లైసెన్స్ ​వచ్చినోళ్లకు గుడ్​విల్ ​ఆఫర్

లైసెన్స్ ​వచ్చినోళ్లకు గుడ్​విల్ ​ఆఫర్
  • రాష్ట్రంలో 2,577 దుకాణాల డ్రా కంప్లీట్​
  • ఖమ్మంలో ఏపీ వ్యాపారుల హవా.. 17 షాపులు వారికే..
  • డ్రా తీయనిచోట టెండరుదారుల ఆందోళన

వరంగల్‍, వెలుగు: రాష్ట్రవ్యాప్తంగా వైన్స్​ కేటాయింపులకు అన్ని జిల్లా కేంద్రాల్లో కలెక్టర్​ సమక్షంలో శనివారం లక్కీ డ్రా తీశారు. మొత్తం 2,620 వైన్స్​ ఉండగా వాటికోసం 63 వేల మంది అప్లై చేశారు. వాటిలో 2,577 దుకాణాలకు డ్రా తీశారు. వేలల్లో తరలివచ్చిన ప్రజలతో జిల్లాల్లోని ఆయా సెంటర్లు మినీ జాతరను తలపించాయి. రెండేండ్ల లిక్కర్‍ దుకాణాలకు కొత్త లైసెన్స్​వచ్చినోళ్లు అక్కడే ఎగిరి గంతేయగా.. అప్లికేషన్లకు లక్షల రూపాయలు పెట్టినా షాపులు దక్కనోళ్లు నిరాశకు గురయ్యారు. దాదాపు అన్ని జిల్లాల్లో లిక్కర్ ​సిండికేట్​ మాఫియానే నడిచింది. కొన్ని జిల్లాల్లో షాపులకు అనుకున్నన్ని అప్లికేషన్లు రాలేదనే పేరుతో అధికారులు లక్కీ డ్రా నిలిపివేశారు. దీంతో దరఖాస్తు చేసుకున్నవారు సీరియస్​అయ్యారు. కలెక్టర్లు, ఎక్సైజ్​అధికారుల తీరుపై మండిపడ్డారు. రోడ్డెక్కి నిరసన తెలిపారు. 

లిక్కర్​​మాఫియాదే హవా 
జిల్లాల్లో ఏండ్ల తరబడి ఫీల్డ్​లో ఉన్న లిక్కర్‍ మాఫియా సిండికేట్‍గా మారింది. తమ బ్యాచ్‍లో మరో పదిపదిహేను మందిని కొత్తగా జాయిన్‍ చేసుకుని షాపుల కోసం వందల్లో అప్లికేషన్లు వేశారు. వరంగల్‍కు చెందిన ఓ డాన్‍ తమ సిండికేట్‍ బ్యాచ్‍ నుంచి రూ. కోట్లు ఖర్చు చేసి 300 నుంచి 350 అప్లికేషన్లు వేశాడు. వారికి18 నుంచి 20 షాపులు దక్కాయి. మరో రెండు సిండికేట్‍ గ్యాంగులూ ఇలాగే దక్కించుకున్నాయి. ఈ ఏడాది ఎస్సీ, ఎస్టీ, గౌడ్స్​కు ప్రభుత్వం రిజర్వేషన్‍ కల్పించిన నేపథ్యంలో.. చాలాచోట్ల లిక్కర్‍ మాఫియా వారిని ముందుపెట్టి అప్లికేషన్లు వేయించింది. వచ్చాక గుడ్‍విల్‍ సెటిల్‍మెంట్‍ చేశారు. చాలా జిల్లాల్లో లక్కీ డ్రా ముగియగానే సిండికేట్‍ టీం తమకు నచ్చిన షాపు కోసం నయానోభయానో ఒప్పించే పనిలో పడ్డారు. ఖమ్మం జిల్లాల్లో సిండికేట్‍గా ఏర్పడిన వ్యాపారులు ఓ అగ్రిమెంట్‍ చేసుకున్నారు. ఎవరి పేరుమీద షాపు వస్తుందో వారికి లాభనష్టాల్లో10 శాతం ప్రత్యేకంగా ఇవ్వడానికితోడు రూ.2 లక్షలు గుడ్‍విల్‍ ఇచ్చేలా పేపర్‍ రాసుకున్నారు. 90 శాతంలో అందరికీ వాటా ఉండేలా ఒప్పందం చేసుకున్నారు. 

ఆందోళనలు..
అప్లికేషన్లు తక్కువ వచ్చాయని 18 జిల్లాల్లోని కొన్ని దుకాణాలకు అధికారులు డ్రా నిలిపి వేశారు. వైన్‍ షాపుల కోసం రూల్‍ ప్రకారం అప్లికేషన్‍ వేశాక లక్కీ డ్రా ఎందుకు తీయరంటూ పలుచోట్ల దరఖాస్తుదారులు ఆందోళన చేశారు. 
ఆసిఫాబాద్‍ జిల్లా సిర్పూర్‍(యు), లింగాపూర్‍ షాపులకు ఒక్కోదానికి రెండేసి అప్లికేషన్లు మాత్రమే వచ్చాయి. దీంతో అధికారులు లక్కీ డ్రా ఆపారు. టెండర్ల కోసం ఎదురుచూస్తున్నవారు ఆందోళనకు దిగారు. డ్రా స్టేజీ నుంచి బయటకు వెళ్తున్న కలెక్టర్‍ రాహుల్‍రాజ్ వెహికల్​ను అడ్డుకుని లక్కీ డ్రా తీయాలని పట్టుబట్టారు. 
జగిత్యాల మండలం చల్‍గల్‍కు చెందిన కాసారపు రమేశ్‍ ఆత్మహత్యకు యత్నించాడు. పోలీసులు అతికష్టం మీద అడ్డుకున్నారు. 
సూర్యాపేట జిల్లా కోదాడ, హుజూర్‍నగర్‍ నియోజకవర్గాలు ఆంధ్రా బార్డర్లో ఉండటంతో అక్కడి షాపులకు ఫుల్లు డిమాండ్‍ ఉంది. వ్యాపారులు ఒంటరిగా కాకుండా సిండికేట్‍ గా అప్లికేషన్లు వేశారు. అనంతగిరి మండలంలో ఒక వైన్స్​ను 114 మంది సిండికేట్​ అయ్యి దక్కించుకున్నారు. 
వరంగల్‍ రూరల్‍ జిల్లాలో పొన్నం శ్రీనివాస్‍గౌడ్‍ అనే వ్యక్తి ఆయన పేరుతో సొంతంగా నెక్కొండ 04 నంబర్‍ షాపును దక్కించుకున్నాడు. అదే టైమ్​లో పరకాల 6, పరకాల 8 నంబర్‍ షాపులకు ఓనర్లకు బదులుగా ఆథరైజేషన్‍గా వెళ్లాడు. మొత్తంగా ఆయన లక్కీ డ్రాలో పాల్గొన్న మూడు షాపులు దక్కడంలో అతనిది ’గోల్డెన్‍ లెగ్‍’గా ఫీలయ్యారు. 
నాగర్‍కర్నూల్‍ మున్సిపల్‍ 12వ వార్డు కౌన్సిలర్‍ శకుంతల బాయి, ఆమె భర్త మోతి కుమార్‍ 50 అప్లికేషన్లు వేయగా.. రెండు షాపులు దక్కాయి.
వరంగల్‍ అర్బన్‍ జిల్లాలో సోదరులు ఇద్దరు వైన్స్ కోసం ట్రై చేయగా.. జునూరి వేణుగోపాల్‍13 నంబర్‍, జునూరి సతీష్ 5 నంబర్‍ వైన్స్​వచ్చాయి. ఇదే ప్రాంతంలో బరుపాటి నరసింహరావు తన పేరుతో వేస్తే రాలేదు. కాగా, ఆయన భార్య సుమిత్ర, సోదరి రమ పేరుతో రెండు షాపులు దక్కించుకున్నాడు.
కరీంనగర్‍ రూరల్‍ మండలం ముగ్దూంపూర్‍ వైన్స్​కు అప్లికేషన్లు దాఖలు చేసినవారు లేకున్నా డ్రా తీయడంపై దరఖాస్తుదారులు ఆందోళన చేశారు. దీంతో 40 నిమిషాల పాటు లక్కీ డ్రా ఆపారు.
మేడ్చల్ ఎక్సైజ్ యూనిట్ పరిధిలోని 114 మద్యం దుకాణాలకు కొంపల్లిలోని కేవీఆర్ ఫంక్షన్ హాల్ లో  శనివారం లక్కీ డ్రా నిర్వహించారు. చింతల్​లోని క్యాసారం కుటుంబానికి చెందిన నలుగురు మహిళల్లో ముగ్గురికి మద్యం దుకాణాలు దక్కాయి.

43 వైన్స్ లక్కీ డ్రా వాయిదా
హైదరాబాద్‌‌‌‌‌‌‌‌, వెలుగు: తక్కువ అప్లికేషన్లు వచ్చాయనే కారణంతో 43 వైన్స్​లకు డ్రా తీయలేదు. అలాట్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌ వాయిదా వేశారు. రెండు, మూడు రోజుల్లో ఆయా ప్రాంతాల్లో అప్లికేషన్లు ఎందుకు తక్కువ వచ్చాయో తెలుసుకొని మళ్లీ దరఖాస్తుల స్వీకరణకు చాన్స్‌‌‌‌‌‌‌‌ ఇవ్వనున్నారు. ఆ తర్వాత తేదీ ప్రకటించి లక్కీ డ్రా తీయనున్నట్లు ఎక్సైజ్‌‌‌‌‌‌‌‌ శాఖ డైరెక్టర్ సర్ఫరాజ్‌‌‌‌‌‌‌‌ అహ్మద్‌‌‌‌‌‌‌‌ తెలిపారు. 2,620 దుకాణాలకు 67,849 అప్లికేషన్లు వచ్చిన విషయం తెలిసిందే. దుకాణం దక్కించుకున్న వారు ఈ నెల 22వ తేదీ వరకు లైసెన్స్‌‌‌‌‌‌‌‌ ట్యాక్స్‌‌‌‌‌‌‌‌లో ఫస్ట్‌‌‌‌‌‌‌‌ ఇన్‌‌‌‌‌‌‌‌స్టాల్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌ చెల్లించాల్సి ఉంటుంది. 29వ తేదీ నుంచి ఆయా దుకాణాలకు మద్యం సరఫరా చేస్తారు. వచ్చే నెల1 నుంచి కొత్త దుకాణాలు ఓపెన్‌‌‌‌‌‌‌‌ కానున్నాయి. ఇప్పటికే నడుస్తున్న వైన్ షాపుల లైసెన్స్ గడువు కూడా ఈ నెలలో ముగియనుంది.

రూ.కోట్లలో బేరసారాలు
ఖమ్మం, వెలుగు: మద్యం దుకాణాల లైసెన్స్​దక్కినవారికి కాసుల పంట పండుతోంది. శనివారం లక్కీ డ్రాలో ఖమ్మం జిల్లాలోని 122 షాపులకు లైసెన్స్ దారులను ఎంపిక చేశారు. ఏపీకి చెందిన అడ్రస్​లతో అప్లికేషన్​ వేసి లైసెన్స్​ సాధించిన వ్యాపారులు 17 మంది ఉండగా, ఇక్కడి స్థానికులతో సిండికేట్​గా లైసెన్స్​దక్కించుకున్న ఏపీ వ్యాపారులు అంతకు రెట్టింపు సంఖ్యలో ఉన్నట్టు సమాచారం. ​ డ్రాలో సెలక్ట్ అయినవారికి సిండికేట్ వ్యాపారులు, ఇప్పటికే మద్యం షాపులు నడుపుతున్నవాళ్లు, ఏపీకి చెందిన లిక్కర్​వ్యాపారులు పోటాపోటీగా గుడ్ విల్ ఆఫర్​ చేస్తున్నారు. ఏపీ రాష్ట్రాన్ని ఆనుకుని ఉన్న నేలకొండపల్లి, మధిర, సత్తుపల్లి ఎక్సైజ్​పోలీస్​స్టేషన్ల పరిధిలోని వైన్స్​షాపులకు సంబంధించిన లైసెన్స్ దారులకు గిరాకీ ఎక్కువగా ఉంది. 2019లో మద్యం టెండర్ల సమయంలో ఒక్కో షాపు గుడ్ విల్ రేటు రూ.50 నుంచి 60 లక్షల వరకు పలకగా, ఈసారి ఏపీకి సరిహద్దు లేని మండలాల్లో రూ.80 లక్షల నుంచి రూ.కోటి వరకు,  బార్డర్​ షాపులకు మాత్రం కోటిన్నర నుంచి రూ.2 కోట్ల వరకు గిరాకీ పలుకుతోంది. ఎర్రుపాలెం మండలంలో స్థానికంగా ఇప్పటికే లిక్కర్​ వ్యాపారం చేస్తున్న సిండికేట్ వారికే రెండు షాపులు దక్కగా, ఏపీకి చెందిన వ్యక్తి దక్కించుకున్న రాజుపాలెం లైసెన్స్​ కోసం రూ.2 కోట్ల వరకు గుడ్ విల్ ఆఫర్ చేసినట్టు సమాచారం. ఇక ఎక్కువ అప్లికేషన్లు వచ్చిన ముదిగొండ మండలం వల్లభికి చెందిన షాపును నేలకొండపల్లి మండలానికి చెందిన సిండికేట్ వ్యాపారులే దక్కించుకున్నారు.