నిబద్ధత, బాధ్యతతోనే జర్నలిజానికి మంచి రోజులు

నిబద్ధత, బాధ్యతతోనే జర్నలిజానికి మంచి రోజులు

‘‘ఎక్కడ మనసు నిర్భయంగా ఉంటుందో,
ఎక్కడ మనిషి సగర్వంగా తలెత్తుకు తిరుగుతాడో,
ఎక్కడ విజ్ఞానం స్వేచ్ఛగా మన గలుగుతుందో,
ఎక్కడ ప్రపంచం ముక్కలు ముక్కలై ఇరుకు గోడల నడుమ మగ్గిపోదో, ఎక్కడ పరిశుద్ధ జ్ఞానవాహిని మతం అంధవిశ్వాసపు ఎడారిలో ఇంకిపోదో,
ఆలోచనలో, ఆచరణలో అనునిత్యం విశాల 
పథాలవైపు ఎక్కడ మనస్సు పయనిస్తుందో.. 
ఆ స్వేచ్ఛా స్వర్గం వైపు తండ్రీ.. 
నన్నూ, నా ప్రజల్ని నడిపించు!’’

నూరేళ్ల కింద విశ్వకవీంద్రుడు రవీంద్రుడు మనస్ఫూర్తిగా కోరుకున్నాడిలా. అలాంటి సమాజ ఆవిష్కరణ కోసం ఈ భూమ్మీద కొన్ని వందల ఏండ్ల నుంచి కృషి జరుగుతూనే ఉంది. అనేకానేక ఆవిష్కరణలు, పలు వైఫల్యాలు, అయినా ఎడతెగని మానవ కృషి, ఇదంతా నిరంతర ప్రక్రియ. ఎప్పటికప్పుడు మనిషి జీవితాన్ని సుఖమయం, ఆనందమయం చేయడానికి ఎంతటి ఆరాటమో? ఎన్నెన్ని పోరాటాలో? ఈ క్రమంలో పుట్టినవే సమస్త మానవ సహస్ర వృత్తులు. అందులో జర్నలిజం ఒకటి. నిరంతర సమాచార ప్రమేయంతో పనిచేసే ఎంతో బాధ్యతాయుతమైన వృత్తి. ఎందుకంటే, మానవుడిని ఎక్కువగా ప్రభావితం చేసేది కాబట్టి దానికంత ప్రాధాన్యత. మానవాభివృద్ధిలో ఎంతో కీలక పాత్ర జర్నలిజానిది. స్థూలంగా ప్రజలు – పాలకులకు మధ్య మాత్రమే కాకుండా, పరస్పరం ప్రయోజనం పొందే రెండు సమూహాలు, గ్రూపుల మధ్య  సమాచార మార్పిడి, వినోదం, విజ్ఞానం, చేతన కలిగించడం ద్వారా ప్రసార మాధ్యమాల(మీడియా)ను ఒక సంధానకర్తను చేయడంలో జర్నలిజం వృత్తిదే కీలక భూమిక. మీడియా ఉపకరణంగా జర్నలిజం ఒక ఉత్ప్రేరక పాత్ర పోషించడం పరిశోధనల్ని, శాస్త్ర సాంకేతిక ప్రగతిని, ప్రజాస్వామ్య పరిపుష్టిని తద్వారా మానవ వికాసాన్ని ఎంతగానో ప్రభావితం చేసింది. విశ్వవ్యాప్తంగా పలు విప్లవాలకు, ప్రజా ఉద్యమాలకు, ప్రజాస్వామ్య ఆవిష్కరణలకు, స్థూలంగా మానవ వికాస పర్వాలకు చుక్కానిగా నిలిచిన వృత్తి జర్నలిజం. రాను రాను మీడియా వ్యాపార ధోరణి, లంపెన్‌ పెట్టుబడులు, రాజకీయ శక్తుల గుప్పెట, కార్పొరేటీకరణ పెరిగి, జర్నలిజం వృత్తి దిగజారుతున్నది. నైతికత అడుగంటింది, ప్రమాణాల్లో దినదినం పలుచనవుతున్నది. నిన్న ‘ప్రెస్‌ డే’.. నేడు ‘జర్నలిజం డే’! జరుపుకుంటున్న సందర్భం మన భుజాలను తడుముతున్నది. ప్రగతి ప్రయాణంలో ఇప్పుడు మనం ఎక్కడున్నాం? అన్న ప్రశ్న వెంటాడుతున్నది! గమ్యం ఏమిటి? అనే ప్రశ్న తరుముతున్నది. శివసాగర్‌ అన్నట్టు ‘కోరుకున్న ఎక్కడికో వెళ్లే క్రమంలో మనమిప్పుడు ఎక్కడున్నాం? అని తెలియాలంటే, ఎక్కడ బయలుదేరామో తెలియాలి’

స్వార్థ శక్తుల విజృంభణ

జర్నలిజం వృత్తి నిర్వహణలో, వృత్తి సేవలు వాడుకునే మీడియా నిర్వహణలో నిబద్ధత లోపిస్తున్నది. ఇందుకు అనేక కారణాలున్నాయి. త్యాగధనులు సొంత డబ్బులు వెచ్చించి మీడియా సంస్థల్ని నడపడం, జర్నలిజాన్ని బతికించడం నుంచి ఇటీవలి కాలంలో పరిస్థితి పూర్తిగా వ్యతిరేక స్థితికి వచ్చింది. మీడియా సంస్థల్ని, జర్నలిజం వృత్తిని అడ్డం పెట్టుకొని రాజకీయాల్ని శాసించడం, వ్యాపారాల్ని వృద్ధి చేసుకోవడం, ఇబ్బడిముబ్బడిగా డబ్బు గడించడం వంటి అవలక్షణాలు పెరిగాయి. యాజమాన్యాలు ఒక రకంగా అవినీతి, అక్రమాలకు పాల్పడుతుంటే, జర్నలిస్టులు మరో రకం అవినీతికి, తప్పిదాలకు పాల్పడుతున్నారు. ప్రజాప్రయోజనాలు కాకుండా వ్యక్తిగత, సంస్థాగత, వ్యాపార – రాజకీయ ప్రయోజనాలే ముఖ్యమవుతున్నాయి. ఏదో రాజకీయ పార్టీకి, ముఖ్యంగా పాలకపక్షాలకు దన్నుగా నిలబడుతూ నీకది – నాకిది పద్ధతిన పరస్పర ప్రయోజనాల కోసం, ప్రజాప్రయోజనాలను గాలికి వదిలేస్తున్నారు. వృత్తికి తగిన శిక్షణ, నైతిక భావనలు లేకుండానే వృత్తిలోకి వస్తున్న వారి సంఖ్య పెరిగింది. వారం, పక్షం, నెల రోజుల పాటు విస్తారంగా కురిసిన వానలను ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి ‘క్లౌడ్‌ బరస్ట్‌’గా చెబితే, విని మౌనంగా వెనక్కి వచ్చే స్థాయికి జర్నలిజం పడిపోయింది. మీడియా మధ్య అనారోగ్యకర పోటీ, అనుచిత వేగం వల్ల వార్త – కథనాల్ని సరిచూసుకునే, వివరాలను తనిఖీ చేసే, నిజాల్ని నిర్ధారించుకునే ఓపిక, నిబద్ధత, వ్యవస్థ లేకుండా పోతున్నాయి. స్వీయ లక్ష్మణరేఖలు లేవు, ఇతరులు గీస్తే, పత్రికా స్వేచ్ఛకు భంగమని గీపెడతారు తప్ప అందుకు అంగీకరించరు.

దారి తప్పిన వృత్తి ధర్మం

సాయుధ బలగాల ప్రత్యేక చట్టానికి వ్యతిరేకంగా పోరాడుతూ, పద్దెనిమిదేళ్ల తర్వాత మౌనం వీడి ఈరోమ్‌ షర్మిల విలేకరుల సమావేశం పెట్టినపుడు ఓ ఆసక్తికర సంభాషణ వచ్చింది. ‘మీరు రాజకీయాల్లోకి వస్తున్నారట నిజమా?’ అని అడిగాడో విలేకరి. ‘అవును’ అందామె. ‘రాజకీయాలు బురద కదా!’ అన్నపుడు, ‘అవును, మన సమాజం లాగే!’ అని స్పందించింది. రాజకీయాల్లాగే జర్నలిజాన్ని కూడా విడదీసి చూడలేం. సమాజంలో దాన్నీ భాగంగా చూడాల్సిందే! స్వార్థం, అవినీతి, ఆశ్రితపక్షపాతం వంటి జాడ్యాలన్నీ ఇతర వివిధ జీవన పార్శ్వాల్లోలాగే జర్నలిజంలో కూడా ముదిరాయి. ఒకప్పుడు గొప్ప గౌరవ మర్యాదలు పొందిన జర్నలిజం ఈ రోజు తీవ్ర విమర్శను ఎదుర్కొంటూ నాలుగు రోడ్ల కూడలిలో నిలిచింది. ఎటు పయనించాలో తేల్చుకోవాల్సింది జర్నలిజమే! అంటే, ఆ వృత్తిలో ఉన్నవాళ్లు, ఈ వృత్తి ద్వారా సామాజిక సేవకు సంసిద్ధమైన వారు, సదరు వృత్తి నిర్వహణకు మీడియా సంస్థల్ని ఏర్పరచి వేదిక కట్టిన వాళ్లు సీరియస్‌గా ఆలోచించాల్సిన సమయం ఇది. మీడియా నిర్వహణ ప్రాథమిక లక్ష్యాలను ఏ మేరకు నిర్వహిస్తున్నాం? వృత్తి ధర్మాన్ని ఏ మేరకు పాటిస్తున్నాం? సమాచార వాహకంగా, సంధానకర్తలుగా సమాచార వినిమయంలో... ఉభయత్రా ఎంతటి ప్రయోజనాన్ని కలిగిస్తున్నాం అన్నది వాస్తవికంగా, నిజాయతీగా బేరీజు వేసుకోవాలి. పలు ప్రభావకాల వల్ల పలుచనవుతున్న జర్నలిజం వృత్తికి నిబద్ధతను, బాధ్యతను, సామాజిక స్పృహను జోడిస్తే తప్ప మీడియా రంగానికి, ఈ వృత్తికి పూర్వవైభవం లభించడం కష్టం. ఎప్పుడో డెబ్బై ఏళ్ల కింద మహాకవి శ్రీశ్రీ అన్నట్టు ‘కట్టు కథకి, పెట్టుబడికి పుట్టిన విషపుత్రిక పత్రిక’ అన్న ఆరోపణ నాటి కన్నా నేడే ఎక్కువ అతికినట్టుంది. ఈ దుస్థితి నుంచి బయటపడాలంటే, ఇందుకోసం అన్ని స్థాయిల్లో కృషి జరగాల్సిందే! 

త్యాగాల ఫలం ఆ ఘనకీర్తి

అచ్చు యంత్రం కనుగొన్నప్పటి నుంచి విశ్వవ్యాప్తంగా మీడియా రంగం, జర్నలిజం వృత్తి చేసిన, చేస్తున్న కృషి అపారమైంది. దేశంలో, తెలుగు నేలన జర్నలిజం దశాబ్దాలుగా కీర్తి పొందటానికి ఈ రంగంలో ఎందరెందరో జరిపిన కృషి, చేసిన త్యాగాలే కారణం. భారత స్వాతంత్ర్యోద్యమానికి శీర్షాన నిలిచి నడిపిన జాతిపిత గాంధీజీ ఒక సందర్భంలో ‘ఇంతటి ఉదాత్తమైన ఈ ఉద్యమంలో రెండు ఆధునిక అంశాలు నాకు చక్కని ఉపకరణాలుగా పనికివచ్చాయి, వాటిని నేను గరిష్టంగా వాడుకొని ప్రయోజనం పొందాను’ అంటారు. ‘ఒకటి రైల్వే సదుపాయాన్ని విరివిగా వాడుకొని దేశమంతటా తక్కువ సమయంలో తిరగగలిగాను. రెండు, మీడియాను వేదిక చేసుకొని, రాతలు – ప్రసంగాల ద్వారా నా ఆలోచనలు, భావాలను ప్రజలకు చేరవేయగలిగాను’ అన్నారాయన. గాంధీజీనే కాకుండా నెహ్రూ, అంబేద్కర్‌, సుభాష్‌ చంద్రబోస్‌, తిలక్‌, ఆజాద్‌, రాజేంద్రప్రసాద్‌, ప్రకాశం పంతులు.. ఇలా ఎందరెందరో తమ రాతల ద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగా జర్నలిజం వృత్తిని గొప్ప నిబద్ధతతో నిర్వహించారు. అందువల్లే కమ్యూనికేషన్లు కరువైన, రవాణా సదుపాయం లేని, నిరక్షరాస్యత, అంధ విశ్వాసాలు రాజ్యమేలుతూ కల్లోలితంగా ఉన్న సమాజాన్ని ఒక్కతాటిపైకి తెచ్చి, ఉద్యమింప జేసి, బ్రిటీష్‌ రాజ్య వలసపాలనను శాంతి, అహింసలతో అంతమొందించిన విజయంలో మీడియా, జర్నలిజం వృత్తి కృషి అమోఘం! దేశంలో అక్షరాస్యత, పేదరిక నిర్మూలన, వ్యవసాయీకరణ, ఆహారోత్పత్తి, వైద్యారోగ్య సంరక్షణ ఇలా ఎన్నో విజయాలకు బాటలు వేయడంలో జర్నలిజం పాత్ర అపారం. ప్రజాస్వామ్య పంథా వీడి, పాలనా వ్యవస్థ ఎమర్జెన్సీ వంటి తప్పుడు బాటలు పట్టినపుడు, తెలుగునాట జనం తీర్పును వంచించి, స్వార్థ శక్తులు ‘వెన్నుపోట్ల’తో ప్రజాస్వామ్యాన్ని పరిహాసం చేసినపుడు సాగించిన వ్యతిరేక ఉద్యమాలకు జర్నలిజమే ఊపిరిపోసింది. - సవ్యసాచి