ఆర్ఆర్ఆర్ వెంట పేదల అసైన్డ్ భూములకు ఎసరు

ఆర్ఆర్ఆర్ వెంట పేదల అసైన్డ్ భూములకు ఎసరు
  • ల్యాండ్​ పూలింగ్​ పేరిట  ఆఫీసర్ల సర్వేలు
  • ఆందోళన చెందుతున్న పేద రైతులు 

మెదక్/యాదాద్రి, వెలుగు: హైదరాబాద్​ చుట్టూ రీజినల్​ రింగ్ రోడ్డు (ఆర్​ఆర్​ఆర్​) పనులు ఇంకా మొదలుకాకముందే సర్కారు రియల్​ దందాకు తెరలేపింది. పేదలకు గతంలో ఇచ్చిన అసైన్డ్​ భూములను సేకరించి, వెంచర్లుగా మార్చి అమ్మేందుకు హెచ్​ఎండీఏ ఆధ్వర్యంలో ఆఫీసర్లను రంగంలోకి దించింది. లాండ్​పూలింగ్​ పేరుతో తమ భూములను లాక్కునేందుకు సర్కారు చేస్తున్న ప్రయత్నాలపై రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.​ సేకరించే ప్రతి ఎకరాకు 400 నుంచి 600 గజాల ప్లాట్లు ఇస్తామని ఆఫీసర్లు మభ్యపెడుతుండగా, బువ్వపెట్టే భూములకు బదులు ప్లాట్లు తీసుకొని ఏం చేసుకోవాలని రైతులు ప్రశ్నిస్తున్నారు. 
అసైన్డ్​ భూములే టార్గెట్​.. 
రీజనల్​ రింగ్​ రోడ్డు మొదటి ఫేజ్​ అలైన్​మెంట్​ ఖరారైంది. దీంతో ఈ రోడ్డు ఏఏ గ్రామాల మీదుగా వెళ్తుందో.. ఎక్కడెక్కడ జంక్షన్లు నిర్మించనున్నారో తేలిపోయింది. రోడ్డు నిర్మించనున్న గ్రామాల్లో ఇటీవల రెవెన్యూ అధికారులు అసైన్డ్​ భూముల సర్వే ప్రారంభించారు. మొదటి ఫేజ్​లో సంగారెడ్డి నుంచి నర్సాపూర్,  తూప్రాన్,​ గజ్వేల్,​ జగదేవపూర్,​ భువనగిరి మీదుగా  చౌటుప్పల్ వరకు 158 కిలోమీటర్ల రోడ్డు నిర్మాణానికి కేంద్రం గ్రీన్​ సిగ్నల్​ ఇచ్చింది.  రోడ్డు నిర్మాణం కోసం భూసేకరణ చేపట్టేందుకు ప్రత్యేక విభాగాలను ఏర్పాటు చేస్తున్నారు. ఈ క్రమంలో సర్కారు ఆదేశాల మేరకు ట్రిపుల్​ఆర్​పక్కన ల్యాండ్ పూలింగ్ పై హెచ్​ఎండీఏ దృష్టి పెట్టింది. సరిపడా సర్కారు భూములు లేకపోవడంతో అసైన్డ్​​ భూములను సేకరించాలని నిర్ణయించింది. ట్రిపుల్​ ఆర్​ పరిధిలో ఎనిమిది చోట్ల జంక్షన్లు ఏర్పాటు కానున్నాయి. జంక్షన్ల దగ్గర రాబోయే రోజుల్లో భారీ మాల్స్​ ఏర్పాటయ్యే అవకాశం ఉంది. ఇందుకోసం ట్రిపుల్​ ఆర్​ వెళ్లే గ్రామాలతోపాటు.. జంక్షన్లు నిర్మించే గ్రామాల్లో పెద్ద ఎత్తున ల్యాండ్​ పూలింగ్​ చేయాలని భావిస్తున్నారు.  
గ్రామాల్లో కొనసాగుతున్న సర్వే.. 
మెదక్ జిల్లాలోని తూప్రాన్ ​టౌన్​, ఇదే మండలంలోని  ఇస్లాంపూర్ లలో అసైన్డ్​ భూములను సేకరించేందుకు ఆఫీసర్లు రంగంలోకి దిగారు. ఇస్లాంపూర్ ​శివారులో రామప్పగుట్ట పక్కనుంచి లంబాడితండా వరకు 14 సర్వే నంబర్​లో దాదాపు 340 ఎకరాల అసైన్డ్​, పరంపోగు  భూములున్నాయి. అసైన్డ్​ భూములను రైతులు సాగు చేసుకుంటుండగా.. కొన్ని భూములు పడావుగా ఉన్నాయి.  ఇటీవల రెవెన్యూ ఆఫీసర్లు  వీటిని సర్వే చేశారు.

తూప్రాన్​ మండల పరిధిలోని ఇమాంపూర్, ఘనపూర్​, శివ్వంపేట మండలంలోని గంగాయిపల్లి,   చిన్నగొట్టిముక్ల  గ్రామాల్లోనూ అసైన్డ్​​ భూముల సర్వే చేస్తున్నారు. యాదాద్రి జిల్లా చౌటుప్పల్ మండలంలోని ఆర్​ఆర్​ఆర్​ పక్కనే ఉన్న ఎస్ లింగోటం గ్రామంలో సర్వే నంబర్లు 252,268,269లోని 114 ఎకరాలను ల్యాండ్ పూలింగ్​లో భాగంగా గుర్తించారు.  1975లో అప్పటి ప్రభుత్వం ఎస్సీలకు పంపిణీ చేసిన ఈ భూములను ఇటీవలే హెచ్​ఎండీఏ ఆఫీసర్లు పరిశీలించారు. ఎవరెవరికి ఎంత భూమి ఉంది, వారు ఎన్ని ఎకరాల్లో కాస్తు చేస్తున్నారు లాంటి వివరాలు తీసుకున్నారు. సమగ్ర వివరాలతో సర్కారుకు రిపోర్టు పంపారు.  
సర్కారు ఆఫర్​ను తిరస్కరిస్తున్న రైతులు 
రీజినల్​ రింగ్​రోడ్డు కింద భూములు కోల్పోవాల్సి వస్తోందని ఆందోళన చెందుతున్న రైతులు ట్రిపుల్​ఆర్​ పక్కనున్న గ్రామాలు, జంక్షన్లు ఏర్పాటయ్యే ఏరియాల్లో అసైన్​మెంట్​ ల్యాండ్స్​ను  కూడా లాక్కుంటారేమోనని భయపడుతున్నారు.  ఆఫీసర్లు మాత్రం ఎలాంటి ఆందోళన అక్కర్లేదని , సేకరించే ప్రతి ఎకరాకు వెంచర్లు చేశాక ప్లాట్లు ఇస్తామని మభ్యపెడుతున్నారు.  

యాదాద్రి జిల్లా చౌటుప్పల్ మండల పరిధిలోని ఎస్. లింగోటం గ్రామంలో  114 ఎకరాల అసైన్డ్ భూమిని  వెంచర్ చేయాలని దాదాపుగా నిర్ణయించారు. భూమిని సాగు చేస్తున్నవాళ్లలో 75 మంది ఎస్సీలు, కొందరు బీసీలు ఉన్నారు. వీళ్లకు ఒక్కో ఎకరానికి 400 నుంచి 600 గజాల చొప్పున ప్లాటు ఇస్తామని చెప్పారు. ఈ నిర్ణయాన్ని రైతులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.  బువ్వ పెట్టే భూములను అమ్ముకొని తాము ఎలా బతకాలని ప్రశ్నిస్తున్నారు.  పోచంపల్లి, బీబీనగర్ మండలాల్లో కూడా వెంచర్లు చేసేందుకు అసైన్డ్ భూములను గుర్తిస్తుండగా, రైతులు  తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. తమకు మాట మాత్రమైనా చెప్పకుండా సర్వే చేశారని, అలాగే  భూములు కూడా స్వాధీనం చేసుకుంటారేమోనని భయపడుతున్నారు.

ప్లాట్లు ఏం చేసుకోవాలె
సాగు చేసుకొని బతకమని అప్పటి ప్రభుత్వం 1975లో భూములిచ్చింది. అప్పటి నుంచి ఈ భూములపై ఆధారపడి కుటుంబాలను పోషించుకుంటున్నం. ఇప్పుడు భూమిని తీసుకొని ప్లాట్లు ఇస్తమంటున్నరు. ప్లాట్లను ఏం చేసుకోవాలె. మాకు ప్లాట్లు వద్దని ఆఫీసర్లకు చెప్పినం. మీకు ఇష్టం లేకుంటే భూములు తీసుకోబోమని అంటున్నరు. కానీ సర్కారు మీ భూమి  వాపస్ తీసుకుంటదని కొంతమంది వచ్చి  భయపెడుతున్నరు. ఏదేమైనా మా భూములు మాత్రం వాపస్​ ఇయ్యం.  -శంకరయ్య, రైతు