చరిత్రలో 'అన్నా మణి'కీ ఓ రోజు...

చరిత్రలో 'అన్నా మణి'కీ ఓ రోజు...

చరిత్రలో రోజుకో ప్రాముఖ్యత ఉన్నట్టే.. ఈ రోజుకూ ఓ ప్రాధాన్యత ఉంది. అందుకే గూగుల్ కూడా ఈ రోజును ప్రత్యేకంగా సెలబ్రేట్ చేస్తోంది. ఈ రోజు 'భారత వాతావరణ సూచనల తల్లి'గా పిలుచుకునే అన్నామణి 104వ జయంతి. ఈ సందర్భంగా గూగుల్ డూడుల్ ను ఆమెకు గౌరవ సూచకంగా డిజైన్ చేసింది. పురుషాధిక్య సమాజంలో పలు సవాళ్లను ఎదుర్కొని... స్ర్తీలూ అన్ని రంగాల్లో సత్తా చాటగలరని నిరూపించిన వారిలో అన్నా మణి ఒకరు. 1918 కేరళ పీర్ మేడ్ లో సిరియన్ క్రిస్టియన్ కుటుంబంలో పుట్టిన ఆమె... చదువులో ఎప్పుడూ ముందుండే వారు. సంప్రదాయానికి స్వస్తీ చెప్పి.. చదువు తన హక్కుగా భావించి పోరాటం చేసిన అన్నా మణి.. బాల మేధావిగా.. భౌతిక శాస్త్రవేత్తగా, ఉపన్యాసకురాలిగా, వాతావరణ నిపుణురాలిగా పేరు తెచ్చుకున్నారు.

చిన్నప్పటి నుంచే చదువుపై అత్యంత ఆసక్తి ఉండడంతో.. ఆమె పన్నెండ వేళ్ల వయసులోనే పబ్లిక్ లైబ్రెరీలో పుస్తకాలన్నింటినీ తిరగేశారు. మహాత్మా గాంధీ స్ఫూర్తితో ఖాదీ ఉద్యమంలోనూ పాల్గొనడమే కాకుండా.. నారీ శక్తికి ఉదాహరణగా.. దేశభక్తిని ప్రదర్శించారు. చెన్నైలో ఫిజిక్స్‌, కెమిస్ట్రీ సబ్జెక్టులలో గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేసిన అన్నా మణి.. ఇండియన్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్స్ బెంగళూరులో‌ రీసెర్చ్‌ స్కాలర్‌షిప్‌ ను గెల్చుకున్నారు. లండన్‌ ఇంపీరియల్‌ కళాశాలలో ఫిజిక్స్‌ అభ్యసించినా... ఆ తర్వాత వాతావరణ శాస్త్రం పట్ల ఆసక్తి ఉండడంతో ఆ రంగంలోనే రాణించారు. ఇలా అన్నా మణి తన జీవిత కాలంలో ఎన్నో విజయాలను అందుకున్నారు. మరెన్నో సత్కారాలను అందిపుచ్చుకున్నారు. ఆఖరికి  గుండె సంబంధిత సమస్యలతో 2001, ఆగస్టు 16న ఆమె కన్నుమూశారు. ఇంకో ముఖ్య విషయమేమిటంటే కేవలం తన విద్యా-విజ్ఞాన సుముపార్జన, ఆసక్తి ఉన్న రంగంపైనే దృష్టి పెట్టిన ఆమె వివాహానికి దూరంగా ఉన్నారు.