వేదాంత వారి పాట..సర్కారు ఆస్తులే టార్గెట్​

వేదాంత వారి పాట..సర్కారు ఆస్తులే టార్గెట్​

న్యూఢిల్లీ: ప్రభుత్వ కంపెనీలను కొనుగోలు చేయడానికి వేదాంత రిసోర్సెస్ లిమిటెడ్ 10 బిలియన్ డాలర్ల (దాదాపు 74,420 కోట్లు) ఫండ్​ను రెడీ చేసుకుంటోంది. భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (బిపిసిఎల్) ​తోపాటు షిప్పింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎస్సీఐ) వంటి సంస్థల్లో వాటాల కొనుగోలుకు ధరలను ప్రకటించిన తరువాత అన్ని వివరాలూ వెల్లడిస్తామని వేదాంత చైర్మన్ అనిల్​ అగర్వాల్​ అన్నారు. బీపీసీఎల్​, ఎస్‌సిఐలో 12 బిలియన్ డాలర్లకు పైగా విలువైన ప్రభుత్వ వాటాను కొంటామని ఒక ఇంటర్వ్యూలో చెప్పారు.  సొంత వనరులు,  బయటి ఇన్వెస్ట్​మెంట్లతో దీనిని తయారు చేస్తామని చెప్పారు. ఇందులో ఇన్వెస్ట్​మెంట్ల కోసం ప్రత్యేకించి సావరిన్ వెల్త్ ఫండ్స్ నుండి ఎంతో ఆసక్తి కనిపిస్తోందని తెలిపారు. పదేళ్ల జీవితకాలంతో ఫండ్‌ను సృష్టించడం, కంపెనీలను అమ్మేముందు వాటి లాభదాయకతను పెంచడం వేదాంత ఆలోచన. ఫండ్‌ను రూపొందించేందుకు లండన్‌కు చెందిన సెంట్రిక్స్​తో వేదాంత జట్టుకట్టనున్నట్లు అగర్వాల్ గతంలో ప్రకటించారు. ప్రస్తుతం సెంట్రిక్స్ 28 బిలియన్ డాలర్ల ఆస్తులను పర్యవేక్షిస్తున్నది.  బీపీసీఎల్ కొనుగోలుకు అవసరమైన పనులను వేదాంత పూర్తి చేసినప్పటికీ, ఇందులో వాటాల అమ్మకానికి బిడ్డింగ్​ను ప్రభుత్వం వాయిదా వేసింది. ‘‘ప్రభుత్వం పెట్టుబడుల ఉపసంహరణ కార్యక్రమాన్ని ప్రారంభించిన వెంటనే రంగంలోకి దిగుతాం. బిడ్డింగ్ మొదలుపెట్టిన వెంటనే మేం బిడ్స్​ వేస్తాం ”అని ఆయన వివరించారు. లండన్​లోని చిన్న స్క్రాప్ మెటల్ వ్యాపారాన్ని  వేదాంత రిసోర్సెస్‌ కంపెనీగా మార్చిన అగర్వాల్, గతంలోనూ ప్రభుత్వం కంపెనీలను కొనుగోలు చేసి వాటిని చక్కదిద్దడం ద్వారా ఎంతో సంపాదించారు. 2001లో వేదాంత.. భారత్ అల్యూమినియం కంపెనీ లిమిటెడ్ (బాల్కో)ను కొనుగోలు చేసింది. ఆ తర్వాత 2002-–03లో  హిందుస్థాన్ జింక్‌ను కొన్నది. 2007లో సెసా గోవా లిమిటెడ్‌లో 51 శాతం వాటాను దక్కించుకుంది 2018లో ఎలక్ట్రోస్టీల్ స్టీల్స్ లిమిటెడ్ (ఈఎస్ఎల్)ని స్వాధీనం చేసుకుంది. సౌదీ అరేబియాలోని జింక్, బంగారం  మెగ్నీషియం గనుల్లో పెట్టుబడులకు గల అవకాశాలను కూడా వేదాంత పరిశీలిస్తోందని ఈ సంగతి తెలిసిన వర్గాలు వెల్లడించాయి.