ప్రమాదం నుంచి కాపాడే మంచి మనసుంటే.. మీరే గుడ్​ సమరిటాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌.. ఎలాంటి కేసులు ఉండవు

ప్రమాదం నుంచి కాపాడే మంచి మనసుంటే.. మీరే గుడ్​ సమరిటాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌.. ఎలాంటి కేసులు ఉండవు

రోడ్డు మీద ఒక యాక్సిడెంట్​ జరిగింది అనుకుందాం. గాయపడిన వ్యక్తి రక్తస్రావంతో చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నాడు. అలాంటి పరిస్థితుల్లో కూడా చాలామంది కనీసం ఆ వ్యక్తిని కాపాడే ప్రయత్నం చేయరు. దానికి కారణం.. వాళ్లకు మానవత్వం లేకపోవడం కాదు. విచారణ పేరుతో పోలీసులు తమ చుట్టూ తిప్పుకుంటారేమో అనే భయం. కొందరైతే బాధితుడిని హాస్పిటల్​కు తీసుకెళ్తే కేసు తమ మీదకు వస్తుందని, బిల్లులు చెల్లించాల్సి ఉంటుందని అనుకుంటారు. కానీ.. అలాంటి సమస్యలేమీ ఉండవు. యాక్సెడెంట్లలో గాయాలైన వాళ్లను హాస్పిటల్​కు తీసుకెళ్తే.. తీసుకెళ్లిన వాళ్లను గుడ్​ సమరిటాన్​గా గుర్తించి చట్టం ద్వారా రక్షణ కల్పిస్తారు. అదెలాగంటే.. - - - వినోద్​ మామిడాల, వెలుగు

హైదరాబాద్ నగరంలోని రద్దీ రోడ్లపై ప్రమాదాలు జరగడం సాధారణం. కానీ, గాయపడిన వ్యక్తిని ఆసుపత్రికి తీసుకెళ్లాలంటే చాలామంది ఆలోచిస్తారు.“పోలీసులు విచారణ చేస్తారేమో, ఖర్చులు భరించాల్సి వస్తుందేమో” అని భయపడతారు. ఇలాంటి భయం వద్దు. రోడ్డు ప్రమాద బాధితులకు సాయం చేసే వాళ్లను ప్రోత్సహించేందుకు ‘గుడ్ సమరిటాన్’ విధానం అమలులో ఉంది. దీని ద్వారా మీరు ఒకరి ప్రాణాలు కాపాడి.. హీరోలుగా మారొచ్చు. 

గుడ్ సమరిటాన్ అంటే...

రోడ్డు ప్రమాదాల్లో గాయపడినవాళ్లను హాస్పిటల్​కు తీసుకెళ్లి, వారి ప్రాణాలను కాపాడే
వ్యక్తిని ‘గుడ్ సమరిటాన్’ అంటారు. ఇలాంటి సేవ చేసే వాళ్లను చట్టం ఎప్పుడూ కాపాడుతుంది. సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం.. గుడ్ సమరిటాన్ల  వివరాలను బలవంతంగా సేకరించరు.  

►ALSO READ | వేసవిలో వడదెబ్బ తగలకుండా ఉండాలంటే..ఈ చిట్కాలు పాటించండి

హైదరాబాద్ లాంటి మహానగరంలో రోజూ వందలాది వాహనాలు రోడ్లపై తిరుగుతుంటాయి. పంజాగుట్ట, బంజారాహిల్స్, హైటెక్ సిటీ, కూకట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పల్లి వంటిరద్దీ ప్రాంతాల్లో ప్రమాదాలు జరిగినప్పుడు, సకాలంలో సహాయం అందకపోతే ప్రాణనష్టం సంభవించే ప్రమాదం ఎక్కువ. గోల్డెన్ అవర్ (ప్రమాదం జరిగినతొలి గంట)లో బాధితుడిని ఆసుపత్రికి చేర్చితే..  ప్రాణాలను కాపాడే అవకాశం
50 శాతం కంటే ఎక్కువే ఉంటుంది. అలా ప్రాణాలను కాపాడాలంటే చుట్టుపక్కల వాళ్లు గుడ్ సమరిటాన్లుగా మారి సాయం అందించాలి. 

చట్టం నుంచి రక్షణ ఇలా.. 

విచారణ ఉండదు:  రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ వాళ్లను హాస్పిటల్​కు తీసుకెళ్తే.. ఎవరికీ తమ వివరాలు చెప్పాల్సిన అవసరం లేదు. పోలీసులు వివరాలు సేకరించరు. విచారణకు పిలవరు. 
ప్రైవసీ: గాయపడ్డ వాళ్లను అంబులెన్స్​లో లేదా ప్రైవేట్​ వెహికల్​లో తీసుకెళ్లినా హాస్పిటల్​లో వ్యక్తిగత వివరాలు ఇవ్వాల్సిన అవసరం లేదు. ఒకవేళ ఇచ్చినా రహస్యంగా ఉంటాయి. 
ప్రోత్సాహం: సాయం చేసిన వాళ్లకు నగదు బహుమతి, సర్టిఫికెట్​ కూడా అందజేస్తారు. ఖర్చుల భారం లేదు: ఆసుపత్రి బిల్లులు లేదా ఇతర ఖర్చుల గురించి డాక్టర్లు సమరిటాన్లను అడగరు. 

అవగాహన అవసరం

 గుడ్ సమరిటాన్ విధానం గురించి చాలామందికి తెలియదు. దీని వల్ల సాయం చేయాలనే ఉత్సాహం ఉన్నవాళ్లు కూడా వెనకడుగు వేస్తున్నారు. ప్రజల్లో అవగాహన కల్పిస్తే రోడ్డు ప్రమాద మరణాలను గణనీయంగా తగ్గించవచ్చు. అందుకోసం ప్రభుత్వం, స్వచ్ఛంద సంస్థలు కలిసి పనిచేయాలి. ముఖ్యంగా హైదరాబాద్​ లాంటి సిటీల్లో గుడ్​ సమరిటాన్​ల సంఖ్య పెరిగితే ఎంతోమంది ప్రాణాలను కాపాడొచ్చు. 

ఎలా సాయం చేయాలి?

ప్రమాదం జరిగిన వెంటనే 108 లేదా 100కు కాల్ చేయాలి. 
సాధ్యమైతే బాధితుడిని సమీప ఆసుపత్రికి తీసుకెళ్లాలి.
ఆసుపత్రిలో సిబ్బందికి ఘటన వివరాలు చెప్పి, మీరు వెళ్లిపోవచ్చు. 
ఎలాంటి ఫార్మాలిటీలు అవసరం లేదు.

అందరూ ముందుకు రావాలి 

ప్రమాదాలు జరిగినప్పుడు గోల్డెన్​ అవర్​లో ప్రాణాలు కాపాడటం అందరి బాధ్యత. ప్రమాదం జరిగితే చూస్తూ ఉండకూడదు.. పోలీసుల కేసులు, సాక్ష్యం చెప్పాలన్న భయం అవసరం లేదు. ప్రాణాపాయంలో ఉన్నవాళ్లను ఆస్పత్రికి తరలించాలి. కాపాడిన వాళ్లకు రివార్డ్, సర్టిఫికెట్​ కూడా అందిస్తాం. సిటీలో సమరిటాన్ల సంఖ్య పెరగాల్సిన అవసరం చాలా ఉంది.  

జోయల్​ డేవిస్​, జాయింట్ సీపీ, ట్రాఫిక్​