- ఖమ్మంలో ఉత్సాహంగా కొనసాగుతున్న పీడీఎస్‌యూ 23వ రాష్ట్ర మహాసభలు
ఖమ్మం టౌన్, వెలుగు : ఖమ్మం జిల్లా కేంద్రంలో ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం (పీడీఎస్‌యూ) తెలంగాణ రాష్ట్ర 23వ మహాసభలు రెండో రోజూ కొనసాగాయి. ఈ సందర్భంగా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ప్రొఫెసర్ పి.లక్ష్మీనారాయణ మాట్లాడుతూ కేంద్రంలోని మోదీ, రాష్ట్రంలోని రేవంత్ రెడ్డి ప్రభుత్వాలు విద్యను వ్యాపార వస్తువుగా మార్చి, పెట్టుబడిదారీ వర్గాల ప్రయోజనాల కోసమే సంస్కరణలు చేపడుతున్నాయని, ఇది దేశ భవిష్యత్‌కు ప్రమాదకరమని ఆందోళన వ్యక్తం చేశారు.
కేవలం శాస్త్రీయ, ప్రజాస్వామ్య విద్య ద్వారానే సమానత్వ సమాజం ఏర్పడుతుందని, దీనికోసం విద్యార్థులు, మేధావులు, ప్రజలందరూ సంఘటితంగా పోరాడాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ సభకు ముందు పీడీఎస్‌యూ రాష్ట్ర అధ్యక్షుడు కాంపాటి పృథ్వీ సంఘం జెండాను ఆవిష్కరించగా, ప్రధాన కార్యదర్శి ఎస్. అనిల్ అమరవీరుల సంతాప తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. ప్రముఖ విద్యావేత్త ఐ.వి. రమణారావు సమాజ మార్పులో విద్యార్థుల పాత్రను కొనియాడగా, అరుణోదయ కళాకారుల విప్లవ గీతాలు ప్రతినిధుల్లో ఉత్తేజాన్ని నింపాయి.
దేశం ప్రమాదకర దిశగా సాగుతోంది : పరకాల ప్రభాకర్
ఖమ్మం పట్టణంలో జరుగుతున్న పీడీఎస్‌యూ 23వ రాష్ట్ర మహాసభల సదస్సులో ప్రముఖ రాజకీయ విశ్లేషకులు పరకాల ప్రభాకర్ ప్రసంగిస్తూ, దేశంలో పెరుగుతున్న ఫాసిజంపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు.
ఫాసిజం నేరుగా ప్రజల్లోకి రాదని, తొలుత అది మేధావుల మనసుల్లోనే పాతుకుపోతుందని ఆయన హెచ్చరించారు. జర్మనీ చరిత్రను ఉదాహరణగా చూపుతూ, నాజీలు అధికారంలోకి వచ్చే నాటికి అక్కడి విశ్వవిద్యాలయాల్లోని 90 శాతం మంది విద్యార్థులు నాజీ పార్టీ సభ్యులుగా ఉండేవారని, అత్యున్నత విద్యావంతులే ఫాసిజానికి బలమైన మద్దతుదారులుగా మారతారని ఆయన గుర్తు చేశారు.
ఎర్రకోటపై త్రివర్ణ పతాకం భవిష్యత్తుపై నెలకొన్న సందిగ్ధత ప్రజాస్వామ్యవాదులను కలవరపెడుతోందని, దేశం ప్రమాదకరమైన దశలోకి అడుగుపెడుతోందని విశ్లేషించారు. ఈ కార్యక్రమంలో పీడీఎస్‌యూ రాష్ట్ర అధ్యక్షుడు కె. పృథ్వీ, కార్యదర్శి అనిల్, నాయకులు నరేందర్, అఖిల్, నరసింహారావు, వెంకటేశ్, లక్ష్మణ్, రాకేశ్, సాయి, కావ్య, దీక్షిత, అనూష తదితరులతో పాటు పెద్ద సంఖ్యలో విద్యార్థులు పాల్గొన్నారు
