ఆదివాసిల్లో గోండుల కట్టు, బొట్టే కాదు.. పండుగలూ ప్రత్యేకమే

ఆదివాసిల్లో గోండుల కట్టు, బొట్టే కాదు.. పండుగలూ ప్రత్యేకమే

పంట చేతికొచ్చినంకే కాదు.. భూమిలో విత్తనాలు పెట్టడాన్ని కూడా ఓ పండుగలా చేసుకుంటరు గోండులు. నేలతల్లిపై వాళ్లకున్న ప్రేమకి అద్దం పట్టే ఈ పండుగ పేరు విజంగ్ మొహుతుర్. విజంగ్​ అంటే విత్తనాలు.. మొహుతుర్​ అంటే  ముహూర్తం అని అర్థం. ప్రకృతిని పూజిస్తూ  ఆదివాసి గోండు గూడేలన్నీ ఈ పండుగని జరుపుకుంటయ్​​. భూమితల్లి చల్లని చూపు కోసం చేసుకునే ఈ పండుగలోని ప్రతి ఆచారానికి ఒక విశిష్ఠత ఉంది. 

ఆదివాసిల్లో గోండుల  కట్టు, బొట్టే కాదు.. పండుగలూ ప్రత్యేకమే. ముఖ్యంగా వ్యవసాయ పనులు మొదలుపెట్టేముందు గోండు గూడేలన్నీ కలిసి జరుపుకునే విజంగ్ మొహుతుర్​కి చాలా ప్రాముఖ్యత ఉంది. మృగశిర కార్తె ముందు ఆకాశంలో వచ్చే ఉరుముల గర్జన..‘‘వర్షాలు దగ్గర పడుతున్నాయి. ఏరువాక పనులు వేగవంతం చేయమ’’ని ఆకాశమిచ్చే సంకేతం అని నమ్ముతారు గోండులు. అందుకే ఆకాశంలో ఉరుములు, మెరుపులు కనిపించగానే విజంగ్ మొహుతుర్​కి మూహూర్తం పెట్టుకుంటారు. సాధారణంగా ఈ పండుగ మృగశిర కార్తెకి ముందు మూడు రోజులు, తర్వాత మూడు రోజులు జరుగుతుంది. కానీ, ఆదిలాబాద్​ గోండు గూడేల్లో తమ వీలుని బట్టి ఒక్కో గూడెంలో ఒక్కో రోజు ఈ పండుగ చేసుకుంటారు. మొత్తంగా వారం పదిరోజులు  పండుగ సంబరాలు ఉంటాయి. 
పూజలు చేస్తారు


సాగు చేసే విత్తనాలను కుల దైవం ముందు ఉంచి పూజించడమే విజంగ్ మొహుతుర్​ పండుగ. ఇందులో ఆదివాసులంతా పాలు పంచుకుంటారు. ముందుగా గూడెంలోని ప్రతి ఇంటి నుంచి కొన్ని ధాన్యాలు గ్రామ పెద్ద ఇంటికి వస్తాయి. ఆ తర్వాత తమ వీలును బట్టి  గూడెంలోని జనాలంతా ఒక రోజుని నిర్ణయించుకుంటారు. ఆ రోజు తమ ప్రాంతంలోని ముఖ్యమైన ఆలయాల్లో జమ చేసిన విత్తనాలకి పూజలు చేస్తారు. ఏజెన్సీలోని ఆదివాసులు ముఖ్యంగా కెరమెరి సిర్పూర్ (యు )లోని  సుంగాపూర్ అవ్వల్ పేన్, లింగాపూర్ మండలంలోని ఆవ్వాల్ పేన్​,  జంగుబాయి , తిర్యాణి మండలంలోని బీమల పేన్​గుడిలోలో విత్తనాలకు పూజ చేస్తారు.

తిరిగి వచ్చి తమ గ్రామాల్లోని ఆకిపేన్ దగ్గర అందరూ కలిసి వేడుక జరుపుకుంటారు. భోజనాలు చేస్తారు. ఆదివాసి మహిళలంతా గ్రామపెద్ద ఇంటి దగ్గర చేరి మంచి, చెడు మాట్లాడుకుంటారు. వ్యవసాయం లాభసాటిగా ఉండాలని దేవుడ్ని మొక్కుకుంటారు. ఆ తర్వాత ఎవరికి వాళ్లు మొహుతుర్ చేస్తారు. పంట పొలానికి జొన్న గట్క, పొడికారం, కొబ్బరి కాయ, ఎల్లిపాయ, మోదుగాకులు, గులాల్​లను ఒక​ గంపలో తీసుకెళ్తారు ఆదివాసిల మహిళలు. ఆ మోదుగాకుల్లో ఇంటిల్లిపాది భోజనం చేస్తారు. వ్యవసాయ పనిముట్లను, ఎద్దుల్ని పూజిస్తారు. మరుసటి రోజునుంచి మార్కెట్​లో విత్తనాలు కొని.. వీలుని బట్టి పొలంలో వేస్తారు. 
పూజ చేశాకే విత్తనాలు వేస్తాం


విత్తనాలకు పూజ చేశాకే  భూమిలో నాటుతాం. ఆ తర్వాత నుంచి సాగు పనులన్నీ ప్రారంభిస్తాం. మా ముత్తాతల నుంచి వస్తున్న ఈ ఆచారాన్ని పాటించకపోతే... పంట సరిగా పండదనేది మా నమ్మకం. - కుమ్రం. సోనేరావు
ఇతర గ్రామాలకి వెళ్లరు 
గ్రామంలో ముహూర్తం పెట్టిన రోజు పెద్దలే కాదు చిన్న పిల్లలు కూడా సంబురంగా వేడుకలు జరుపుకుంటారు. పిల్లలంతా ఒక చోటచేరి భోజనాలు చేస్తారు.  తర్వాత గ్రామంలో బుర్రో తుప్పో    ( బంతి ఆట) ఆడతారు. కొన్ని గ్రామాల్లో విల్లు దండ ఆటను కూడా ఆడతారు పిల్లలు. అలాగే విజంగ్​ మొహుతుర్ వేడుకలు జరుపుకునేటప్పుడు ఆదివాసులు తమ ఇండ్లలో ఇతర శుభకార్యాలు పెట్టుకోరు. ఈ పండుగ సమయంలో పెండ్లి, గృహ ప్రవేశాలు, నామకరణం లాంటి వేడుకలు పెట్టుకోవడం అపచారంగా భావిస్తారు. అందుకే మొహుతుర్ ముహూర్తం పెట్టినప్పట్నించీ విత్తనాలు వేయడం పూర్తి చేసేంత వరకు ఇతర గ్రామాలకి వెళ్లరు. షేవింగ్, కటింగ్ కూడా చేయించుకోరు. ::: మసాదే. సంతోష్ కుమార్, ఆసిఫాబాద్, వెలుగు