
- ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ
కామారెడ్డి, వెలుగు: ఎన్నికల్లో ఇచ్చిన ఆరు హామీలతో పాటు కాంగ్రెస్ ప్రభుత్వం ఇవ్వని హామీలను సైతం నెరవేరుస్తుందని ప్రభుత్వ సలహాదారుడు షబ్బీర్అలీ అన్నారు. ఆదివారం దోమకొండ మండల కేంద్రంలో ఇందిరమ్మ మోడల్ ఇంటిని పరిశీలించారు. అనంతరం హరిజన వాడ లోని ఇల్లు లేని లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇల్లు కేటాయించి, ముగ్గు వేసి ఇంటి పనులను ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ ప్రారంభించారు. ఈ సందర్భంగా షబ్బీర్ అలీ మాట్లాడుతూ... రాష్ట్రం అప్పుల్లో ఉన్న ఇల్లు లేని నిరుపేదలకు ఇచ్చిన మాట ప్రకారం ఇల్లు కట్టించి హామీలను అమలు చేస్తున్నామన్నారు. రాష్ట్రవ్యాప్తంగా సుమారు నాలుగు లక్షల 50 వేల ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేశామన్నారు.
అనంతరం ఆయన దోమకొండ మండల కేంద్రంలోనీ చాముండేశ్వరి దేవి స్వామి ఆలయ కమిటీ ప్రమాణ స్వీకార మహోత్సవంలో పాల్గొన్నారు. చాముండేశ్వరి దేవి స్వామి దేవాలయ కమిటీ నూతన అధ్యక్షుడు పాలకవర్గ సభ్యులతో షబ్బీర్ అలీ సమక్షంలో ప్రమాణ స్వీకారం చేయించారు. చాముండేశ్వరి దేవి స్వామి ఆలయ కమిటీ ట్రస్ట్ బోర్డు మెంబర్లుగా పెద్దారెడ్డి సిద్ధారెడ్డి, నార్ల వెంకటేశం, నర్ర గుల్ల ఎల్లయ్య, నిమ్మ రాజేశ్వరి, పూల బోయిన రమేశ్ లతో ప్రమాణ స్వీకారం చేయించారు. ఆలయ అభివృద్ధికి నా వంతు శాయశక్తుల కృషి చేస్తానని షబ్బీర్అలీ తెలిపారు. ఆయన వెంట స్థానిక కాంగ్రెస్ లీడర్లు ఉన్నారు.