గుడ్ న్యూస్: పేటీఎం UPI లావాదేవీలు కొనసాగించాలంటూ RBI లేఖ

గుడ్ న్యూస్: పేటీఎం UPI లావాదేవీలు కొనసాగించాలంటూ RBI లేఖ

సంక్షోభంలో ఉన్న పేటీఎంకు కొంత ఊరట కలిగించేలా భారతీయ రిజర్వ్ బ్యాంక్(ఆర్ బీఐ) ప్రకటన చేసింది. పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ నిర్వహించే '@paytm' హ్యాండిల్‌ని ఉపయోగించి UPI కస్టమర్లు​ తమా కార్యకలాపాలను సజావుగా కొనసాగించేందుకు సహకరించాలని ఎన్​పీసీఐని ఆర్​బీఐ శుక్రవారం కోరింది. 

అనగా, పేటీఎం యాప్​లో కస్టమర్లు UPI లావాదేవీలు నిర్వహించుకునేందుకు వీలుగా, ఎన్​పీసీఐ థర్డ్​ పార్టీ అప్లికేషన్ ప్రొవైడర్(TPAP)​ హోదా ఇచ్చే అవకాశాన్ని పరిశీలించాలని తెలిపింది. ఈ మేరకు పేటీఎం బ్రాండ్‌ కలిగివున్న One97 కమ్యూనికేషన్ లిమిటెడ్ (OCL) ఈ అభ్యర్థన చేసినట్లు ఆర్​బీఐ ఒక ప్రకటనలో తెలిపింది. అందుకు ఎన్​పీసీఐ అనుమతిస్తే, పేటీఎం మున్ముందూ యూపీఐ లావాదేవీలను ప్రాసెస్‌ చేసే వీలుంటుంది. అధిక మొత్తంలో లావాదేవీలు జరిపేలా 4 నుంచి 5 బ్యాంకులకు పేమెంట్‌ సర్వీస్‌ ప్రొవైడర్‌ సర్టిఫికేషన్‌ ఇచ్చేందుకు ఎన్​పీసీఐ వెసులుబాటు కల్పించవచ్చు.

15 రోజుల గడువు 

కాగా, పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ లావాదేవీలను నిలిపివేసే గడువును ఆర్ బీఐ 15 రోజులు పొడిగించింది. మొదట ఫిబ్రవరి 29 వరకూ గడువివ్వగా.. దాన్ని మరో 15 రోజుల పాటు పొడిగిస్తూ మరో ప్రకటన చేసింది. ఆ గడువులోపు ఖాతాదారులు తమ ఖాతాలు, వాలెట్లు, ఫాస్టాగ్ లు, ప్రీపెయిడ్ కార్డుల లావాదేవీలకు ప్రత్యామ్నాయ మార్గాలు చూసుకోవాలి.