గత కొన్ని నెలలుగా ప్రముఖ టెక్ కంపెనీలన్నీ ఉద్యోగులను తొలగిస్తున్నాయి. ఆర్థిక మాంద్యం నుంచి తప్పించుకోవడానికే లేఆఫ్ లు ఇస్తున్నట్లు కంపెనీలు చెప్తున్నాయి. అయితే, టాప్ లెవల్ నుంచి కింది స్థాయి వరకు ఉన్న ఉద్యోగుల్లో కొందరిని ఎందుకు తొలగిస్తున్నారో కూడా తెలియక అయోమయంలో పడిపోయారు. ఇలాంటి ఘటనే హైదరాబాద్ లోని గూగుల్ ఆఫీసులో జరిగింది.
గూగుల్ లో డిజిటల్ మీడియా సీనియర్ అసోసియేట్ గా పని చేస్తున్న విజయ్ వర్గియాను పోయిన శనివారం ఉద్యోగం నుంచి తొలగించారు. ఈ విషయాన్ని విజయ్ తన లింక్డిన్ అకౌంట్ లో పోస్ట్ చేశాడు. విజయ్.. గత నెలలో స్టార్ పర్ఫామర్ గా ఎంపికైనా కూడా తనను ఇప్పుడు ఎందుకు తొలగించారోనని అయోమయంలో పడ్డాడు. ‘నాకు శనివారం ఉదయం ఉద్యోగం నుంచి తొలగించినట్లు గూగుల్ నుంచి మెయిల్ వచ్చింది. అయితే, నన్ను తొలగించడానికి గల కారణాన్ని మాత్రం వాళ్లు వెల్లడించలేదు’ అని లిక్డిన్ లో రాసుకొచ్చాడు. ఈ ఘటనతో టెక్ ఉద్యోగులంతా ఆందోళనకు గురవుతున్నారు.
