- టూరిస్టులు, క్యారియర్ నెట్‌వర్క్‌తో గోల్డ్ స్మగ్లింగ్
- దుబాయ్, సింగపూర్ నుంచి కిలోల కొద్దీ తరలిస్తున్న స్మగ్లర్లు
- క్యారియర్లు, ఏజెంట్లు చిక్కినా రిసీవర్ల జాడలేదు
- ఈ ఏడాది 10 నెలల్లో 18 మంది క్యారియర్లు అరెస్ట్.. 20 కిలోల గోల్డ్ సీజ్
- నిఘా వర్గాలకు సవాల్‌గా గోల్డ్ మాఫియా!
హైదరాబాద్, వెలుగు: టూర్ పేరుతో పాతబస్తీకి చెందిన నలుగురు యువకులను గత నెల దుబాయ్‌కి పంపించారు. టికెట్స్,షెల్టర్, ఖర్చులకు డబ్బు ఇచ్చారు. రిటర్న్ జర్నీలో గోల్డ్ బిస్కెట్లు స్మగ్లింగ్ స్కెచ్ వేశారు. హైదరాబాద్‌లో డెలివరీ చేస్తే కమీషన్ ఇస్తామని ఆశ చూపారు. కాళ్లకు బ్యాండేజ్ వేసి బంగారం పేస్ట్‌ను ప్యాక్ చేశారు.
సమాచారం అందుకున్న కేంద్ర దర్యాప్తు సంస్థలు నలుగురినీ అరెస్ట్ చేసి బంగారం స్వాధీనం చేసుకుంది.ఆ యువకులకు స్మగ్లర్లతో ఎలాంటి కాంటాక్ట్ లేకపోవడంతో గోల్డ్ స్మగ్లర్ల జాడతెలియలేదు. ఇలా..సింగపూర్, దుబాయ్ సహా విదేశాల నుంచి ఏటా జరుగుతున్న బంగారం అక్రమ రవాణా కేసుల్లో క్యారియర్లు తప్ప అసలు గొల్డ్ స్మగ్లర్లు, రిసీవర్లు చిక్కడం లేదు. విదేశాల నుంచి ఇండియాకు వచ్చే ప్రయాణికులు సహా ఫారిన్ టూర్స్ పేరిట యువతను గోల్డ్ మాఫియా ట్రాప్ చేస్తున్నది.
ప్రత్యేక ఏజెంట్స్ నెట్‌వర్క్‌తో దర్యాప్తు సంస్థలకు చిక్కకుండా తప్పించుకుంటోంది. ఈ ఏడాది 10 నెలల వ్యవధిలో సుమారు 18 మంది క్యారియర్లు పట్టుబడగా.. కస్టమ్స్, డీఆర్‌ఐ అధికారులు 20 కిలోల బంగారం స్వాధీనం చేసుకున్నారు.
హైదరాబాద్‌లో బంగారం రిసీవర్ల వివరాలను మాత్రం అధికారులు ఆశించిన స్థాయిలో రాబట్టేలేకపోయారు. దీంతో గోల్డ్ స్మగ్లింగ్‌కు అడ్డుకట్టపడడం లేదు. దాంతో ముంబై, చెన్నై, బెంగళూర్ తరహాలోనే సిటీలో ఏటా గోల్డ్ క్యారియర్స్ సంఖ్య పెరిగిపోతున్నది.
హోల్‌సేల్ గోల్డ్ డీలర్లే సూత్రదారులు!
విదేశాల నుంచి అక్రమంగా బంగారం తరలించడంలో హవాలా వ్యాపారులు, హోల్‌సేల్ గోల్డ్ డీలర్స్ ప్రధాన సూత్రదారులుగా ఉంటున్నారు. ఇందుకోసం దేశవ్యాప్తంగా క్యారియర్ నెట్‌వర్క్ పనిచేస్తోంది. స్మగ్లర్లు, క్యారియర్లు, రిసీవర్లకు ఎలాంటి కాంటాక్ట్ లేకుండానే డెడ్‌డ్రాప్ విధానంలో గోల్డ్ చేతులు మారుతోంది.
ఇందుకోసం ఓల్డ్‌సిటీతో పాటు అరబ్ కంట్రీస్ ఫ్యామిలీస్, ట్రావెల్ ఏజెన్సీల డాటా బేస్ ఆధారంగా గోల్డ్ స్మగ్లర్లు క్యారియర్లను సెలెక్ట్ చేసుకుంటున్నారు. ప్రధానంగా పేదరికంలో మగ్గుతున్న యువత, ఈజీ మనీకి అలవాటు పడినవారితో పాటు దుబాయ్, ఉమ్రా, అబుదబీ ప్యాసింజర్స్ సహా విదేశాల నుంచి వస్తున్న ప్యాసింజర్స్‌ను ఏజెంట్లు కమీషన్స్‌తో ట్రాప్ చేస్తున్నారు. ట్రావెల్స్ ఏజెంట్స్‌తో కలిసి ఉమ్రా టూర్ ప్యాకేజ్‌లతో మహిళలు,50 ఏండ్లు పైబడిన వారిని దుబాయ్,అబుదాబీకి పంపిస్తున్నారు.
క్యారియర్ ఫొటో, డెడ్ డ్రాప్ లొకేషన్ ఇలా..
సింగపూర్, దుబాయ్ నుంచి తిరిగి వచ్చేవారికి కమీషన్ల ఆశచూపుతున్నారు.దుబాయిలోని ఏజెంట్ వాట్సాప్ సమాచారంతోనే హైదరాబాద్ ముఠా సభ్యులకు ఎయిర్ టికెట్స్ చేరవేస్తున్నారు. గోల్డ్ తీసుకొస్తున్న క్యారియర్ల ఫొటోలతో పాటు డెడ్‌డ్రాప్ స్పాట్, సంబంధిత లొకేషన్స్ సేకరిస్తారు.ఇలా స్మగ్లింగ్ చేసిన కిలో గోల్డ్‌కి రూ.25 వేల నుంచి రూ.30 వేల వరకు కమీషన్ ఇస్తున్నారు.
టూరిస్ట్ ప్లేసెస్, విమానాశ్రయాలకు సమీపంలోని హోటల్స్‌లో గోల్డ్ స్మగ్లింగ్ గ్యాంగ్‌లోని ఏజెంట్స్‌తో కలిపిస్తున్నారు. ఇలా ట్రాన్స్‌పోర్ట్ చేసిన బంగారాన్ని శంషాబాద్ ఎయిర్‌పోర్టు సహా శివారు ప్రాంతాల్లో డెడ్‌డ్రాప్ విధానంలో సేకరిస్తున్నారు. కాగా, ఇలాంటి క్యారియర్ నెట్‌వర్క్‌తో ఏజెంట్లు మినహా అసలు రిసీవర్ల జాడ మాత్రం దర్యాప్తు సంస్థలకు అంతుచిక్కని ప్రశ్నలుగానే మిగిలిపోతున్నాయి.
