Google : గూగుల్‌లో మరోసారి ఉద్యోగాల కోత..!

Google : గూగుల్‌లో మరోసారి ఉద్యోగాల కోత..!

టెక్ జెయింట్ గూగుల్ లో మరోసారి ఉద్యోగాల తొలగింపు ప్రక్రియను చేపట్టబోతుంది. ఈ విషయంపై ఇటీవలే ఆ కంపెనీ సీఈవో సుందర్ పిచాయ్ ఓ హింట్ కూడా ఇచ్చారు. మొదటి విడతలో కంపెనీ సిబ్బందిలో 6శాతం అంటే దాదాపు 12వేల ఉద్యోగులను ఇంటికి పంపించేసింది. తాజాగా సుందర్ పిచాయ్ ప్రకటనతో ఇప్పుడు రెండో విడతలో స్టాఫ్ ను వదిలించుకునేందుకు గూగుల్ సిద్ధమైందనే వార్తలు వినిపిస్తున్నాయి. గూగుల్ సామర్థ్యాన్ని 20 శాతం ఎలా పెంచుతారనే ప్రశ్నకు సమాధానమిచ్చి సుందర్ పిచాయ్.. ప్రస్తుతం రీ-ఇంజనీరింగ్ చేసే ప్రయత్నంలో ఉన్నామని చెప్పారు. ఆ తర్వాత రెండవ విడత లేఆఫ్‌లు ఉంటాయని చెప్పడం ఉద్యోగుల్లో ఆందోళన కలిగిస్తోంది.

రీ ఇంజినీరింగ్ తో పాటు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) చాట్‌బాట్ బార్డ్, జీమెయిల్(Gmail), గూగుల్ డాక్స్, ఇతర ప్రాజెక్ట్‌ల సామర్ధ్యాలు, అవకాశాలపైనా గూగుల్ దృష్టి పెడుతున్నట్టు సీఈఓ స్పష్టం చేశారు. ఎంత అభివృద్ధి జరిగినా మరిన్ని పనులు చేయాల్సి ఉందని పిచాయ్ తెలిపారు.‘‘మేము మా వర్క్‌ఫోర్స్‌లో 12,000 మందిని తొలగించాలని నిర్ణయించుకున్నాం. మేం ఇప్పటికే అమెరికాలో ప్రభావితమైన ఉద్యోగులకు ప్రత్యేక ఈమెయిల్స్ పంపాం. ఇతర దేశాల్లో స్థానిక చట్టాలు, అభ్యాసాల కారణంగా ఈ ప్రక్రియకు ఎక్కువ సమయం పడుతుంది’’అని సుందర్ పిచాయ్ చెప్పారు. భారతదేశంలోని వివిధ విభాగాల్లో 450 మంది ఉద్యోగులను తొలగించినట్లు ఫిబ్రవరిలో కంపెనీ నివేదించింది. అయితే తొలగింపుల్లో ఆల్ఫాబెట్ ఇంక్ ప్రకటించిన 12,000 ఉద్యోగాల కోతలు ఉన్నాయా లేదా అనేది స్పష్టంగా తెలియలేదు.

చాట్ జీపీటీ వచ్చిన తర్వాత.. ఆర్టిఫియల్ ఇంటెలిజెన్స్ వేగంగా విస్తరిస్తున్న ఈ క్రమంలో.. గూగుల్ భారీ ఎత్తున రీ ఇంజినీరింగ్ వ్యవహారాలపైనే దృష్టి పెట్టింది. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఆర్థిక మాంద్యం క్రమంలోనే ఇప్పటికే 12 వేల మందిని తీసేయగా.. రాబోయే కాలంలో మరో 20 వేల మందిపై వేటు పడొచ్చని అంచనా వేస్తుంది ఐటీ రంగం. గూగుల్ నుంచి సెకండ్ రౌండ్ లో 20 వేల మంది ఉద్యోగుల తొలగింపు ఉండొచ్చని భావిస్తున్నారు..