సిద్దిపేట, వెలుగు: యాసంగిలో ఉమ్మడి మెదక్ జిల్లా రైతుల సాగుకు నీటిని విడుదల చేయాలని కోరుతూ శనివారం రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి, మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్ రావు లేఖ రాశారు. ఉమ్మడి మెదక్ జిల్లాలో కాళేశ్వరం ప్రాజెక్ట్ లో భాగంగా అన్నపూర్ణ, రంగనాయక సాగర్, మల్లన్న సాగర్, కొండ పోచమ్మ సాగర్ లు నిర్మించి గత ఆరేళ్లుగా జిల్లా రైతాంగానికి గోదావరి జలాలు అందించామని పేర్కొన్నారు.
కాళేశ్వరం ప్రాజెక్ట్‌లో భాగంగా 4 ప్రాజెక్టుల ద్వారా సిద్దిపేట, మెదక్, యాదాద్రి, జనగామ, సిరిసిల్ల జిల్లాలకు సాగు, తాగునీరు అందించామని వివరించారు. ఈ సంవత్సరం సైతం యధావిధిగా సాగు నీరందించాలని కోరారు. ఇప్పటికే యాసంగికి సీజన్ లో రైతులు నాట్లు వేసుకొని నీళ్ల కోసం ఎదురు చూస్తున్న నేపథ్యం లో ప్రభుత్వం తరుపున భరోసా ఇవ్వాలని సూచించారు.
