కరీంనగర్, వెలుగు: కరీంనగర్ జిల్లా చిగురుమామిడి, సైదాపూర్ మండలాల పరిధిలోని 15,631 ఎకరాలకు సాగునీరు అందించేందుకు గౌరవెల్లి ప్రాజెక్టు కుడి కాలువ(డీ4) పనులు వేగవంతమయ్యాయి. కాలువ నిర్మాణానికి భూసేకరణకు త్వరలో రూ.54.55 కోట్లు మంజూరు కానున్నాయి. 15,631 ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందించే గౌరవెల్లి ప్రాజెక్టులో కీలకమైన డీ4 కాలువ నిర్మాణానికి చిగురుమామిడి, సైదాపూర్ మండలాల పరిధిలో 260 ఎకరాల సేకరించనున్నారు.
భూసేకరణలో సమస్యలు, రైతుల అభ్యంతరాలు, పరిహారం చెల్లింపులో జాప్యం వంటి అంశాల్లో మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రత్యేక చొరవ చూపారు. ఇరిగేషన్, రెవెన్యూ అధికారులతో తరచూ సమీక్షిస్తూ భూ సేకరణ కోసం స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా న్యాయమైన పరిహారం చెల్లించాలన్న సంకల్పంతో ముందుకెళ్లారు. ఫలితంగా భూ సేకరణ వేగవంతమైంది. భూ సేకరణకు 54.55 కోట్ల విడుదలకు ట్రెజరీ శాఖలో టోకెన్ జనరేట్ అయింది.
