పీఎఫ్‌‌ పెన్షనర్లకు గుడ్‌‌న్యూస్

పీఎఫ్‌‌ పెన్షనర్లకు గుడ్‌‌న్యూస్

కమ్యుటేషన్ ఎంపిక చేసుకున్న వారికి ఒకే సారి పెద్ద మొత్తంలో చెల్లింపు

న్యూఢిల్లీ : ఈపీఎఫ్‌‌ఓ పెన్షనర్లకు గుడ్‌‌న్యూస్. ఎంప్లాయీ ప్రావిడెంట్ ఫండ్(ఈపీఎఫ్) స్కీమ్ కింద ఎవరైతే రిటైర్‌‌‌‌మెంట్ సమయంలో కమ్యుటేషన్‌‌ను ఎంపిక చేసుకున్నారో వారికి 15 ఏళ్ల తర్వాత ఫుల్ పెన్షన్ వచ్చేలా కార్మిక మంత్రిత్వ శాఖ నోటిఫై చేసింది. కార్మిక మంత్రిత్వ శాఖ తీసుకున్న ఈ నిర్ణయంతో 6.3 లక్షల మంది పెన్షనర్లు ప్రయోజనం పొందనున్నారు. 2008 సెప్టెంబర్ 26కు ముందు ఎవరైతే రిటైర్ అయ్యారో, వారు కమ్యుటేషన్‌‌ను ఎంపిక చేసుకుని ఉంటే ఈ ప్రయోజనం అందనుంది. ఎంప్లాయీ పెన్షన్ స్కీమ్(ఈపీఎస్) రూల్స్ ప్రకారం, ఈపీఎఫ్‌‌ఓ మెంబర్ ఎవరైతే, 2008 సెప్టెంబర్ 26 కంటే ముందు రిటైర్ అయ్యారో, వారికి లంప్‌‌ సమ్‌‌లో మూడింట ఒక వంతు అమౌంట్ పూర్తిగా వస్తుంది. మిగిలిన రెండొంతులకు నెలవారీ పెన్షన్‌‌గా ఉద్యోగులకు వారి జీవితకాలం ఇస్తారు.

ప్రస్తుత ఈపీఎఫ్‌‌ రూల్స్ ప్రకారం, ఈపీఎఫ్‌‌ఓ సభ్యులు కమ్యుటేషన్ ప్రయోజనం పొందేందుకు ఎలాంటి ఆప్షన్ లేదు. 2020 ఫిబ్రవరి 20(గురువారం) జారీ చేసిన కొత్త నోటిఫికేషన్‌‌లో, 15 ఏళ్ల తర్వాత పూర్తి పెన్షన్ పొందేలా మళ్లీ తీసుకొచ్చారు. 2005 ఏప్రిల్‌‌ 1న రిటైర్ అయిన ఉద్యోగులు 15 ఏళ్ల తర్వాత అంటే 2020 ఏప్రిల్ 1న ఈ హయ్యర్ పెన్షన్‌‌ పొందేందుకు అర్హులవుతారు. ఎంప్లాయీ పెన్షన్ స్కీమ్ పారా 12ఏ ప్రకారం, కమ్యుటెడ్ పెన్షన్‌‌ను లంప్ సమ్‌‌లో క్లయిమ్ చేసుకోవచ్చు. ఈ కమ్యుటేషన్‌‌ గరిష్టంగా నెలవారీ పెన్షన్‌‌లో మూడింట ఒక వంతు ఉంటుంది. మిగిలిన రెండొంతుల పెన్షన్‌‌ను నెలవారీ పెన్షన్‌‌గానే ఉద్యోగులు పొందుతారు. పారా 12ఏ కిందనున్న ఈ కమ్యుటేషన్‌‌ను పెన్షన్ స్కీమ్ 2008 సెప్టెంబర్ 26 తర్వాత అనుమతించలేదు. ప్రస్తుతం పారా 12బీ ప్రకారం దీన్ని పెన్షన్ స్కీమ్‌‌లో చేర్చినట్టు తెలిసింది. పారా 12ఏ కింద కమ్యుటడ్ పెన్షన్(లంప్ సమ్ పెన్షన్‌‌)ను ఎవరైతే పొందుతారో, వారు 15 ఏళ్ల తర్వాత పూర్తి నెలవారీ పెన్షన్ ఇవ్వనున్నట్టు ఈపీఎఫ్‌‌ఓ పేర్కొంది.