫొటోలో చూస్తున్నారు కదా.. ఓ ట్రక్కుపై యెల్లో ప్లేట్ ఉన్న గోల్డెన్ రోల్స్రాయ్స్ను తీసుకెళుతున్న ఫొటోను శిరీష్ చంద్రన్ అనే ఓ ట్విట్టర్ యూజర్ పోస్ట్ చేశారు. ఆ ఫొటో కాస్తా వైరల్ అయింది. రోల్స్ రాయ్స్ ట్యాక్సీని చూసి నెటిజన్లు షాకయ్యారు. అంతేకాదు, బప్పీ లహరి కారా ఏంటి అంటూ సెటైర్లు సంధించారు.