గూగుల్‌కి 27 ఏళ్లు: చిన్న గ్యారేజ్‌ నుంచి ప్రపంచ దిగ్గజం వరకు.. ప్రయాణం ఇలా..

గూగుల్‌కి 27 ఏళ్లు: చిన్న గ్యారేజ్‌ నుంచి ప్రపంచ దిగ్గజం వరకు.. ప్రయాణం ఇలా..

మహావృక్షం కూడా ఒక విత్తనంగానే తన ప్రయాణాన్ని మెుదలుపెడుతుంది. అమెరికాలోని అతిపెద్ద టెక్ కంపెనీ గూగుల్ ఆలోచన 1995లో ప్రారంభమైంది. స్టాన్‌ఫోర్డ్ యూనివర్సిటీలో ల్యారీ పేజ్ గ్రాడ్యుయేషన్ పూర్తి కోసం చేరగా.. అక్కడే చదువుతున్న సెర్గే బ్రిన్ అతనికి క్యాంపస్ చూపించడానికి వచ్చాడు. అలా మొదటి కలయికలో వీరిద్దరూ దాదాపు ప్రతి విషయాన్నీ వేరే విధంగా ఆలోచించినప్పటికీ, సంవత్సరం గడవకముందే ఒకే ఆలోచనకు వచ్చార. తమ హాస్టల్ గదుల నుంచే బ్యాక్‌రబ్ అనే సెర్చ్ వ్యవస్థను అభివృద్ధి చేశారు. ఇది వెబ్‌సైట్ల లింకులను విశ్లేషించి ర్యాంక్ ఇస్తుంటుంది.

ఆ తర్వాతి కాలంలో బ్యాక్‌రబ్ పేరు“గూగుల్” గా మారింది. ఇది గణిత పదమైన Googol కు స్ఫూర్తి.  ప్రపంచంలోని సమాచారాన్ని క్రమబద్ధం చేసి అందరికీ అందుబాటులోకి తీసుకురావాలనే లక్ష్యంతో గూగుల్ ముందుకు సాగింది. 

గారేజ్‌ నుంచి మెుదలైన ప్రయాణం..
1998 ఆగస్టులో సన్ మైక్రో సిస్టమ్స్ సహ వ్యవస్థాపకుడు ఆండి బెహ్ట్‌ల్షీమ్ వీరికి లక్ష డాలర్ల చెక్ ఇవ్వటంతో గూగుల్ ఒక నిజమైన కంపెనీగా మారింది. కాలిఫోర్నియాలోని మెన్‌లో పార్క్‌లో సుసాన్ వోజిస్కీ ఇంటి గ్యారేజ్ వారి స్టార్టప్ కంపెనీకి తొలి కార్యాలయంగా మారింది. అదే చోట నుంచి యూట్యూబ్ భవిష్యత్ సీఈవో కూడా వెలువడడం విశేషం. చిన్న కంప్యూటర్లు, కార్పెట్, పింగ్ పాంగ్ టేబుల్, లెగో ఇటుకలతో చేసిన సర్వర్.. అలా చిన్నగా స్టార్ట్ అయ్యింది గూగుల్ ప్రస్థానం.

1998లో బర్నింగ్ మాన్ ఫెస్టివల్‌కు హాజరైనట్లు తెలపడానికి గూగుల్ తన లోగోలో తొలి డూడుల్ని ఉంచింది. “Don’t be evil” అనే నినాదం ఆ కంపెనీ విలువల ప్రతిబింబం. తర్వాత ఇంజనీర్లు, సేల్స్ టీమ్, యోష్కా అనే కుక్కపిల్ల కూడా చేరడంతో గూగుల్ పెరుగుతూ పెద్ద కేంద్రం రూపాంతరం చెందింది. మెుదట్లో సెర్చ్ ఇంజన్ గా ఉన్నప్పటికీ ఆతర్వాత గూగుల్ తన విస్తరణతో టెక్ దిగ్గజంగా మారింది. అలా సాధారణ స్టూడెంట్ ప్రాజెక్ట్‌గా మొదలైన గూగుల్.. ఇప్పుడు జీమెయిల్, యూట్యూబ్, ఆండ్రాయిడ్, గూగుల్ సెర్చ్‌ వంటి వందలాది ఉత్పత్తులను ప్రపంచవ్యాప్తంగా బిలియన్ల మంది వినియోగదారులను కలిగి ఉంది. అలా 1998లో స్టార్ట్ అయిన గూగుల్ ప్రస్తుతం 27వ పుట్టినరోజు జరుపుకుంటోంది.