పాలనకు ఇంటర్వెల్..సెక్రటేరియెట్ షిప్టింగ్ తో గందరగోళం

పాలనకు ఇంటర్వెల్..సెక్రటేరియెట్ షిప్టింగ్ తో గందరగోళం
  • సెక్రటేరియెట్‌ షిఫ్టింగ్​తో తీవ్ర గందరగోళం
  • ఇప్పటికే ఫైళ్లను కట్టలు కట్టిన సిబ్బంది
  • కోర్టు వివాదాలతోషిఫ్టింగ్పై ఉద్యోగుల్లో అయోమయం
  • పెండింగ్లో ఫైల్స్.. అత్యవసరమైతేనే క్లియరెన్స్
  • ఫైళ్లను పంపాలో లేదో తెలియని పరిస్థితిలో వివిధ శాఖలు
  • అమావాస్య తర్వాత 3వ తేదీ నుంచి షిఫ్టింగ్​కు ఏర్పాట్లు!

హైదరాబాద్‌‌, వెలుగు: అటు బీఆర్కే భవన్​ ఖాళీ అయింది.. ఇటు సెక్రటేరియెట్​లో ఫైళ్లు ప్యాక్​ అయ్యాయి. మరి షిఫ్టింగ్​ ఎప్పుడు?! .. అప్పటివరకు ఫైళ్ల క్లియరెన్స్​ ఎలా?!.. నెలరోజులుగా ఉద్యోగుల్లో ఇదే గందరగోళం. రన్నింగ్​ ఫైళ్లు తప్ప దాదాపు అన్ని పెండింగ్​ ఫైళ్లను సిబ్బంది ప్యాక్​ చేసి పెట్టారు. షిఫ్టింగ్​ చేసేవరకు అత్యవసరమైతే తప్ప వాటిని ఓపెన్​ చేసే పరిస్థితి లేదు. దీంతో వ్యక్తిగత ఫైళ్ల క్లియరెన్స్​ కోసం సెక్రటేరియెట్​కు వచ్చేవాళ్లు ఇబ్బంది పడాల్సి వస్తోంది. బయటి శాఖలు, జిల్లాల్లోని వివిధ శాఖలు కూడా ఫైళ్లను సెక్రటేరియెట్​కు  (మొదటి పేజీ తరువాయి)

వచ్చే జనం పడిగాపులు కాయాల్సి వస్తోంది. బయటి శాఖలు, జిల్లాల్లోని వివిధ శాఖలు కూడా ఫైళ్లను సెక్రటేరియెట్​కు పంపేందుకు వెనుకడుగు వేస్తున్నాయి. షిఫ్టింగ్‌ తతంగం ముగిసిన తర్వాతే ఫైళ్ల సంగతి చూసుకోవచ్చని ఆయా శాఖలు భావిస్తున్నాయి. అమావాస్య తర్వాత షిఫ్టింగ్​మొదలవుతుందని అధికారులు అంటున్నా.. అది పూర్తి కావడానికి రెండు నెలలకు పైగా పట్టే అవకాశం ఉంది. ఫలితంగా అన్నిరోజులూ సాధారణ పరిపాలన దెబ్బతింటుందని కొందరు ఉద్యోగులు అంటున్నారు.

ఇప్పుడున్న సెక్రటేరియెట్​ను కూల్చి.. అక్కడే కొత్త సెక్రటేరియెట్​ను కట్టాలని, అసెంబ్లీని ఎర్రమంజిల్​లో కట్టాలని నిర్ణయించిన రాష్ట్ర ప్రభుత్వం.. జూన్​ 27న కొత్త బిల్డింగ్స్​ కోసం శంకుస్థాపనలు కూడా చేసింది. దీంతో కొత్త సెక్రటేరియెట్​ కట్టేవరకు ఇప్పుడున్న సెక్రటేరియెట్​లోని వివిధ శాఖలను బీఆర్కే భవన్​కు తరలించాలని, మరికొన్ని శాఖలను ఆయా శాఖల ప్రధాన కార్యాలయాలకు తరలించాలని అధికారులు నిర్ణయించారు. రన్నింగ్​ ఫైళ్లను తప్ప మిగతా ఫైళ్లన్నింటినీ షిఫ్టింగ్​ కోసం సిబ్బంది కట్టలు కట్టి రెడీగా ఉంచారు. అయితే.. కొత్త బిల్డింగ్​ల పేరిట ప్రభుత్వం ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తోందని పలు రాజకీయపార్టీలు, ప్రజా సంఘాలు కోర్టును ఆశ్రయించాయి. మంచిగా ఉన్న సెక్రటేరియెట్​ను కూల్చాల్సిన అవసరం ఏమిటని పిటిషన్లు వేశాయి. విచారణ సందర్భంగా కోర్టు వివిధ అంశాలను లేవనెత్తుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో అసలు సెక్రటేరియెట్​ షిఫ్టింగ్‌ ఉంటుందా, ఉండదా, ఉంటే ఎప్పుడు అనే డౌట్‌లో ఉద్యోగుల్లో నెలకొంది. దాంతో కట్టిపెట్టిన ఫైళ్లను విప్పలేక, రన్నింగ్‌లో ఉన్న ఫైళ్లను ప్యాక్‌ చేయలేక వారు ఇబ్బందులు పడుతున్నారు. ఏ ఫైల్‌ను వెంటనే క్లియర్‌ చేయాలో, దేన్ని పెండింగ్‌లో పెట్టాలో కూడా తెలియని పరిస్థితిలో కొందరు సెక్షన్‌ ఆఫీసర్లు, పైఅధికారులు ఉన్నారు.

గల్లంతైతే పరిస్థితి ఏంది?

సెక్రటేరియెట్‌ బయట వివిధ కీలక శాఖలు పని చేస్తాయి. ఉదాహరణకు డైరెక్టర్‌ ఆఫ్‌ స్కూల్‌ ఎడ్యుకేషన్‌, వ్యవసాయ శాఖ, డీఎంఈలు సెక్రటేరియెట్‌కు ఏదైనా ఫైల్‌ పంపాలంటే ముందూ వెనకా ఆలోచించాల్సిన పరిస్థితి ఉంది. అత్యంత కీలకం, అర్జెంట్‌ అనుకుంటే తప్ప ఫైళ్లను పంపడం లేదని సమాచారం. షిఫ్టింగ్‌లో ఉన్న సమయంలో ఫైల్‌ను పంపితే అది గల్లంతవుతుందేమోనని అనుమానంతోనే తాము ఈ పని చేస్తున్నామని అధికారులు అంటున్నారు. దీంతో సాధారణంగా సాగాల్సిన ఫైళ్ల మూమెంట్‌కి ఆటంకం కలుగుతోందని వారు  చెప్తున్నారు.

షిఫ్టింగ్​ బిజీలో ఉన్నాం.. మళ్లీ రండి!

వ్యక్తిగత వ్యవహారాలతో ఫైళ్ల క్లియరెన్స్‌కు వచ్చే వారైతే ఉత్త చేతులతో వెనక్కి వెళ్తున్నారు. షిఫ్టింగ్‌ బిజీలో ఉన్నామని, తర్వాత రావాలని చెప్పి వారిని తిప్పిపంపుతున్నట్లు తెలుస్తోంది. సాధారణంగా సెక్రటేరియెట్‌కు రోజూ మూడు వందల నుంచి ఐదు వందల మంది వస్తుంటారు. ప్రస్తుతం ఈ సంఖ్యలో స్వల్ప తేడానే కనిపిస్తున్నప్పటికీ ఇందులో ఎక్కువ శాతం సీఎంఆర్‌ఎఫ్‌ లాంటి పనుల కోసం వచ్చేవారు ఉన్నారు. సర్వీసు వ్యవహారాల విషయంలో వచ్చే వారికి మాత్రం పనులు కావడం లేదని తెలుస్తోంది.

పూర్తి షిఫ్టింగ్​కు 60 రోజుల ప్లాన్​!

ఏడాది లోపు కొత్త సెక్రటేరియెట్​ పూర్తవుతుందని, అప్పటివరకు తాత్కాలిక భవనాల్లో కొనసాగిస్తామని అధికారులు అంటున్నారు. 15 రోజుల నుంచి రెండు నెలలలోపు సెక్రటేరియెట్‌ షిఫ్టింగ్‌ పూర్తి చేయాలని నిర్ణయించుకున్నారు. ఇందుకోసం తొలి దఫాగా రూ. 90 లక్షలు కూడా కేటాయించారు. సెక్రటేరియెట్‌ నుంచి పబ్లిక్‌ ఎంటర్‌ప్రైజెస్‌ డిపార్ట్‌మెంట్​కు రెండు రోజుల సమయం ఇస్తే రెవెన్యూ లాంటి శాఖలకు 60 రోజుల సమయం ఇచ్చారు. ఎక్కువ శాఖలకు ఐదు, నుంచి పది రోజుల టైమ్‌ ఇచ్చారు. దాంతో ఆయా శాఖలు తొలుత పెండింగ్‌ ఫైళ్లను కట్టలు కట్టాయి. ఫైళ్ల భద్రతను ఆయా సెక్షన్‌ ఆఫీసర్లకు అప్పజెప్పారు. వాటి పర్యవేక్షణ కోసం నోడల్‌ అధికారులను నియమించారు. పెండింగ్‌ ఫైళ్లు, అంతగా అర్జెన్సీ లేవని భావించిన ఫైళ్లను దాదాపు అన్ని శాఖలు ప్యాక్‌ చేసి పెట్టాయి. రన్నింగ్‌ ఫైళ్లను మాత్రం అట్లాగే పెట్టాయి. షిఫ్టింగ్‌ విషయం ఎటూ తేలకపోవడంతో ప్యాక్‌ చేసిన ఫైళ్లు నెలరోజులుగా సెక్రటేరియెట్​లో పడి ఉంటున్నాయి.  ప్రభుత్వం నుంచి ఏదైనా ముఖ్యమైన ఫైల్‌ కావాలనే సమాచారం వస్తే తప్ప వాటిని ఓపెన్‌ చేయడం లేదు.

వచ్చే నెల 3  నుంచి షిఫ్టింగ్​?

షిఫ్టింగ్ విషయంలో నెలకొన్న గందరగోళం, కొన్ని రకాల పనుల్లో జాప్యాన్ని సాధారణ పరిపాలన శాఖ (జేఏడీ) అధికారులు కూడా గమనించారు. ఈ నేపథ్యంలో వారు శుక్రవారం సెక్రటేరియెట్‌లో సమావేశమయ్యారు. పొద్దుపోయే వరకు ఈ సమా వేశం కొనసాగింది. ఆయా శాఖలకు ఎంత ప్లేస్‌ అవసరం, ఏ ఏ శాఖను ఎక్కడెక్కికి షిఫ్ట్​ చేయాలి అనే విషయంలో చర్చించినట్లు తెలిసింది. ఇప్పటి వరకు పెండింగ్‌, డిస్పోజబుల్‌ ఫైళ్లను కట్టలు కట్టారని తెలుసుకున్న జీఏడీ అధికారులు.. రెగ్యులర్‌ ఫైళ్లను కూడా కట్టలు కట్టించాలని నిర్ణయించినట్లు సమాచారం. వచ్చే నెల 2న అమావాస్య ఉన్నందున  ఆతర్వాతే  షిఫ్టింగ్​ స్టార్ట్  చేయాలని నిర్ణయించినట్లు తెలిసింది. వచ్చే నెల 3 నుంచి షిఫ్టింగ్​ప్రక్రియ ప్రారంభించాలని జీఏడీ  అధికారులు అన్ని శాఖల ముఖ్య కార్యదర్శులను ఆదేశించినట్లు సమాచారం. శాఖల వారీగా సెక్రటేరియెట్​ తరలింపు బాధ్యతలను  వివిధ మూవర్స్​ అండ్​ ప్యాకర్స్​ సంస్థలకు అప్పగించారు. సెక్రటేరియెట్​ నుంచి బీఆర్కే భవన్​కు ఫైళ్లు, సామాగ్రితో తరలే ఒక్కో వెహికిల్​కు రూ. 18వేల నుంచి 25 వేల వరకు చెల్లించాలని అధికారులు నిర్ణయించినట్లు తెలిసింది. సెక్రటేరియెట్‌లో మొత్తం 29 శాఖలున్నాయి. తొలుత అనుకున్నట్లు నెల నుంచి రెండు నెలల్లో షిఫ్టింగ్​ప్రక్రియ మొత్తం పూర్తి కాకపోవచ్చని, మరింత సమయం పట్టే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు