రాగులతో రోగాలకు చెక్ ..

రాగులతో రోగాలకు చెక్ ..

చిరు ధాన్యాల్లో రాగులది ప్రత్యేక స్థానం. రాగిముద్ద అని పిలిచే రాగిసంకటి ఇప్పుడు చాలా రెస్టారెంట్లలో ఓ ట్రెండీ ఫుడ్‌. ఇదే కాదు  రాగి దోసెలు, ఇడ్లీలు, లడ్డూలంటూ చాలా ఐటమ్సే  దర్శనమిస్తున్నాయ్​ ఫుడ్​కోర్ట్స్​లో. ఇవి ఆరోగ్యానికి మేలు చేస్తుండటంతో జనాలు కూడా నో చెప్పకుండా లాగించేస్తున్నారు. మరి ఇవి చేసే మేలు ఏంటో మీరూ చూడండి. మనం రోజూ తినే  అన్నంతో పోలిస్తే రాగిపిండిలో ఉండే పీచు పదార్థాలు చాలా ఎక్కువ. కొవ్వులు దాదాపు లేనట్టే.

ఈ పీచుపదార్థాల వల్ల తిన్న వెంటనే కడుపు నిండినట్లుగా అనిపిస్తుంది. దాంతో రాగిపిండితో చేసిన పదార్థాలు తినేవాళ్లు  ఎక్కువ బరువు, స్థూలకాయం లాంటి సమస్యల నుంచి బయటపడొచ్చు. అలాగే రాగుల్లో క్యాల్షియంతో పాటు విటమిన్‌ ‘డి’ కూడా ఎక్కువగా ఉండటం వల్ల ఎముకలు బలంగా అవుతాయ్​. అందువల్ల ఎదిగే పిల్లలకు రాగిపిండితో చేసిన వంటకాలు ఇవ్వడం వల్ల వాళ్లు వేగంగా ఎత్తు పెరుగుతారు.

కాల్షియం: రాగుల్లో కాల్షియం పుష్కలంగా ఉంటుంది.100 గ్రాముల రాగులతో 344 మిల్లీగ్రాముల కాల్షియం లభిస్తుంది. ఇది మన శరీరంలో దంతాలు, ఎముకలు దృఢంగా అయ్యేలా చేస్తుంది. అంతేకాదు కీళ్ల నొప్పులు రాకుండా చూస్తుంది.

రక్తహీనత నివారిస్తాయ్: రక్తహీనత సమస్యతో బాధపడే వారికి రాగులు చక్కని ఔషధంగా చెప్పొచ్చు. వీటిల్లో ఐరన్ పుష్కలంగా ఉంటుంది. ఇది రక్తం ఎక్కువగా తయారు అయ్యేలా చేస్తుంది. దీంతో రక్త హీనత సమస్య పోతుంది.

చర్మం: రాగుల్లో చర్మానికి మేలు చేసే మిథియోనైన్, లైసిన్ వంటి అమైనో యాసిడ్లు ఉంటాయి. ఇవి చర్మాన్ని ముడతలు పడనీయకుండా చూస్తాయి. అలాగే పాడైపోయిన చర్మ కణాలు మళ్ళీ తయారవుతుంటాయ్​. దీంతో చర్మంపై మచ్చలు తగ్గిపోతాయి.

ఇతర లాభాలు: రాగులను నిత్యం ఏదో ఒక విధంగా తీసుకోవడం వల్ల బీపీ తగ్గుతుంది. గుండె సమస్యలు రావు. జీర్ణ సమస్యలు పోతాయి. రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. వేసవిలో దాహం సమస్య తీరుతుంది. రాగుల్లో ఉండే అయోడిన్ థైరాయిడ్ సమస్యలకు చెక్ పెడుతుంది. జుట్టు ఆరోగ్యంగా ఉంటుంది.