నీతికథ: మంచితనం సరైన మార్గంలో నడిపిస్తుంది.. అక్రమంగా ఎక్కువ సంపాదించినా ఎంత దక్కాలో అంతే దక్కుతుంది..!

నీతికథ: మంచితనం సరైన మార్గంలో నడిపిస్తుంది.. అక్రమంగా ఎక్కువ సంపాదించినా ఎంత దక్కాలో అంతే దక్కుతుంది..!

ఒక వ్యక్తి ... ‘‘నేను ‘మంచి’ చేతుల్లో ఉండాలి. ఇతరులకు కూడా మంచినే అందించాలి అనే భావనతోనే ఉన్నాను. నేను ఏది కావాలనుకున్నానో దానిని ఇతరులకు ఇవ్వాలి’’ అని అనుకున్నాడట. ఈ విషయాన్ని కొంచెం శ్రద్ధగా ఆలోచిస్తే.. అంతరార్థం అర్థం అవుతుంది. మంచి చేతుల్లో ఉన్నానంటే, మంచితనం తనను సరైన మార్గంలో నడిపిస్తోందని అర్థం. 

ఒక జపనీస్‌‌‌‌ రెస్టారెంట్‌‌‌‌లో ఇలా రాసి ఉందట.. ‘చెఫ్‌‌‌‌ గారూ, నేను మీ మీద నమ్మకంగా ఉన్నాను’ అని. అంటే... అక్కడకు తినడానికి వచ్చిన కస్టమర్​ ఆరోగ్యం ఆ చెఫ్​ మీద ఆధారపడి ఉంది. అతడు వంటకాలను ఆరోగ్యకరంగా తయారుచేయడం ద్వారా కస్టమర్​ బాగుంటాడని దాని అర్థం. ‘ఫస్ట్‌‌‌‌ ఇంప్రెషన్‌‌‌‌ ఈజ్‌‌‌‌ ద బెస్ట్‌‌‌‌ ఇంప్రెషన్‌‌‌‌’ అన్న చందాన ఆ చెఫ్​ దగ్గర తింటున్న మొదటి క్షణం నుంచే అతడు మన ఆరోగ్యం పట్ల బాధ్యతతో వ్యవహరిస్తున్నాడనే నమ్మకం కలిగేలా రెస్టారెంట్‌‌‌‌లో ఆ వాక్యం రాశారన్నమాట.  

మహాభారత యుద్ధ సమయంలో శ్రీకృష్ణుడి సాయం కోరిన దుర్యోధనునితో, ‘నేను ఒక వైపు, నా సైన్యమంతా ఒక వైపు, ఏది కావాలో కోరుకో’ అనగానే దుర్యోధనుడు శ్రీకృష్ణుని సైన్యాన్ని కోరుకున్నాడు. కృష్ణుడు అంగీకరించాడు. అయితే అదే సైన్యంలో ఉన్న సాత్యకి మొదటి నుంచే శ్రీకృష్ణుడికి అత్యంత సన్నిహితుడిగా, అర్జునుడి శిష్యుడిగా పాండవుల పక్షాన నిలిచాడు. 

ధర్మం వైపే తన స్థానం అని నమ్మి యుద్ధమంతా పాండవులకు అండగా పోరాడాడు. అలాగే శిశుపాలుని కుమారుడైన ధృష్టకేతు కూడా ధర్మం కోసం పాండవుల పక్షాన నిలబడ్డాడు. ఈ సంఘటన ధర్మం, సత్యం, మంచితనం ఉన్న చోటే నిజమైన బలం ఉంటుందని, మంచి చేతుల్లో ఉన్నవారికి భయం ఉండదని తెలియజేస్తాయి.

ముఖ్యంగా పాండవుల గురించి ప్రస్తావించాలి. శ్రీకృష్ణుడు పాండవుల పక్షాన ఉండటం వల్ల వాళ్లంతా, ‘‘మనం ఇప్పుడు క్షేమంగా ఉన్నాం. ధర్మం అనే మంచితనానికి మారుపేరుగా ఉన్న శ్రీకృష్ణుడు మన పక్షాన ఉండగా మనం ఏమాత్రం దిగులు చెందాల్సిన అవసరం లేదు’’ అనుకున్నారు. అదే విధంగా మంచి తల్లిదండ్రుల మార్గదర్శకత్వంలో పెరిగిన పిల్లలు సాధారణంగా ధర్మబద్ధమైన జీవనాన్ని ఎంచుకుంటారు. నైతిక విలువలు నేర్చుకుంటారు. అన్యాయం, అక్రమాలకు దూరంగా ఉంటారు. 

ఇందుకు ఒక చిన్న కథ ఉదాహరణగా చూద్దాం..

అనగనగా ఒక పల్లెటూరు. ఆ ఊరిలో రామయ్య అనే ఒక రైతు ఉండేవాడు. అతడు నిజాయితీగా వ్యవసాయం చేసేవాడు. పశువులను కూడా సక్రమంగా పెంచుతూ, స్వచ్ఛమైన పాలను అమ్ముతూ కుటుంబాన్ని పోషించేవాడు. అతను ఎప్పుడూ పాలలో నీళ్లు కలిపి కల్తీ చేయలేదని స్థానికంగా మంచి పేరు తెచ్చుకున్నాడు. ఒకరోజు రామయ్యకు ఏదో పని ఉండటంతో, తన కుమారుడైన వెంకయ్యని పిలిచి పట్టణంలో పాలు అమ్ముకుని రమ్మని పంపాడు.

 వెంకయ్యకు ఒక దురాలోచన పుట్టింది. ‘ఈ పాలలో నీళ్లు కలిపి అమ్మితే రెట్టింపు లాభం వస్తుంది కదా’ అనుకుని, నీళ్లు కలిపాడు. అనుకున్నట్లుగానే రెట్టింపు డబ్బు సంపాదించాడు. వెంకయ్యలో గర్వం బయలుదేరింది. రెట్టింపు సొమ్ముతో తన గ్రామానికి తిరుగుముఖం పట్టాడు. కాసేపు విశ్రాంతి తీసుకుందామని ఒక చెట్టు కింద నడుం వాల్చాడు. అదే సమయంలో ఒక కోతి వచ్చి, వెంకయ్య తల పక్కనే ఉన్న డబ్బుల సంచి తీసుకుని చెట్టు ఎక్కింది. సంచిని తెరిచి అందులోని నాణేలను ఒక్కొక్కటిగా కిందకు విసరడం మొదలుపెట్టింది. వాటిలో కొన్ని నాణేలు నేల మీద, మరి కొన్ని నాణేలు పక్కనే ఉన్న చెరువులో పడ్డాయి. 

కోతి చేసిన పనికి వెంకయ్య లబోదిబోమన్నాడు. చేసేదేమీ లేక నేల మీద పడిన నాణేలను తీసుకుని ఇల్లు చేరాడు. జరిగిన విషయమంతా తండ్రికి చెప్పాడు. రామయ్య డబ్బు లెక్క చూసేసరికి, తమకు ఎంత రావాలో అంతే వచ్చిందని అర్థం చేసుకున్నాడు. 

నిజాయితీగా సంపాదించిన ధనం మాత్రమే నిలుస్తుంది. అంతేకాదు.. ఎంతోమంది మన మీద నమ్మకంతో, ‘మనం మంచివారి చేతుల్లో ఉన్నాం. మనం ఆరోగ్యంగా ఉంటాం’ అనే నమ్మకంతో ఉంటారు. మనం చేసే మోసం వల్ల అవతలి వారికి నష్టం కలుగుతుంది. ఆ పాపం మనలను వెంటాడుతుంది. అందుకే జీవితంలో ఎప్పుడూ తప్పు మార్గాన్ని ఎంచుకోకుండా, నిజాయితీతో జీవించాలని ఈ కథ మనకు చెప్తోంది.

  - డా. పురాణపండ వైజయంతి