రివ్యూ: పక్కా కమర్షియల్

రివ్యూ: పక్కా కమర్షియల్

ప్రతిరోజు పండగే లాంటి హిట్ సినిమా తర్వాత గోపిచంద్తో సినిమా అనౌన్స్ చేశాడు మారుతి. కరోనా వల్ల ఈ సినిమా లేట్ అయింది. ఈ లోపు ‘‘మంచి రోజులొచ్చాయి’’ అంటూ ఓ చిన్న సినిమా తీశాడు. లేటైనా సరే పక్కా కమర్షియల్ సినిమా రిలీజ్ అయింది. ఈ సినిమా ఎలా ఉంది. ప్లాపుల్లో ఉన్న గోపిచంద్కు మారుతి హిట్ ఇచ్చాడా లేదో తెలుసుకుందాం.

కథ ఏమిటంటే... 

సత్యరాజ్ నిజాయితీ గల జడ్జి. కానీ ఓ కేసులో తప్పుగా తీర్పు ఇచ్చి ఓ అమ్మాయి సూసైడ్ కు కారణం అయ్యాననే మనస్థాపంతో రాజీనామా చేసి కిరాణ షాప్ నడుపుకుంటాడు. కానీ ఆయన కొడుకు గోపిచంద్ తన తండ్రిని ఇన్సిపిరేషన్గా తీసుకొని లాయర్ అవుతాడు. కానీ పక్క కమర్షియల్. డబ్బులిస్తే ఎంతటి మొండి కేస్ అయిన గట్టిగా వాదించి అన్యాయం చేసిన వాళ్లను గెలిపిస్తాడు. ఓ కేసులో భాగంగా గోపిచంద్కి రావు రమేష్ అనే క్రిమినల్ పరిచయమవుతాడు. తను చేసిన తప్పలకు గోపిచంద్ కు బాగా డబ్బిచ్చి కేసులు గెలుస్తాడు. కానీ సత్యరాజ్ రిజైన్ చేయడానికి రావురమేష్ యే కారణం. అది తెలిసినా పట్టించుకోడు గోపిచంద్. ఆయన అలా కమర్షియల్ గా ఉండటానికి రీజన్ ఏంటి? చివరకు ఏం జరిగింది? తన తండ్రికి న్యాయం చేశాడా లేదా అనేది కథ.

నటీనటులు ఎలా చేశారంటే..

గోపిచంద్ ఈ మూవీ లో స్టైలిష్ గా కనినించాడు. పక్కా కమర్షియల్ లాయర్ గా తన పాత్రకు 100 పర్సెంట్ న్యాయం చేశాడు. రాశిఖన్నా బ్యూటిఫుల్ గా ఉంది. కానీ కొన్నిసార్లు ఓవర్ ది బోర్డ్ వెళ్లింది. సీరియల్ ఆర్టిస్టు పాత్రలో కొన్ని సార్లు కామెడీ పండించినా మేజర్ పార్ట్ విసిగించింది. రావు రమేష్ మాత్రం సినిమాకు హైలైట్ అని చెప్పాలి. కామిక్ టచ్ ఉన్న విలనీ పాత్రలో అదరగొట్టాడు. తన డైలాగ్ డెలివరీ, కామెడీ టైమింగ్ తో ఎంటర్ టైన్ చేశాడు. ప్రతీ రోజు పండగే తర్వాత మళ్లీ ఫుల్ లెంగ్త్ రోల్ లో రాణించి సినిమాకు హెల్ప్ అయ్యాడు. సత్యరాజ్ తన పాత్ర లో ఒదిగిపోయి నటించాడు. అజయ్ ఘోష్ కామెడీ నవ్విస్తుంది. సప్తగిరి, వైవా హర్ష లు విసిగించారు. సినిమాటోగ్రఫీ బాగుంది. జెక్స్ బిజోయ్ సంగీతం అస్సలు బాగోలేదు. పాటలు ఒక్కటి కూడా హమ్మింగ్  చేసుకునేలా లేవు. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ లౌడ్ గా ఉంది. నిర్మాతలు ఎక్కడా రాజీపడకుండా ఖర్చుపెట్టారు. యాక్షన్ సీన్లు బాగా కంపోజ్ చేశారు. ఎడిటింగ్ బాగోలేదు.

ఎలా ఉందంటే... 

మారుతి రాసుకున్న కామెడీ డైలాగులు కొన్ని పేలినా.. డబుల్ మీనింగ్ డైలాగులు ఇబ్బందిగా అనిపిస్తాయి. ‘‘పక్కా కమర్షియల్’’ రొటీన్ కామెడీ ఎంటర్ టైనర్. మారుతి రాసుకున్న కథ, కథనాల్లో ఎక్కడా కొత్తదనం లేదు. ట్రీట్ మెంట్ అయినా డిఫరెంట్ గా ఉందా అంటే అదీ లేదు. టైటిల్ లోనే కమర్షియలిటీ ఉంది కదా అని ఇష్టం వచ్చినట్టు తీశాడు మారుతి. అనసరమైన సీన్లు , సాంగ్స్ తో పాటు బూతు డైలాగులు మరీ ఎక్కువయ్యాయి. దాని వల్ల బిసి సెంటర్ మాస్ ప్రేక్షకులకు నవ్వొస్తుందేమో కానీ ఇతరులకు ఇబ్బందిగా అనిపిస్తుంది. ఉదాహరణకు రావురమేష్ ను వుమనైజర్ గా చూపించి తన పెళ్లి, శోభనం గురించి చెప్పే సీన్లు, డబుల్ మీనింగ్ డైలాగులు వెగటుగా అనిపిస్తాయి. మారుతి ఈ ఫార్మాట్ నుండి బయటకు రావటం లేదు.

అంత పెద్ద జడ్జి అయి వుండి సీరియల్ ఆర్టిస్టు చెప్పేదాకా హెబియస్ కార్పెట్ రిట్ గురించి తెలియకపోవడం ఏమిటో.  ఇలాంటి లాజిక్ లేని సీన్లు చాలా ఉన్నాయి. సాంగ్స్ ప్లేస్ మెంట్ కూడా బాగాలేదు. ఎంతసేపు ఆడియన్స్ ను నవ్విద్దామనే ప్రయత్నం తప్ప మంచి దమ్మున్న సీన్లు రాసుకోలేదు. ఫస్టాఫ్ సోసోగా సాగిపోయినా సెకండాఫ్ విసిగిస్తుంది. క్లైమాక్స్ లో రావురమేష్ పర్పార్మెన్స్ వల్ల ఓకే అనిపిస్తుంది. ఓవరాల్ గా ‘‘పక్కా కమర్షియల్’’ నిరాశపరుస్తుంది. డబుల్ మీనింగ్ జోక్ లు ఎంజాయ్ చేసే వాళ్లకు ఓకేనేమో కానీ మంచి సినిమా చూసిన పీలింగ్ ‘‘పక్కా కమర్షియల్’’ ఇవ్వదు.

రివ్యూ: పక్కా కమర్షియల్
నటీనటులు: గోపిచంద్, రాశిఖన్నా, సత్యరాజ్, రావు రమేష్, శ్రియా, చిత్ర శుక్లా, వరలక్ష్మీ శరత్ కుమార్, అజయ్ ఘోష్, ప్రవీణ్, సప్తగిరి, వైవా హర్ష తదితరులు
సినిమాటోగ్రఫీ: కర్మ్ చావ్లా
మ్యూజిక్ : జెక్స్ బిజోయ్
నిర్మాతలు: యువి క్రియేషన్స్, గీతా ఆర్ట్స్ 2
రచన,దర్శకత్వం: మారుతి
రిలీజ్ డేట్: జులై 1, 2022