మాలల అభ్యున్నతికి కాకా వెంకటస్వామి కృషి మరవలేనిది: గోరటి వెంకన్న

మాలల అభ్యున్నతికి కాకా వెంకటస్వామి కృషి మరవలేనిది: గోరటి వెంకన్న

మాలల అభ్యున్నతికి కాకా వెంకటస్వామి చేసిన కృషి మరువలేనిదని ఎమ్మెల్సీ, ప్రజా కవి గోరటి వెంకన్న అన్నారు. అదే క్రమంలో ఆవుల బాలనాధం కృషి చేశారని చెప్పారు. మాల సమాజంలో అంబేద్కర్ పుట్టడం వల్లనే వెనుకబడిన వర్గాల అభివృద్ధి జరిగిందన్నారు. ఆత్మగౌరవంలో సిక్కుల తర్వాత మాలలే ఉంటారన్నారు. మాల జాతిలో కాక, శంకరన్, గద్దర్ వంటి ఎంతో మంది ఆణిముత్యాలు ఉన్నారని.. వారంతా నిస్వార్థంగా పనిచేశారని చెప్పారు. జాతీయ మాలల ఐక్య వేదిక ఆధ్వర్యంలో  హైదరాబాద్  జాంబాగ్ లోని జాతీయ మాలల ఐక్య వేదిక వ్యవస్థాపకులు ఆవుల బాలనాధం జయంతి, మాలల అలాయ్ బలాయ్ సమ్మేళనంలో గోరటి వెంకన్న పాల్గొన్నారు.

మాలల ఐక్యత కోసం కాకా వెంకటస్వామి తరువాత ఆ స్థాయిలో పని చేసిన వ్యక్తి ఆవుల బాలనాధం అని తెలంగాణ గిడ్డంగుల కార్పొరేషన్ ఛైర్మన్ సాయి చంద్ అన్నారు. అంబేద్కర్ ఆశయాల కోసం పని చేసిన వ్యక్తి  ఆవుల బాలనాధం అని తెలిపారు. ఏ పదవులు ఆశించకుండా మాలల జాతీయ ఐక్యత కోసం నిత్యం పని చేసిన వ్యక్తి బాలనాధం అన్నారు. ఎన్ని సంఘాలు పెట్టుకున్నా అందరూ ఐక్యంగా ఉండాలన్నారు. రాష్ట్రంలో చాలా మంది ఎమ్యెల్యేలు, ఎంపీలు ఉన్నారని....అందరం కలిసి ఆవుల బాలనాధం ఆశయాలు నెరవేర్చుకుందామన్నారు. పార్టీలకు అతీతంగా మాలలం అందరం ఐక్యంగా ఉండాలన్నారు.  

విద్యతో పాటు, ఆర్థికంగా బలోపేతం అయితేనే మాలలు ఉన్నతస్థానానికి ఎదుగుతారని రాష్ట్ర బేవరేజెస్ కార్పొరేషన్ చైర్మన్ గజ్జెల నగేష్ అన్నారు. అన్ని రంగాల్లో మాలలు ఉన్నారని..సరైన సమయలో సరైన నిర్ణయం తీసుకునే పరిస్థితి ఉండాలన్నారు.  కులం తెలిసేలా పేరు చివరన పెట్టుకోవడం కంటే.. ఒకరికొకరు సాయం చేసుకోవాలన్నారు.