
- అన్ని రంగాల్లో అభివృద్ధి చెందేలా చూస్తాం: మంత్రి వివేక్
- కమీషన్ల కోసమే గత బీఆర్ఎస్ సర్కార్ బిల్డింగ్లు కట్టింది
- ప్రజా సమస్యలను పట్టించుకోలేదని ఫైర్
- నేతకాని కులం స్పెల్లింగ్ మిస్టేక్‌ను సవరించాలి: ఎంపీ వంశీకృష్ణ
- మంచిర్యాలలో కమ్యూనిటీ భవన నిర్మాణానికి శంకుస్థాపన
కోల్‌బెల్ట్/బెల్లంపల్లి, వెలుగు: నేతకాని కార్పొరేషన్ ఏర్పాటుకు కృషి చేస్తున్నామని మంత్రి వివేక్ వెంకటస్వామి అన్నారు. అన్ని రంగాల్లో నేతకాని కులస్తులు అభివృద్ధి చెందేలా చూస్తామని హామీ ఇచ్చారు. మంచిర్యాల జిల్లా కేంద్రం సున్నంబట్టివాడ 100 ఫీట్ రోడ్ ఏరియాలోని నేతకాని కమ్యూనిటీ భవన్ విస్తరణ పనులకు పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణతో కలిసి మంత్రి వివేక్ భూమి పూజ చేశారు. రూ.50 లక్షల ఎంపీ ల్యాడ్స్‌తో నిర్మాణ పనులు చేపడ్తున్నారు. తర్వాత మందమర్రిలోని బీ-1 క్యాంపు ఆఫీస్‌లో కాంగ్రెస్ కార్యకర్తలతో రివ్యూ మీటింగ్ నిర్వహించి మంత్రి వివేక్ మాట్లాడారు. ‘‘నేతకాని కులస్తులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తా. కుల సంఘం భవనం కట్టించాలని, కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని నేతకాని కులస్తులు నా దృష్టికి తీసుకొచ్చారు. పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణతో కలిసి కార్పొరేషన్ ఏర్పాటు అంశాన్ని సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లినం. ఇదే విషయాన్ని అసెంబ్లీ, కేబినెట్ సమావేశాల్లోనూ ప్రస్తావించినం’’అని మంత్రి వివేక్ అన్నారు.
నిధుల కేటాయింపులో సంఘాలకు ప్రయారిటీ
గత బీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని దిగజార్చిందని మంత్రి వివేక్ మండిపడ్డారు. నిధుల కొరత తీరగానే.. నేతకాని కార్పొరేషన్ ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ‘‘కార్పొరేషన్ ఏర్పాటైతే కులస్తులు ఆర్థికంగా అభివృద్ధి చెందుతారు. సంఘాలకు నిధుల కేటాయింపులో ప్రయారిటీ ఇస్తున్నాం. న్యాయబద్ధమైన రిజర్వేషన్ కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను కోరుతాను. చెన్నూరులో నేతకాని భవన నిర్మాణానికి కృషి చేస్తా. కోటపల్లి మండల పరిధిలోని ఫారెస్ట్ ఏరియాల్లో అనుమతుల కారణంగా అభివృద్ధి పనుల్లో జాప్యం జరుగుతున్నది. పర్మిషన్ల కోసం ఎన్విరాన్మెంట్ సెక్రటరీ, ఆఫీసర్లతో ఈ నెల 18న రివ్యూ మీటింగ్‌లో చర్చిస్తాం. మంచిర్యాల జిల్లా వ్యాప్తంగా ఇందిరమ్మ ఇండ్ల పనులు వేగంగా కొనసాగుతున్నాయి. మందమర్రి, క్యాతనపల్లి, చెన్నూరు మున్సిపాలిటీల్లో రూ.100 కోట్లతో ప్రారంభించిన అమృత్ స్కీమ్ పనులు నత్తనడకన సాగుతున్నాయి’’అని మంత్రి వివేక్ తెలిపారు.
నిధులు కేటాయించడం ఆనందంగా ఉంది: ఎంపీ వంశీకృష్ణ
ఎంపీగా గెలిచాక.. మంత్రి వివేక్ వెంకటస్వామి ఆదేశాలతో మొదటిసారి తన ఎంపీ ల్యాడ్స్ నుంచి రూ.50 లక్షల ఫండ్స్‌ను నేతకాని భవనం కోసం కేటాయించడం ఎంతో ఆనందంగా ఉందని పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ అన్నారు. ‘‘నేతకాని కులం స్పెల్లింగ్ మిస్టేక్ ఉందన్న విషయాన్ని నా దృష్టికి వచ్చింది. దీన్ని సవరించాలని మంత్రి వివేక్ వెంకటస్వామితో కలిసి రాష్ట్ర న్యాయ శాఖ మంత్రి దృష్టికి తీసుకెళ్లినం. స్పెల్లింగ్ మిస్టేక్‌తో నేతకాని కులస్తులు ఇబ్బందులు పడుతున్నారు. వారి ఆత్మగౌరవం కాపాడటం కోసం స్పెల్లింగ్ కరెక్షన్ చేయాల్సి ఉంది. ఇదే విషయాన్ని మంత్రి వివేక్ అసెంబ్లీలో కూడా ప్రస్తావించారు. అందరూ కలిసి ఉంటే హక్కులు సాధించొచ్చని మా తాత, మాజీ కేంద్రమంత్రి కాకా వెంకటస్వామి నమ్మేవాళ్లు. ఆయన్ను స్ఫూర్తిగా తీసుకొని నేను, మంత్రి వివేక్ ముందుకు సాగుతున్నాం’’అని గడ్డం వంశీకృష్ణ అన్నారు.