నేను..నాది.. అనేలా పెంచొద్దు

నేను..నాది.. అనేలా పెంచొద్దు

‘‘చూడు నాన్నాలంచ్బాక్స్లో టిఫిన్ ఎవ్వరికీ పెట్టకూడదు . నువ్వు ఒక్కడివే తినాలిఅని అమ్మ  చెప్తుంది‘‘పక్కనోడి సంగతి మనకెందుకు. నువ్వు అందరికన్నా ముందుండాలి. బాగుండాలి’’ అని నాన్న హితబోధ చేస్తాడు ఆ మాటలు పిల్లల మీద ప్రేమతోనే చెప్పినానీవునీది..నీకు..నీఅనే మాటలు పదేపదే చెవిన పడటం వల్ల పిల్లలు సెల్ఫిష్గా తయారవుతారు. జీవితమంటే ‘‘నేనొక్కడినేఅనే భావనతో పెరుగుతారు. ఇదే ఆలోచనలతో  పెరిగి పెద్దయితే కన్నవాళ్లని కూడా పట్టించుకోకుండా తమది తాము చూసుకుంటారు. అందుకే పిల్లలకి చిన్నతనంలోనే మానవతా విలువలు నేర్పాలిసాయం గొప్పదనాన్ని తెలియజేయాలిఇతరులు మంచి చెడుల గురించి ఆలోచించడం నేర్పాలి.

ఐదేళ్ల లోపు పిల్లలకు చెప్పే మాటలు విత్తనాల్లా వాళ్ల  మెదడులో నాటుకుపోతాయి. అందుకే ఈ వయసులోనే వాళ్లకు సంస్కారంతోపాటు తోటివాళ్లకి సాయం చేయడం నేర్పాలి. ఇతర పిల్లలతో ఎలా మెలగాలో చెప్పాలి. ఎటువంటి పనులు చేయకూడదో వివరించాలి. అలా చేయడం వల్ల పిల్లలకి మంచి ప్రవర్తన అలవడడంతోపాటు ఏది తప్పు, ఏది ఒప్పో తెలుసుకుంటారు. ఇతరులు కష్టంలో ఉంటే ఆలోచిస్తారు.

దూరంగా ఉంచాలి

స్కూల్​కెళ్లేటప్పుడు ‘వస్తువులు ఎవ్వరికీ ఇవ్వకు, లంచ్​బాక్స్​ ఎవ్వరికీ షేర్​ చెయ్యకు’ అని తల్లిదండ్రులుగా మనం ప్రేమతో చెప్పే చిన్నచిన్న విషయాలు కూడా పిల్లల్ని  స్వార్థపరులుగా మారుస్తాయి.  పసివయసులోనే మనసునిండా స్వార్థం నిండితే పెద్దయ్యాక కూడా అదే  కొనసాగుతుంది. అందుకే పిల్లలకు చిన్నతనంలోనే షేరింగ్ నేర్పించాలి.  ‘ఎనర్జీ రావాలంటే బాక్స్​ అంతా తినేయాలి, లేదంటే హాస్పిటల్​కి వెళ్లాల్సి వస్తుంది’. ‘వస్తువు పోతే మళ్లీ అలాంటిది దొరకదు, డబ్బులు కూడా ఖర్చు అయిపోతాయ్’ అని జాగ్రత్త చెప్పాలే తప్ప ‘నీది, నువ్వు’  అనే పదాలని వాళ్లకి  అలవాటు చేయకూడదు.  అదే సమయంలో అవసరమున్న వాళ్లకి సాయం చేయడంలో తప్పు లేదని చెప్పాలి.

ఇతరుల గురించి ఆలోచించేలా

చాలామంది పిల్లలు తెలిసీతెలియక ఏది తోస్తే అది మాట్లాడుతుంటారు. కొన్ని సార్లు ఆ మాటలు హద్దులు దాటి ఇతరుల్ని చాలా బాధపెడతాయ్​. తల్లిదండ్రులు అది గమనించినా‘ చిన్నపిల్లలు కదా! వాళ్లకి ఏం తెలుసు’ అనుకుంటూ వెనకేసుకొస్తారు. కానీ అప్పుడు గట్టిగా మందలించకపోతే   పెద్దయ్యాక కూడా వాళ్లకి అదే అలవాటుగా మారుతుంది.  ఇతరులు ఎమోషన్స్​ పట్టించుకోకుండా నచ్చింది చేసుకుంటూ పోతారు. అందుకే పిల్లలకి చిన్నతనంలోనే సమాజంలో ఎలా నడుచుకోవాలి, తోటి వాళ్లతో ఎలా మెలగాలో నేర్పించాలి. ఇతరులు ఎమోషన్స్​కి విలువివ్వడం నేర్పించాలి. అప్పుడే పిల్లలు ఇతరులు కష్టాన్ని, ఇబ్బందుల్ని గుర్తించగలుగుతారు.  ఇతరులు గురించి ఆలోచించగలుగుతారు.

ప్రోత్సహించాలి

మంచి, చెడుకి బేధం తెలిసేలా చేయడం ఎంత ముఖ్యమో,  ఏదైనా మంచిపని చేసినప్పుడు ప్రోత్సహించడం కూడా అంతే ముఖ్యం. ఆ ప్రోత్సాహం వాళ్లతో మరిన్ని మంచి పనులు  చేయిస్తుంది. ఆపదలో ఉన్న వాళ్లకి సాయం అందించేలా చేస్తుంది. ఒకవేళ ఆ పని వల్ల ఆర్థికంగా, శారీరకంగా ఇబ్బంది పడ్డా సరే పిల్లల్ని నిందించకూడదు. అలా చేస్తే భవిష్యత్తులో సాయం అంటే వెనకడుగేస్తారు. అలాగే తోటిపిల్లలు కిందపడినా, జారిపడిపోయినా నవ్వకూడదని చెప్పాలి. అవసరమైతే ఆ సమయంలో వాళ్లకు సాయం చేయమని ప్రోత్సహించాలి.

స్వార్థం వద్దు

బొమ్మలు, డ్రెస్​ల విషయంలో ‘నాదీ’ అని మొండిపట్టు పడుతుంటారు కొందరు పిల్లలు. వాళ్ల వస్తువుల్ని తాకినా గోలగోల చేస్తుంటారు. తమ దగ్గరున్న  వస్తువుల్ని  ఇంట్లోని వాళ్లతో కూడా పంచుకోవడానికి ఇష్టపడరు. తోటి పిల్లలు ఏడుస్తున్నా పట్టించుకోకుండా వాళ్ల లోకంలో వాళ్లు ఉంటారు. అలాంటి ప్రవర్తన  గమనిస్తే  స్వార్థం వల్ల  కలిగే నష్టాన్ని, తోటి వాళ్లతో పంచుకుంటే వచ్చే సంతోషాన్ని పిల్లలకి  వివరించి చెప్పాలి. షేరింగ్ వల్లే తోటి వాళ్లతో  రిలేషన్​లో స్ట్రాంగ్ అవుతుందని అర్థమయ్యేలా చెప్పాలి. నీ సంతోషంలో తోటి వాళ్లని కలుపుకుపోతేనే నీకు సాయం కావాలన్నప్పుడు చేస్తారని చెప్పి స్వార్థాన్ని వదిలించే ప్రయత్నం చేయాలి.

దూరంగా ఉండాలి

పేరెంట్స్ ప్రవర్తనని బట్టే పిల్లలు ఉంటారు. అందుకే పిల్లల ముందు స్వార్థపు మాటలు, చేతలకు  మనం​ దూరంగా ఉండాలి. అప్పుడప్పుడు
పిల్లల ముందు ఆపదలో  ఉన్న వాళ్లకి సాయం చేయడం లాంటివి చేయాలి. పిల్లల్ని అనాథాశ్రమాలు, వృద్ధాశ్రమాలకు కూడా తీసుకెళ్లాలి. వాళ్లకి పిల్లలతో చేతనైనంత సాయం చేయించాలి. ఇలా చేయడం వల్ల తోటివాళ్లకి సాయమందించే గుణం వాళ్లకి వస్తుంది. పెరిగి పెద్దయ్యాక ఆ సేవా గుణం ఇంకా పెరుగుతుంది. పిల్లలు కూడా అదే అలవరుచుకుంటారు. పెరిగిన వాతావరణం కారణంగా నిస్వార్థంగా  ఇతరుల గురించి  ఆలోచిస్తూ  సాయం చేయడానికి ముందుంటారు.