మహిళా దర్బార్ వినతుల పరిష్కారానికి గవర్నర్ కృషి

మహిళా దర్బార్ వినతుల పరిష్కారానికి గవర్నర్ కృషి

మహిళా దర్బార్ కు వచ్చిన వినతులను పరిష్కరించేందుకు గవర్నర్ తమిళసై కృషి చేస్తున్నారు. ముందుగా సోషల్ ఇష్యూస్ కింద ఉన్న 40 మంది సమస్యలను పరిష్కరించాలని డిసైడ్ అయ్యారు. ఇందులో భాగంగానే  వారిని ఇవాళ రాజ్ భవన్ కు పిలిపించారు. వీరికి లీగల్ సలహాలు, కౌన్సిలింగ్ ఇచ్చేందుకు జాతీయ మహిళ కమిషన్ చైర్మన్ రేఖా శర్మ రాజ్ భవన్ కు వచ్చారు. మహిళ దర్బార్ లో ముగ్గురికి గవర్నర్ ఆర్థిక సాయం చేశారు. కవాడిగూడకు చెందిన జ్యోతికి 25 వేలు, మాల్కాజ్ గిరికి చెందిన ఉమారాణికి 25 వేలు, ఆత్మకూరుకు చెందిన కుమారికి 25 వేల ఆర్థికసాయం అందించారు.

రేఖాశర్మ దేశంలో ఉన్న మహిళలకు అండగా నిలిచే స్థానంలో ఉన్నారని గవర్నర్ చెప్పారు. మహిళలు తమకున్న సమస్యలను ఆమె దృష్టికి తీసుకెళ్తే సంబంధిత శాఖల అధికారులను అదేశిస్తారని చెప్పారు. హైదరాబాద్ లీగల్ సెల్ అథారిటీ కూడా మహిళల సమస్యల పరిష్కారం కోసం ముందుకొచ్చిందన్నారు. తెలంగాణలో ఎన్నో పెండింగ్ కేసులు ఉన్నాయని జాతీయ మహిళ కమిషన్ చైర్మన్ రేఖాశర్మ అన్నారు. మహిళలకు ఏవైన సమస్యలు ఉంటే పోలీసులకు ఫిర్యాదు చేయాలని తెలిపారు. వారు వినకపోతే రాష్ట్ర మహిళ కమిషన్ లేదా జాతీయ మహిళ కమిషన్ కు ఫిర్యాదు చేయాలని తెలిపారు. ఆన్లైన్ లో తమ పోర్టల్ అందుబాటులో ఉందని..దానిలో ఫిర్యాదు చేయొచ్చని సూచించారు. గవర్నర్ ప్రజల సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తుండడం గొప్ప విషయమన్నారు. 

జూన్ 10న మొదటిసారి గవర్నర్ తమిళిసై మహిళా దర్బార్ ఏర్పాటు చేశారు. మహిళల ఆవేదనను, వారి కష్టాలను తెలుసుకునేందుకు మహిళా దర్బార్ నిర్వహిస్తున్నట్లు గతంలోనే తెలిపారు. మహిళా దర్బార్ కు వందలాదిగా వినతులు వచ్చాయి. ఎక్కువగా భూసమస్యలు.. మహిళలు, బాలికలపై వేధింపులు, అత్యాచారాలు, ఆరోగ్య సమస్యలు, ఉద్యోగ బదిలీలు.. వంటి అనేక సమస్యలను మహిళలు గవర్నర్ ముందు విన్నవించారు. వారిలో గవర్నర్ రాజ్ భవన్ కు పిలిపించారు.