గూగుల్ పై పరువు నష్టం కేసు

గూగుల్ పై పరువు నష్టం కేసు
  • విశాక ఇండస్ట్రీస్ పిటిషన్ పైవిచారణ కొనసాగించవచ్చు
  • పదేండ్ల నాటి కేసులో సుప్రీంకోర్టు రూలింగ్

న్యూఢిల్లీ, వెలుగు: తప్పుడు కథనం విషయంలో గూగుల్ పరువు నష్టం కేసును ఎదుర్కోవాల్సిందేనని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. పదేండ్ల కింద విశాక ఇండస్ట్రీస్ వేసిన డిఫమేషన్ కేసులో ప్రతివాదిగా చేర్చడం సరికాదంటూ గూగుల్ వేసిన అప్పీల్ ను కొట్టేసింది. కేసులో ఇతర అంశాలపై వాదనలతో సంబంధం లేకుండా ఐటీ యాక్ట్ లో నిబంధనల ప్రకారం గూగుల్ ఇండియా విచారణను ఎదుర్కోవాలని కోర్టు చెప్పింది. 2009కి ముందు వరకు అమల్లో ఉన్న ఐటీ యాక్ట్ సెక్షన్ 79 ప్రకారం పరువునష్టం కేసుల్లో గూగుల్ కు ఎలాంటి రక్షణ లేదని తేల్చింది.

తప్పుడు సమాచారం విషయంలో గూగుల్ కు బాధ్యత ఉందంటూ గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను ఆ సంస్థ సవాలు చేసింది. 2014లో దాఖలైన అప్పీల్ పై ఈ ఏడాది ఫిబ్రవరిలో వాదనలు పూర్తిచేసి తీర్పు రిజర్వు చేశారు. దీనిపై మంగళవారం జస్టిస్ అశోక్ భూషణ్, జస్టిస్ కె.ఎం.జోసెఫ్ బెంచ్ తీర్పు చెప్పింది. గూగుల్ నియమనిబంధనల ఆధారంగా హైకోర్టు స్పందించలేదనీ, తనను మధ్యవర్తి (ఇంటర్మీడియరీ)గా చూడకూడదన్న ఆ సంస్థ వాదనను కొట్టేసింది. ఈ కేసులో అన్ని అంశాలను పరిశీలించిన తర్వాత నిర్ణయించాల్సినంది హైకోర్టేనని సుప్రీం చెప్పింది. ఈ కేసులో గూగుల్ పరువునష్టం ఆరోపణలను ఎదుర్కోనే అంశంపైనే ఆదేశాలిస్తున్నామని స్పష్టం చేసింది. దీంతో ఒరిజినల్ కంప్లెయింట్ పై మేజిస్ట్రేట్ విచారణ కొనసాగించవచ్చని చెప్పింది.

గూగుల్ వర్సెస్ విశాక ఇండస్ట్రీస్ కేసు ఇదీ

2008లో మన రాష్ట్రానికి చెందిన విశాక ఇండస్ట్రీస్ కు వ్యతిరేకంగా బానీ (BANI) అనే గ్రూప్ తన బ్లాగ్ లో ఒక ఆర్టికల్ ప్రచురించింది. ఇది తమ ప్రతిష్ఠను దెబ్బతీసేలా ఉందనీ, దీన్ని తొలగించాలని బ్లాగ్ ను హోస్ట్ చేస్తున్న గూగుల్ ఇండియాకు విశాక ఇండస్ట్రీస్ నోటీసులు పంపించింది. దీనిపై గూగుల్ స్పందించకపోవడంతో ఇద్దరినీ ప్రతివాదులుగా చేస్తూ 2009 జనవరిలో సికింద్రాబాద్ లోకల్ కోర్టులో విశాక పరువు నష్టం పిటిషన్ వేసింది. దీనిపై విచారణ కోసం మేజిస్ట్రేట్ నోటీసులు జారీచేశారు. అయితే తనను ప్రతివాదిగా తప్పించాలంటూ గూగుల్ ఏపీ హైకోర్టులో క్వాష్ పిటిషన్ వేసింది. ఐటీ యాక్ట్ సెక్షన్ 79 ప్రకారం తమకు ఇలాంటి కేసుల్లో రక్షణ ఉందని  వాదించింది. సమాచారాన్ని పబ్లిష్ చేయడం, దాన్ని ఆమోదించడంలో గూగుల్ బాధ్యత ఉండదనీ, సమాచారానికి ఫ్లాట్ ఫాంగానే ఉంటామని చెప్పింది. కానీ ఈ వాదనను హైకోర్టు కొట్టేసింది. పరువునష్టం కలిగించే ఆర్టికల్‌‌ను తొలగించాలని విశాక నుంచి నోటీసు పంపినా సరైన చర్యలు తీసుకోలేదని తేల్చింది. ఐటీ చట్టం (2000) సెక్షన్ 79 ప్రకారం నెట్ వర్క్ సర్వీస్ ప్రొడైవర్లకు కూడా క్రిమినల్ నేరంలో భాగం ఉంటుందని హైకోర్టు చెప్పింది. అయితే 2009లో ఈ కేసు విచారణ జరుగుతున్నప్పుడే ఐటీ చట్టం సెక్షన్ 79లో కొన్ని సవరణలు చేసి నెట్ వర్క్ ప్రొవైడర్లకు షరతులతో రక్షణ కల్పించారు. కానీ పిటిషనర్ నోటీసు ద్వారా సమస్యను గూగుల్ దృష్టికి తెచ్చినా పట్టించుకోలేదు కాబట్టి ఈ సెక్షన్ కింద రక్షణ కోరే అవకాశం లేదని హైకోర్టు స్పష్టం చేసింది. హైకోర్టు తీర్పుపై పలు అప్పీళ్ల తర్వాత సుప్రీంకోర్టులో తుది విచారణ జరిగింది. కోర్టు తీర్పుతో విశాక వేసిన పరువు నష్టం పిటిషన్ పై గూగుల్ కూడా విచారణను ఎదుర్కోనుంది.