
'గూండా పన్ను' చెల్లించలేదన్న కారణంతో ఎమ్మెల్యే అనుచరులు యూపీలోని షాజహాన్‌పూర్ లో 7 కిలోమీటర్ల మేర రోడ్డును తవ్వారు. తాము స్థానిక ఎమ్మెల్యే సహచరులమని చెప్పిన ఈ అనుచరుల గుంపు.. కాంట్రాక్టర్ గూండా పన్ను చెల్లించడానికి నిరాకరించడంతో 7 కిలోమీటర్ల రహదారిని తవ్వి ధ్వంసం చేశారు.
గుంపును వెంట వేసుకుని వచ్చిన జగ్వీర్ సింగ్ అనే వ్యక్తి.. తాము ఎమ్మెల్యే అనుచరులమని చెప్పినట్టు కాంట్రాక్టర్, గోరఖ్ పూర్ కు చెందిన శాకుంతల సింగ్ చెప్పాడు. ఈ విషయంపై కాంట్రాక్టర్ జిల్లా మెజిస్ట్రేట్ ఉమేష్ సింగ్ కు ఫిర్యాదు చేశాడు. పోలీసులు సైతం ఈ కేసుపై విచారణ చేస్తున్నారు.
రోడ్డు నిర్మాణ పనులకు రూ.12కోట్ల బడ్జెట్ ఉండగా.. అందులోనుంచి భారీ మొత్తంలో కమిషన్ ఇవ్వాలని కాంట్రాక్టర్ ను, ఎమ్మెల్యే డిమాండ్ చేసినట్టు పోలీసులు తెలిపారు. వీరిలో జగ్వీర్ సింగ్ తో పాటు మరో 20మందిపైనా కేసు నమోదు చేసినట్టు చెప్పారు. పబ్లిక్ ప్రాపర్టీని డ్యామేజ్ చేసినందుకు గానూ వారిపై వివిధ సెక్షన్ల కింద, పబ్లిక్ ప్రాపర్టీ యాక్ట్ కింద కేసు ఫైల్ చేసినట్టు వెల్లడించారు.